రిమ్స్‌కే రోగమొచ్చింది | negligance in rims hospital in ongole district | Sakshi
Sakshi News home page

రిమ్స్‌కే రోగమొచ్చింది

Published Wed, Jan 28 2015 8:49 AM | Last Updated on Sat, Sep 2 2017 8:25 PM

negligance in rims hospital in ongole district

జిల్లాకే పెద్ద దిక్కుగా నిలవాల్సిన రిమ్స్ మంచాన పడింది. అరకొర సదుపాయాలు, వైద్యుల నిర్లక్ష్యం, సిబ్బందికి జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం వైఫల్యాలు రిమ్స్ అభివృద్ధికి ప్రతిబంధకాలుగా నిలిచాయి. మరోవైపు జిల్లాలో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. ఇప్పటికే ఇద్దరు మృత్యువాత పడగా మరో ఐదుగురు ఈ లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. ఇంత జరుగుతున్నా అక్కడ పూర్తిస్థాయి వైద్యసేవలు అందించలేని నిస్సహాయ స్థితిలో అధికారులున్నారు. జులై నెలలో ఇదే ఆసుపత్రికి ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాసరావు వచ్చి పలు ఆదేశాలిచ్చినా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. తరువాత మంత్రి శిద్దా, కలెక్టర్ విజయకుమార్ వచ్చి కన్నెర్ర చేసినా పట్టించుకునే నాథుడే కరవాయే.
 
వందసీట్లెప్పుడు...?
మరో వైపు జిల్లాకు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రిమ్స్ పూర్తి కాకుండానే కునారిల్లే పరిస్థితికి వచ్చింది. ఎంబీబీఎస్ నాల్గో సంవత్సరం ప్రారంభమైనా నిర్మాణ పనులు ఇంకా సా...గుతూనే ఉన్నాయి. దీంతో ఏ ఏడాదికాయేడు రిమ్స్ సీట్లను ఎంసీఐ ఇవ్వకపోవడం, మళ్లీ ప్రభుత్వం కదిలి అనుమతులు తెప్పించడం జరుగుతూ వస్తోంది. ఈ ఏడాది కూడా వంద సీట్లకు అనుమతిచ్చే పరిస్థితి కనపడటం లేదు. ప్రతిసారీ మెడికల్ కౌన్సిల్ తనిఖీలకు వచ్చే ముందు హడావుడిగా పనులను చేయడం తనిఖీలు అయిన అనంతరం నత్తతో పోటీ పడుతూ నిర్మాణాలు చేయడం కాంట్రాక్టర్లకు రివాజుగా మారింది.
 
జీతాలకూ కనా కష్టం
రిమ్స్‌లో కాంట్రాక్టు సిబ్బందికి జీతాలిచ్చి ఏడు నెలలయింది.  వీరికి జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. వారికి కాంట్రాక్టు పొడిగింపులో కూడా నిర్లక్ష్యం కనపడుతోంది. మరోవైపు రిమ్స్‌కు ప్రొఫెసర్ల కొరత తీవ్రంగా ఉంది. జనరల్ సర్జరీ,అనాటమీ, ఫిజియాలజీ, పీడియాట్రిక్స్,అర్ధ్రోపెడిక్స్, రేడియాలజీ, టి.బి., సైకాలజీ, జనరల్ మెడిసిన్ తదితర విభాగాలలో ఫ్రొఫెసర్ల కొరత తీవ్రంగా ఉంది. రిమ్స్‌లో అత్యాధునిక పరికరాలున్నా సిబ్బంది కొరతతో వాటిని ఉపయోగించే పరిస్థితి లేకుండాపోతోంది.  పరికరాలు సరఫరా చేసి నాలుగేళ్లు గడుస్తున్నప్పటికీ వాటిని వాడకపోవడంతో పనికి రాకుండా పోయే ప్రమాదం ఉంది. రిమ్స్‌లో ఎన్ని వెంటిలేటర్లున్నాయనే విషయం వైద్యులకే తెలియని పరిస్థితి ఉంది.

మందిలించినా మార్పు లేదు..
జిల్లా కేంద్రంలో ఉన్న వైద్య కళాశాల అయినప్పటికీ, ట్రామా సెంటర్ ఉన్నప్పటికీ దాదాపు 50 శాతానికి పైగా కేసులను గుంటూరు జనరల్ అసుపత్రికి రిఫరల్ చేసి వైద్యులు చేతులు దులుపుకుంటున్నారు.  గుంటూరు గైనిక్  విభాగం వారు రిమ్స్ నుంచి రిఫరల్ కేసులన్నింటిటినీ నమోదు చేసి ఈ నివేదికను డీఎంఈ కి పంపారు. దీంతో డీఎంఈ రిమ్స్ అధికారులను చీవాట్లు పెట్టారు.

జాతీయ రహదారుల శాఖ అంబులెన్సును, రిమ్స్‌కు చెందిన రెండు అంబులెనన్సులను, బ్లడ్ బ్యాంక్‌లోని అంబులెన్సులను ఉపయోగించకుండా ఖాళీగా పెట్టారు. రిమ్స్ క్యాజువాలిటీ విభాగంలో వీల్‌చైర్ లు కూడా అవసానదశకు చేరుకున్నాయి. ఇవి కూడా సిబ్బంది చేతులు తడిపితేనే నడుస్తాయి. ఎ.ఆర్.టి. సెంటర్‌లో ఎయిడ్స్ మందులు కూడా పూర్తిస్థాయిలో ఉండటం లేదు.

వేళకు రారాయే...
గతంలో రిమ్స్‌ను సంధర్శించిన సమయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ రిమ్స్‌లో వైద్యులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ విధుల్లో ఉండాల్సిందేనని ఆదేశించారు. దీన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికీ మెజార్టీ వైద్యులు ఉదయం 9 గంటలకు సంతకాలు పెట్టి 12 గంటలకు వెళ్లిపోతున్నారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు వచ్చి సంతకాలు పెడుతున్నారు. రాత్రి వేళల్లో  స్పెషలిస్టు వైద్యుడు కాదు కదా, మాములు వైధ్యులు కుడా ఉండటంలేదు. వీరి పై పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కొరవడింది.  గతంలో భారతీయ వైద్య మండలి తనిఖీకి వచ్చిన సమయంలో దాదాపు 13 కారణాలను ఎత్తి చూపింది. వీటిలో ముఖ్యంగా ఆడిటోరియం నిర్మాణం, అత్యాధునిక ఎక్స్‌రే మిషన్, ముఖ్యమైన విభాగాలకు ప్రత్యేకంగా ఆపరేషన్ ధియేటర్లు, వైద్యుల కొరత ఉన్నాయి. వీటిలో ఆడిటోరియం నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. ఎంసీఐ తనిఖీలకు వచ్చే లోపు పూర్తి కాదు కూడా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement