సాక్షి, ఢిల్లీ: నీట్ జాతీయ పూల్‌లోకి ఏపీ వచ్చిందని ఏపీ వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం ఢిల్లీకి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వైద్య విద్య సీట్ల భర్తీలో 371డి నిబంధన నుంచి ఏపీకి కేంద్రం మినహాయింపు ఇచ్చిందంటూ అందుకు ధన్యవాదాలు తెలిపారు. నీట్ జాతీయ పూల్‌లోకి ఏపీతోపాటు తెలంగాణ, జమ్ముకాశ్మీర్ వచ్చాయన్నారు. వచ్చే ఏడాది (2018-19) నుంచి 371డి నిబంధన నుంచి ఏపీకి మినహాయింపు లభించనుందని, జాతీయ పూల్‌లో చేరడంవల్ల వచ్చే ఏడాది నుంచి వైద్య సీట్లలో రాష్ట్ర విద్యార్ధులు ఎంబీబీఎస్, పీజీలో ఎక్కువ సీట్లకు పోటీపడే అవకాశం లభించడం కలిసి వచ్చే అంశమని చెప్పారు.
దేశవ్యాప్తంగా 27,710 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా ఏపీలో 1900 సీట్లు ఉన్నాయని, రాష్ట్రం జాతీయ పూల్ కింద 15 శాతం సీట్లు (285) కోల్పోయినా జాతీయస్థాయిలో 16 రెట్లు అధికంగా(4482) సీట్లకు పోటీపడే అవకాశం లభిస్తుందని వివరించారు. అలాగే దేశవ్యాప్తంగా 13,872 పీజీ సీట్లు ఉండగా మన రాష్ట్రంలో 660 సీట్లు ఉన్నాయని, వీటిలో 50శాతం అంటే 330 జాతీయ పూల్‌కు ఇస్తే దేశవ్యాప్తంగా 7236 పీజీ సీట్లకు పోటీపడేందుకు అవకాశం ఉందన్నారు. 371డి నిబంధన మినహాయింపు, ఫాతిమా మెడికల్ కళాశాల విద్యార్ధుల అంశంపై కేంద్ర మంత్రి నడ్డాతో మంగళవారం మరోసారి సమావేశం కానున్నట్లు కామినేని తెలిపారు.
నీట్ జాతీయ పూల్‌లోకి ఏపీ: మంత్రి కామినేని
Published Tue, Dec 19 2017 7:25 PM | Last Updated on Sat, Oct 20 2018 5:44 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment