ఢిల్లీలో మిస్టరీ.. ఇన్సులిన్‌ ఎక్కించి హత్య? | tirupur medical student died in delhi aims | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో మిస్టరీ.. ఇన్సులిన్‌ ఎక్కించి హత్య చేశారా?

Published Thu, Jan 18 2018 10:42 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

tirupur medical student died in delhi aims - Sakshi

సాక్షి, చెన్నై: ఉన్నత చదువుకు ఢిల్లీ వెళ్తున్న తమిళ విద్యార్థులకు భద్రత కరవు అవుతోంది. ప్రధానంగా వైద్య కోర్సుల్ని అభ్యషించేందుకు వెళ్తున్న విద్యార్థుల మరణాలు ఓ మిస్టరీగా మారుతున్నాయి. ఏడాదిన్నర క్రితం తిరుప్పూర్‌కు చెందిన శరవణన్‌ మరణం కలకలం రేపగా, ప్రస్తుతం శరత్‌ ప్రభు మరణం ఆందోళనలో పడేసింది. విషం ఇంజెక్షన్‌ ఇచ్చి హత్య చేసి ఉండొచ్చన్న అనుమానాలకు బలం చేకూరే రీతిలో శరవణన్‌ మరణ మిస్టరీ విచారణ కొలిక్కి వస్తున్నది. ఈ  సమయంలో అదే తిరుప్పూర్‌కు చెందిన మరో విద్యార్థి శరత్‌ ప్రభు విగతజీవిగా మారడం ఉన్నత చదువు నిమిత్తం ఢిల్లీలో ఉన్న తమిళ విద్యార్థుల తల్లిదండ్రుల్లో  ఆందోళన తప్పడం లేదు. 

నిన్న శరవణన్‌.. నేడు శరత్..
దేశ రాజధాని నగరం ఢిల్లీ ఎయిమ్స్‌ ఆస్పత్రి దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆస్పత్రుల్లో ఒకటి. ఇందులో ఢిల్లీ విద్యార్థులే కాదు, తమిళనాడు, కేరళ, కర్ణాటక వంటి పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు వైద్య ఉన్నత విద్యను అభ్యషిస్తున్నారు. ఏడాదిన్నర క్రితం తిరుప్పూర్‌కు చెందిన వైద్య పీజీ ఎండీ విద్యను అభ్యషిస్తున్న శరవణన్‌ అనుమానాస్పద మరణం తమిళనాట కలకలాన్ని రేపింది.  ఆ కేసు విచారణ నేటికీ సాగుతోంది. ఇది ముమ్మాటికి హత్యేనని వాదించే వాళ్లు ఎక్కువే. రాష్ట్రంలోని విద్యార్థి సంఘాలు, సంస్థలు, రాజకీయ పార్టీల పట్టుతో వ్యవహారం కోర్టుకు సైతం చేరింది. కోర్టు రీ పోస్టుమార్టం ఆదేశాలతో వచ్చిన నివేదికలో ఇన్సులిన్‌ ద్వారా హత్య చేసి ఉండడానికి కారణాలు ఉన్నట్టుగా తేలింది. దీంతో  అనుమానాలకు బలం చేకూరే విధంగా కోర్టు విచారణ సాగుతూ వస్తున్నది. ఈ నేపథ్యంలో బుధవారం అదే తిరుప్పూర్‌కు చెందిన శరత్‌ ప్రభు(25) మరణం ఢిల్లీలో తమిళ విద్యార్థులకు భద్రత కరువైందన్న విషయాన్ని తేట తెల్లం చేసింది. 

శరత్‌ మరణంతో ఆందోళన:  తిరుప్పూర్‌ జిల్లా పారప్పాళయం మంగళం సమీపంలోని ఇడువం పాళయం ప్రాంతానికి చెందిన సెల్వమణి , ధనలక్ష్మి దంపతుల కుమారుడు శరత్‌ ప్రభు(25) కోయంబత్తూరు మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేశాడు. తాను చదువుకున్న చదువు, మార్కులు, ప్రతిభకు గాను ఢిల్లీ ఎయిమ్స్‌ పరిధిలోని యూసీఎంఎస్‌ వైద్య కళాశాలలో ఎండీ ఉన్నత కోర్సు సీటు దక్కించుకున్నారు.  చివరి సంవత్సరం చదువుకుంటున్న శరత్‌ బాత్‌ రూమ్‌లో జారి పడ్డట్టు, మరి కాసేట్లో మరణించినట్టు వచ్చిన సమాచారం ఆ కుటుంబంలోనే కాదు ఢిల్లీలో ఉన్నత కోర్సుల్ని అభ్యషిస్తున్న తమిళ విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన బయలు దేరింది. 

అనుమానాలు..
ప్రతిరోజూ తల్లిదండ్రులతో మాట్లాడే శరత్‌ ప్రభు మంగళవారం కూడా అదే చేశాడు. రాత్రి పదిన్నర గంటల వరకు తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడి నిద్రకు ఉపక్రమించాడు. ఢిల్లీలోని యూసీఎంఎస్‌ కళాశాల హాస్టల్‌లో ఉంటున్న సహచర విద్యార్థుల నుంచి ఉదయాన్నే వచ్చిన ఫోన్‌కాల్‌ సెల్వమణి, ధనలక్ష్మి దంపతుల్ని కలవరంలో పడేశాయి. బుధవారం ఉదయం బస చేసి ఉన్న గదిలోని బాత్‌రూమ్‌లో శరత్‌ కింద పడ్డట్టు, ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్టుగా తొలుత ఓ ఫోన్‌కాల్‌ రావడం, మరి కాసేపటికి బాత్‌రూమ్‌లో పడి మరణించినట్టుగా వచ్చిన సమాచారాలతో ఆ కుటుంబం కన్నీటి సంద్రంలో మునిగింది. 

సహచర విద్యార్థుల నుంచి వచ్చిన పొంతన లేని సమాచారాలతో శరత్‌ మరణంలో అనుమానాలు బయలు దేరాయి. అదే సమయంలో శరత్‌ ప్రభు తండ్రి సెల్వమణి దృష్టికి కళాశాల నిర్వాహకులు తెచ్చిన సమాచారంలోనూ అనుమానాలు కొట్టొచ్చినట్టు కన్పించడంతో ఢిల్లీలో ఏదో జరిగిందన్న ఆందోళన తప్పడం లేదు. తక్షణం విమానం ద్వారా ఢిల్లీకి సెల్వమణి, ఆయన స్నేహితులు బయలు దేరి వెళ్లారు. శరవణన్‌ మరణ సమాచారం తరహాలోనే శరత్‌ మరణ సమాచారాలు ఉండడంతో ఇన్సులిన్‌ వేసి హతమార్చి, నాటకం సాగుతున్నదా అన్న అనుమానాల్ని వ్యక్తం చేసే వాళ్లు అధికమే.

ముమ్మాటికి హత్యే..
శరత్‌ ప్రభు మరణ సమాచారంతో గతంలో తనయుడు శరవణన్‌ను కోల్పోయిన తండ్రి గణేషన్‌ మీడియా ముందుకు వచ్చారు. తన కుమారుడి వేల శరత్‌ను కూడా హతమార్చి నాటకం సాగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. తాను న్యాయ పోరాటం చేస్తూ వస్తున్నానని, అందులో నిజాలు బయటకు వస్తున్నాయన్నారు. తమిళ విద్యార్థులకు ఢిల్లీలో భద్రత లేనే లేదని గతంలోనూ చెప్పాను అని, ఇప్పుడు కూడా తాను చెబుతున్నానని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ, తమిళ ప్రభుత్వం చోద్యం చూస్తున్నాయని, విద్యార్థులకు భద్రత కల్పించడంలో విఫలం అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇకనైనా మరో తమిళ విద్యార్థి బలి కాకుండా భద్రత కల్పించాలని, ఇందుకు విద్యార్థిలోకం గళం విప్పాలని పిలుపునిచ్చారు. ఈ మరణాల గురించి సీఎం పళనిస్వామిని మీడియా ప్రశ్నించగా,  ఇతర రాష్ట్రాలకు వెళ్లి చదవుకుంటున్న విద్యార్థులు తమ పేర్లను రాష్ట్ర ప్రభుత్వంలో నమోదు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఎవరు ఎక్కడ చదువుకుంటున్నారో అన్న గందరగోళం తప్పడం లేదన్నారు. ఇకనైనా తమ పేర్లను విద్యార్థులు నమోదు చేసుకోవాలని, విద్యార్థులకు భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement