దేశ రాజధాని ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అంటే ఎయిమ్స్ గురించి తెలియనివారెవరూ ఉండరు. దేశంలోని సుదూర ప్రాంతాల నుంచి కూడా బాధితులు ఎయిమ్స్‌కు వస్తుంటారు. అయితే ఎయిమ్స్‌ను ఎలా స్థాపించారో, దాని వెనుక ఎవరి చొరవ ఉందో తెలుసా?
దేశ తొలి మహిళా ఆరోగ్య మంత్రి రాజకుమారి అమృత్‌కౌర్ ఎయిమ్స్ గురించి కలలుగన్నారు. యువరాణి అమృత్ కౌర్ 1887 ఫిబ్రవరి 2న లక్నోలో జన్మించారు. ఆమె తండ్రి రాజా హర్నామ్ సింగ్ అహ్లువాలియాను బ్రిటీషర్లు ‘సర్’ బిరుదుతో సత్కరించారు. హర్నామ్ సింగ్ అహ్లువాలియా పంజాబ్‌లోని కపుర్తలా సంస్థానానికి చెందిన మహారాజుకు చిన్న కుమారుడు.
కపుర్తలా సింహాసనం విషయంలో వివాదం ప్రారంభమైనప్పుడు రాజా హర్నామ్ సింగ్ తన రాజ్యాన్ని విడిచిపెట్టి, కపుర్తలా నుండి లక్నోకు చేరుకున్నారు. అనంతరం హర్నామ్ సింగ్ అహ్లువాలియా అవధ్ రాచరిక రాష్ట్రానికి మేనేజర్‌గా చేరారు. అంతే కాదు క్రిస్టియన్ మతం స్వీకరించారు. హర్నామ్ సింగ్ అహ్లువాలియా పశ్చిమ బెంగాల్ (అప్పటి బెంగాల్)కు చెందిన ప్రిస్కిల్లాను వివాహం చేసుకున్నారు. ఆమె తండ్రి పేరు గోకుల్‌నాథ్ ఛటర్జీ. రాజా సాహెబ్, ప్రిస్కిల్లాకు తొమ్మిది మంది కుమారులు. యువరాణి అమృత్ కౌర్ 10వ సంతానంగా జన్మించారు.
రాజా హర్నామ్ సింగ్ అహ్లూవాలియా యువరాణి అమృత్ కౌర్‌ను చదువుకునేందుకు విదేశాలకు పంపారు. ఆమె ఇంగ్లాండ్‌లోని డోర్సెట్‌లోని షీర్‌బార్న్ స్కూల్ ఫర్ గర్ల్స్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేశారు. అనంతరం ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రురాలయ్యారు. చదువు పూర్తయ్యాక ఆమె 1908లో భారత్‌కు తిరిగివచ్చారు.
మహాత్మా గాంధీ రాజకీయ గురువు గోపాల్ కృష్ణ గోఖలేకు ప్రభావితురాలైన యువరాణి అమృత్ కౌర్ స్వాతంత్ర్య పోరాటంలో చేరారు. మహాత్మా గాంధీకి అభిమానిగా మారారు. దండి మార్చ్ సమయంలో జైలుకు వెళ్లారు. తల్లిదండ్రుల మరణానంతరం ఆమె 1930లో రాజభవనాన్ని విడిచిపెట్టి స్వాతంత్ర్య ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేశారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో అమృత్ కౌర్ గొప్ప పాత్ర పోషించారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత విద్యావంతులైన యువరాణి అమృత్ కౌర్ ఆరోగ్య మంత్రిగా నియమితులయ్యారు. వైద్యరంగంలో చికిత్స, పరిశోధనల కోసం దేశంలోనే ఉన్నతమైన వైద్యసంస్థను నెలకొల్పాలన్నది అమృత్ కౌర్ కల. ఇందుకోసం ఆమె 1956 ఫిబ్రవరి 18న లోక్‌సభలో కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. అమృత్ కౌర్ కల సాకారం కావాలని అందరూ కోరుకున్నారు.
అనంతరం యువరాణి అమృత్ కౌర్ ఎయిమ్స్ ఏర్పాటు కోసం నిధుల సేకరణను ప్రారంభించారు. అమెరికాతో పాటు స్వీడన్, పశ్చిమ జర్మనీ, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల నుంచి నిధులను సేకరించారు. సిమ్లాలోని తన ప్యాలెస్‌ను ఎయిమ్స్‌కు ఇచ్చారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చట్టం మే 1956లో పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందింది. ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీకి అధ్యక్షురాలైన మొదటి ఆసియా మహిళ గానూ కూడా అమృత్ కౌర్ ఖ్యాతి గడించారు. ఆమె 1964 ఫిబ్రవరి 6న న్యూఢిల్లీలో కన్నుమూశారు.
Comments
Please login to add a commentAdd a comment