ongole rims
-
చదవలేకపోతున్నానని.. మెడికో ఆత్మహత్య
ఏపీలోని ఒంగోలు రిమ్స్ విద్యార్థి - ఇంటికి వచ్చి బలవన్మరణం - మృతుడి వద్ద సూసైడ్‌నోట్ మరిపెడ (డోర్నకల్): ‘నన్ను క్షమించండి.. నేను చదవలేకపోతున్నా.. మీరు కోరుకున్నట్లు నేను డాక్టర్‌ను కాలేనేమో’ అని సూసైడ్ నోట్ రాసి వైద్య విద్యార్థి గుగులోత్ మనోకృష్ణ (20) గురువారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలానికి చెందిన గుగులోతు నామ ప్రభుత్వ ఉపాధ్యాయుడు, భార్య శోభ ఎంపీటీసీ సభ్యురాలు. వీరికి ఇద్దరు కుమారులుండగా, ఇద్దరినీ ఎంబీబీఎస్ చదివిస్తున్నారు. పెద్ద కుమారుడు మనోజ్ నల్లగొండ జిల్లా లోని నార్కట్‌పల్లి వద్ద ఉన్న కామినేని ఆస్పత్రిలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. చిన్న కుమారుడు మనోకృష్ణ ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు రిమ్స్ ప్రభు త్వ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతు న్నాడు. ప్రథమ సంవత్సరంలో కళాశాలలోనే 75 శాతం మార్కులతో 9వ ర్యాంక్ సాధించాడు. మనోకృష్ణ శనివారం ఇంటికి వచ్చాడు. అక్కడ ఏమైనా ఇబ్బందులున్నాయా? అని తండ్రి ప్రశ్నించగా.. అలాంటిదేం లేదన్నాడు. మనోకృష్ణ గురువారం సినిమా చూసి ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మనో కృష్ణ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. తండ్రి ఇంటికి వచ్చి తలుపులు తెరవగా కొడుకు శవమై కనిపిం చాడు. భార్యకు చెప్పగా మండల సభ నుంచి కన్నీరుమున్నీరవుతూ ఇంటికి వచ్చారు. డీఎస్ రెడ్యానాయక్, మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ గుడిపుడి నవీన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అన్నా.. అన్నీ నీవే.. మనోకృష్ణ సూసైడ్ నోట్ రాసి, బెడ్‌పై పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ నోట్లో ఉన్న వివరాలను సీఐ శ్రీనివాస్ వివరించారు. ‘అన్నా.. మీ అందరినీ వదిలి వెళ్లాలని లేదు. కానీ, చదువుకోవడంలో నాకు నిర్లక్ష్యం ఉంది. నేను అనుకున్న ప్రకారం డాక్టర్‌ను కానేమో అనే అనుమానం తలెత్తింది. దీంతో చాలా రోజులుగా నరకయాతన అనుభవించాను. చివరకు తప్పని సరి ఇక భూమిమీద ఉండొద్దనే ఆలోచనకు వచ్చి ఈ నిర్ణయం తీసుకున్నా. ఇది తప్పే అని తెలిసి కూడా ఆత్మహత్యకు పాల్పడుతున్నా. ఇక అన్నీ నీవే.. అమ్మనాన్నలను జాగ్రత్తగా చూసుకో.. నాకు సాయి, వంశీ, రాజీ, సతీశ్, గోపీ, వసంత ఆంటీ కుటుంబసభ్యులుగా సహకరించారు. నేను ఎక్కడున్నా మీ హృదయాల్లో నిలిచి ఉంటాను. మిమ్మల్ని వదిలి తీసుకున్న ఈ నిర్ణయానికి నన్ను క్షమించాలని కోరుకుంటున్నా’ అని రాశాడు. -
వైద్య విద్యార్థినులపై వేధింపులు.. ప్రొఫెసర్ అరెస్ట్
ఒంగోలు: వైద్య విద్యార్థినులపై వేధింపులకు పాల్పడుతున్న ఓ ప్రొఫెసర్‌ను పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేసిన ఘటన ఒంగోలులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే... ఒంగోలు రిమ్స్ వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బంకా రత్నం (35)ను గత కొంతకాలంగా కాలేజీలోని వైద్య విద్యార్థినులను వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో బాధిత విద్యార్థినులు బుధవారం జిల్లా ఎస్పీ త్రివిక్రమ్ వర్మను కలిసి ప్రొఫెసర్ వేధింపులపై ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఒంగోలు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి బంకా రత్నంను అరెస్ట్ చేశారు. వేధింపులపై పోలీసులు ఆయన్ను విచారిస్తున్నారు. -
