'ఆర్టీసీకి రూ.17 కోట్ల నష్టం'
► విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌లో నగదు రహిత కార్యకలాపాలు
అమరావతి : పెద్ద నోట్ల రద్దు పరిణామం తర్వాత ఆర్టీసీ రూ.17 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు తెలిపారు. గురువారం విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో నగదు రహిత కార్యకలాపాల్లో భాగంగా స్వైపింగ్ యంత్రాలను మంత్రి శిద్ధా ప్రారంభించారు.
అనంతరం మంత్రి శిద్ధా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... తొలి విడత కష్ణా, గుంటూరు జిల్లాల్లో ఆర్టీసీ బస్టాండ్లలో టిక్కెట్ రిజర్వేషన్ కోసం 50 స్వైపింగ్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చారు. వారం రోజుల్లోగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్టాండ్లలో స్వైపింగ్ యంత్రాలను ఏర్పాటు చేసి ప్రయాణికులకు చిల్లర సమస్య లేకుండా చూస్తామన్నారు. త్వరలో రెగ్యులర్ సర్వీసుల్లో కూడా డ్రైవర్లకు స్వైపింగ్ యంత్రాలను అందిస్తామన్నారు. నగదు రహిత ప్రయాణాలకు ఆర్టీసీ శ్రీకారం చుట్టిందని, దశల వారీగా అన్ని సర్వీసుల్లో ఈ-పోస్ యంత్రాలు అందుబాటులో ఉంచుతామని ఆర్టీసీ ఎండీ మాలకొండయ్య పేర్కొన్నారు.