లారీని ఢీకొన్న ఆటో, ఇద్దరి మృతి
-
లారీని ఢీకొన్న ఆటో, ఇద్దరి మృతి
ప్రకాశం: ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ మండలం కలికివాయి సమీపంలో తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొట్టడంతో ఇద్దరు మృతిచెందగా, 11మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించినట్టు సమాచారం. వీరంతా ఉలవపాడు మండలం చాగిచర్లకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. -
రిమ్స్‌కే రోగమొచ్చింది
జిల్లాకే పెద్ద దిక్కుగా నిలవాల్సిన రిమ్స్ మంచాన పడింది. అరకొర సదుపాయాలు, వైద్యుల నిర్లక్ష్యం, సిబ్బందికి జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం వైఫల్యాలు రిమ్స్ అభివృద్ధికి ప్రతిబంధకాలుగా నిలిచాయి. మరోవైపు జిల్లాలో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. ఇప్పటికే ఇద్దరు మృత్యువాత పడగా మరో ఐదుగురు ఈ లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. ఇంత జరుగుతున్నా అక్కడ పూర్తిస్థాయి వైద్యసేవలు అందించలేని నిస్సహాయ స్థితిలో అధికారులున్నారు. జులై నెలలో ఇదే ఆసుపత్రికి ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాసరావు వచ్చి పలు ఆదేశాలిచ్చినా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. తరువాత మంత్రి శిద్దా, కలెక్టర్ విజయకుమార్ వచ్చి కన్నెర్ర చేసినా పట్టించుకునే నాథుడే కరవాయే. వందసీట్లెప్పుడు...? మరో వైపు జిల్లాకు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రిమ్స్ పూర్తి కాకుండానే కునారిల్లే పరిస్థితికి వచ్చింది. ఎంబీబీఎస్ నాల్గో సంవత్సరం ప్రారంభమైనా నిర్మాణ పనులు ఇంకా సా...గుతూనే ఉన్నాయి. దీంతో ఏ ఏడాదికాయేడు రిమ్స్ సీట్లను ఎంసీఐ ఇవ్వకపోవడం, మళ్లీ ప్రభుత్వం కదిలి అనుమతులు తెప్పించడం జరుగుతూ వస్తోంది. ఈ ఏడాది కూడా వంద సీట్లకు అనుమతిచ్చే పరిస్థితి కనపడటం లేదు. ప్రతిసారీ మెడికల్ కౌన్సిల్ తనిఖీలకు వచ్చే ముందు హడావుడిగా పనులను చేయడం తనిఖీలు అయిన అనంతరం నత్తతో పోటీ పడుతూ నిర్మాణాలు చేయడం కాంట్రాక్టర్లకు రివాజుగా మారింది. జీతాలకూ కనా కష్టం రిమ్స్‌లో కాంట్రాక్టు సిబ్బందికి జీతాలిచ్చి ఏడు నెలలయింది. వీరికి జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. వారికి కాంట్రాక్టు పొడిగింపులో కూడా నిర్లక్ష్యం కనపడుతోంది. మరోవైపు రిమ్స్‌కు ప్రొఫెసర్ల కొరత తీవ్రంగా ఉంది. జనరల్ సర్జరీ,అనాటమీ, ఫిజియాలజీ, పీడియాట్రిక్స్,అర్ధ్రోపెడిక్స్, రేడియాలజీ, టి.బి., సైకాలజీ, జనరల్ మెడిసిన్ తదితర విభాగాలలో ఫ్రొఫెసర్ల కొరత తీవ్రంగా ఉంది. రిమ్స్‌లో అత్యాధునిక పరికరాలున్నా సిబ్బంది కొరతతో వాటిని ఉపయోగించే పరిస్థితి లేకుండాపోతోంది. పరికరాలు సరఫరా చేసి నాలుగేళ్లు గడుస్తున్నప్పటికీ వాటిని వాడకపోవడంతో పనికి రాకుండా పోయే ప్రమాదం ఉంది. రిమ్స్‌లో ఎన్ని వెంటిలేటర్లున్నాయనే విషయం వైద్యులకే తెలియని పరిస్థితి ఉంది. మందిలించినా మార్పు లేదు.. జిల్లా కేంద్రంలో ఉన్న వైద్య కళాశాల అయినప్పటికీ, ట్రామా సెంటర్ ఉన్నప్పటికీ దాదాపు 50 శాతానికి పైగా కేసులను గుంటూరు జనరల్ అసుపత్రికి రిఫరల్ చేసి వైద్యులు చేతులు దులుపుకుంటున్నారు. గుంటూరు గైనిక్ విభాగం వారు రిమ్స్ నుంచి రిఫరల్ కేసులన్నింటిటినీ నమోదు చేసి ఈ నివేదికను డీఎంఈ కి పంపారు. దీంతో డీఎంఈ రిమ్స్ అధికారులను చీవాట్లు పెట్టారు. జాతీయ రహదారుల శాఖ అంబులెన్సును, రిమ్స్‌కు చెందిన రెండు అంబులెనన్సులను, బ్లడ్ బ్యాంక్‌లోని అంబులెన్సులను ఉపయోగించకుండా ఖాళీగా పెట్టారు. రిమ్స్ క్యాజువాలిటీ విభాగంలో వీల్‌చైర్ లు కూడా అవసానదశకు చేరుకున్నాయి. ఇవి కూడా సిబ్బంది చేతులు తడిపితేనే నడుస్తాయి. ఎ.ఆర్.టి. సెంటర్లో ఎయిడ్స్ మందులు కూడా పూర్తిస్థాయిలో ఉండటం లేదు. వేళకు రారాయే... గతంలో రిమ్స్‌ను సంధర్శించిన సమయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ రిమ్స్‌లో వైద్యులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ విధుల్లో ఉండాల్సిందేనని ఆదేశించారు. దీన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికీ మెజార్టీ వైద్యులు ఉదయం 9 గంటలకు సంతకాలు పెట్టి 12 గంటలకు వెళ్లిపోతున్నారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు వచ్చి సంతకాలు పెడుతున్నారు. రాత్రి వేళల్లో స్పెషలిస్టు వైద్యుడు కాదు కదా, మాములు వైధ్యులు కుడా ఉండటంలేదు. వీరి పై పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కొరవడింది. గతంలో భారతీయ వైద్య మండలి తనిఖీకి వచ్చిన సమయంలో దాదాపు 13 కారణాలను ఎత్తి చూపింది. వీటిలో ముఖ్యంగా ఆడిటోరియం నిర్మాణం, అత్యాధునిక ఎక్స్‌రే మిషన్, ముఖ్యమైన విభాగాలకు ప్రత్యేకంగా ఆపరేషన్ ధియేటర్లు, వైద్యుల కొరత ఉన్నాయి. వీటిలో ఆడిటోరియం నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. ఎంసీఐ తనిఖీలకు వచ్చే లోపు పూర్తి కాదు కూడా. -
ఒంగోలు రిమ్స్‌లో 100 సీట్లు కోత
రాష్ట్రానికి ఎంసీఐ లేఖ కాలేజీల్లో వసతుల కల్పనకు ఆర్నెల్లు సమయమిచ్చినా ఫలితం సున్నా మెడికల్ కాలేజీలను నవంబర్‌లో తనిఖీ చేసిన ఎంసీఐ అధికారులు మరికొన్ని కళాశాలలకూ సీట్ల కోత తప్పదు.. త్వరలో నివేదిక ఇవ్వనున్న ఎంసీఐ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లపై కోతల కాలం మొదలైంది. ‘మీకు మరో అవకాశమిస్తున్నాం, ఆరు మాసాల్లో వసతులు పునరుద్ధరణ చేసి సీట్లు నిలుపుకోండి’ అంటూ భారతీయ వైద్యమండలి ఇచ్చిన అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిలుపుకోలేక పోయింది. దీంతో ఎంసీఐ కోతలు వేసేందుకు సిద్ధమైంది. ఒంగోలు రిమ్స్ కళాశాలకు చెందిన 100 ఎంబీబీఎస్ సీట్లను వచ్చే ఏడాదికి ఇవ్వలేమంటూ రెండు రోజుల కిందట రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఒంగోలు రిమ్స్‌కు ఈ సీట్లు అదనంగా ఇచ్చినవి కావు. ఉన్నవే పోతున్నాయంటే ఆ కళాశాల పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. 2015-16 సంవత్సరానికి ఒంగోలు రిమ్స్‌కు సంబంధించి 100 సీట్లు ఇవ్వకపోతే అసలు అడ్మిషన్లే ఉండవు. గత నాలుగేళ్లుగా ప్రతి ఏడాదీ ఇదే పరిస్థితి. చివరి నిమిషంలో ఎంసీఐని బతిమాలుకోవడం, అనుమతి తెచ్చుకోవడం జరుగుతోంది. ఈ దఫా మాత్రం కరాఖండీగా సీట్లు ఇవ్వలేమని ఎంసీఐ తేల్చి చెప్పింది. ఇప్పటికీ వసతులు కల్పించలేకపోయారు 2014 జూన్‌లో రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలకు సుమారు 300 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా కల్పించారు. ఈ సీట్లకు సంబంధించి అదనంగా కావాల్సిన వసతులన్నీ 2014 నవంబర్‌లోగా కల్పించాలని ఆదేశించారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిలు రాతపూర్వక హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎంసీఐ అధికారులు నవంబర్‌లో రాష్ట్రంలోని వైద్య కళాశాలలను తనిఖీ చేశారు. కొత్తగా కేటాయించిన సీట్లకు సంబంధించి ఎలాంటి వసతులూ ఏర్పాటు చేయలేదని తనిఖీల్లో తేలింది. దీంతో ఎంసీఐ తొలి వేటు ఒంగోలు రిమ్స్‌పై వేసింది. అదే బాటలో మరికొన్ని కళాశాలలు తొలివేటు ఒంగోలు రిమ్స్‌కు వేశారుగానీ.. అదే బాటలో మరికొన్ని కళాశాలలపైనా కోత పడే అవకాశం లేకపోలేదని వైద్య ఆరోగ్యశాఖకు చెందిన అధికారులే చెప్తున్నారు. కర్నూలు మెడికల్ కాలేజీ, ఎస్వీఆర్ మెడికల్ కాలేజీ (తిరుపతి), రంగరాయ మెడికల్ కాలేజీ (కాకినాడ), సిద్ధార్థ మెడికల్ కాలేజీ (విజయవాడ), గుంటూరు మెడికల్ కాలేజీ (గుంటూరు) తదితర కళాశాలల్లో 50 సీట్ల చొప్పున కోల్పోయే ప్రమాదమున్నట్టు తెలిసింది. ఇప్పటికే వీటిలో తనిఖీలు పూర్తయ్యాయని, ఈ కళాశాలల్లో సీట్లకు సంబంధించిన నివేదిక వారం రోజుల్లో ఇవ్వనున్నామని ఎంసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. అంతేకాదు 2014-15కు సంబంధించి నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు 150 ఎంబీబీఎస్ సీట్లు అనుమతిచ్చారు. వచ్చే ఏడాది దీనికి తగ్గ వసతులు లేకపోతే అక్కడ కూడా సీట్లు పోయే పరిస్థితి ఉంటుందని, ఇప్పటికీ అక్కడ పరిస్థితి బాగోలేదని ఎంసీఐ దృష్టికి వచ్చింది. -
ఎస్సై మృతదేహానికి పోస్టుమార్టం
ఒంగోలు సెంట్రల్ : తుపాకీ మిస్‌ఫైరై మరణించిన జె.పంగులూరు మండలం రేణంగివరం ఎస్సై కె.విష్ణుగోపాల్(28) మృతదేహానికి ఒంగోలు రిమ్స్‌లో శనివారం పోస్టుమార్టం నిర్వహించారు. ఫోరెన్సిక్ ప్రొఫెసర్ రాజ్‌కుమార్ ఆధ్వర్యంలోని వైద్యుల బృందం మధ్యాహ్నానికల్లా పోస్టుమార్టం పూర్తి చేసింది. ఒంగోలు డీఎస్పీ జాషువా, ఇతర పోలీసు అధికారులు రిమ్స్‌లోనే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ మధ్యాహ్నం 3 గంటల సమయంలో రిమ్స్‌కు చేరుకుని ఎస్సై మృతదేహాన్ని పరిశీలించి ఘన నివాళులర్పించారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుని తండ్రి రామకృష్ణ, తమ్ముడు ప్రవీణ్‌కుమార్‌లు మాట్లాడుతూ తమ కుటుంబానికి ఎస్సై విష్ణుగోపాలే పెద్ద దిక్కని, అంతా ఆయనపైనే ఆధారపడి జీవిస్తున్నామని, తమకు న్యాయం చేయాలని ఎస్పీని కోరారు. అనంతరం మృతదేహాన్ని ఐస్ బాక్సులో ఉంచి మార్చూరీ నుంచి బయటకు తీసుకువచ్చి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన టెంట్లో ఉంచారు. ఈ సందర్భంలో మృతుని తల్లి భోరున విలపించింది. అనంతరం ఎస్సై మృతదేహాన్ని స్వగ్రామం నెల్లూరు జిల్లా బోగోలు బిట్రగుంట తీసుకెళ్లారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, మాజీ ఎంపీ కరణం బలరామకృష్ణమూర్తిలు నివాళులర్పించారు. మృతుని తల్లిదండ్రులకు సంతాపం ప్రకటించారు. మృతుని కుటుంబ సభ్యులకు ఏఎస్పీ రాములు నాయక్, ఎస్బీ సీఐ తిరుమలరావు, వన్‌టౌన్ సీఐ కె.వెంకటేశ్వరరావు, ట్రాఫిక్ సీఐ రవిచంద్ర, పలువురు ఎస్సైలు, కానిస్టేబుళ్లు ఓదార్చారు.