RTC losses
-
పెరిగిన డీజిల్ ధరలతో గ్రేటర్ ఆర్టీసీ కుదేల్
సాక్షి, హైదరాబాద్: పీకల్లోతు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న గ్రేటర్ ఆర్టీసీపై పెరిగిన ఇంధన ధరలు మరింత భారంగా మారాయి. ప్రతి రోజు కోట్లాది రూపాయలు ఇంధనం కోసం వెచ్చిస్తున్నారు. దీంతో ప్రయాణికుల నుంచి టికెట్లపై వచ్చే ఆదాయం కంటే ఖర్చులే అధికంగా ఉన్నాయి. విడిభాగాలు, ఇతర నిర్వహణ వ్యయం కంటే డీజిల్ కొనుగోలు కోసమే పెద్ద మొత్తంలో ఖర్చవుతున్నట్లు అంచనా. గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 2,550కిపైగా సిటీ బస్సులు ప్రతి రోజు 7.20 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నాయి. ఇందుకోసం రోజుకు 1.55 లక్షల లీటర్ల డీజిల్ వినియోగమవుతోంది. ఏటా నష్టాలతో కుదేలైన సంస్థలో కోవిడ్ అనంతరం ఇటీవల కాలంలో క్రమంగా ప్రయాణికుల ఆదరణ పెరుగుతోంది. సిటీ బస్సుల్లో ఆక్యుపెన్సీ సైతం 60 శాతానికిపైగా నమోదవుతున్నట్లు అంచనా. కానీ బస్సుల నిర్వహణ భారంగా మారడంతో అధికారులు ఇటీవల పెద్ద ఎత్తున దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఒకవైపు ప్రయాణికుల ఆదరణ పెంచుకొనేందుకు చర్యలు చేపడుతూనే తక్కువ వనరులతో ఎక్కువ ఫలితాలను సాధించేందుకు సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నారు. పొదుపుగా వాడితేనే.. ► ప్రస్తుతం నగరంలో రోజుకు రూ.2.5 కోట్ల వరకు ఆదాయం లభిస్తుండగా ఇంధనం, విడిభాగాలు, జీతభత్యాలు, బస్సుల నిర్వహణ తదితర అవసరాల కోసం రూ.3.5 కోట్లకుపైగా ఖర్చు చేయాల్సివస్తోంది. దీంతో రోజుకు రూ.కోటికిపైగా నష్టంతో సిటీ బస్సులు నడుస్తున్నాయి. ► ఈ క్రమంలో వనరుల వినియోగంపై అధికారులు దృష్టి సారించారు. ముఖ్యంగా పెరిగిన ఇంధన ధరలను దృష్టిలో ఉంచుకొని డీజిల్‌ను పొదుపుగా వినియోగిస్తే ప్రతినెలా కోట్లాది రూపాయలు ఆదా అవుతాయని అంచనా. ► సిటీ బస్సులు లీటర్ వినియోగంపై 4.67 (కేఎంపీఎల్) చొప్పున తిరుగుతున్నాయి. డీజిల్‌ను పొదుపుగా వినియోగించగలిగితే 0.1 కిలోమీటర్ అదనంగా పెంచుకొనే అవకాశం ఉంటుంది. అంటే ఒక లీటర్‌పై 4.77 కేఎంపీల్ పెంచుకోవచ్చు. ఇలా 0.1 కి.మీ అదనంగా పెరిగితే ప్రతినెలా రూ.కోటి ఆదా అవుతుంది. నెలకు రూ.12 కోట్లు మిగుతాయని ఓ ఆర్టీసీ ఉన్నతాధికారి తెలిపారు. అవగాహన కోసమే నోటీసులు.. డీజిల్ వినియోగంపై డ్రైవర్లలో అవగాహన పెంచి పొదుపు పాటించేందుకు కసరత్తు చేపట్టారు. ఒక డ్రైవర్ అదనంగా డీజిల్ వినియోగించడం వల్ల అయ్యే ఖర్చును నేరుగా అతనికే నోటీసుల రూపంలో అందజేస్తున్నారు. ‘డ్రైవర్లను అప్రమత్తం చేసేందుకు మాత్రమే వారి జీతాల్లోంచి ఎందుకు వసూలు చేయకూడదంటూ హెచ్చరిస్తున్నాం. కానీ అదనపు డీజిల్ భారాన్ని వారిపై మోపేందుకు కాదు’ అని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. డ్రైవర్ల చేతుల్లోనే ‘గేర్’.. ► ఇంధనాన్ని పరిమితంగా వినియోగించే నైపుణ్యం డ్రైవర్ల చేతుల్లోనే ఉంది. ఉదాహరణకు ఒకే రూట్లో, ఒకే దూరానికి కొంతమంది డ్రైవర్లు 50 లీటర్లు వినియోగిస్తే మరికొందరు 60 లీటర్ల వరకు వినియోగిస్తున్నారు. (క్లిక్: ఆ వెబ్సైట్ మాకు ఇప్పించండి!) ► గేర్లు మార్చే సమయంలో యాక్సిలేటర్‌ను అవసరానికి మించి నొక్కడం వల్ల ఇంజిన్లోకి డీజిల్ అదనంగా చేరుతుంది. ‘మొదటి గేర్‌పై బండి నడిపే సమయంలో ఏ మేరకు డీజిల్ అవసరమో ఆ మేరకు యాక్సిలేటర్ నొక్కాలి, కానీ అలా జరగడం లేదు. దీంతో ఎక్కువ డీజిల్ వినియోగమవుతోంది’ అని ఓ అధికారి వివరించారు. (క్లిక్: ఇంటర్నేషనల్ కన్స్ట్రక్షన్ వర్సిటీ సాధ్యమే) -
ఆర్టీసీ పాలిట ‘నష్ట’పరిహారం
సాక్షి, హైదరాబాద్: కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్లుగా ఆర్టీసీ నష్టాలకు అనేకానేక కారణాలు ఉన్నాయి. అప్పులు, పెరుగుతున్న డీజిల్ ధరలతో ముక్కుతూ మూలుగుతూ నెట్టుకొస్తోన్న ఆర్టీసీకి నష్టపరిహారం చెల్లింపులు అదనపు భారంగా మారాయి. ఏటా గరిష్టంగా రూ.35 కోట్ల వరకు వివిధ కేసుల్లో నష్టపరిహారంగా చెల్లిస్తోంది. ఈ పరిస్థితి తలెత్తడానికి కారణం ఆర్టీసీలో ప్రయాణీకులకు బీమా లేకపోవడమే. టోల్‌ట్యాక్స్, సెస్, రవాణా చార్జీలు మినహా టికెట్లపై ఇతర చార్జీలు వసూలు చేయరు. బీమా కింద ప్రత్యేకంగా ఎలాంటి రుసుం వసూలు చేయరు. ఇదే ఇప్పుడు ఆర్టీసీకి భారంగా మారింది. ప్రమాదాలు జరిగినపుడు చెల్లించాల్సిన నష్టపరిహారం సొంత నిధులనుంచే వెచ్చించాల్సి రావడం అదనపు భారంగా మారింది. ప్రస్తుతం క్యాట్ కార్డు, వనితా కార్డులకు మినహా ఎక్కడా బీమా సదుపాయం కల్పించడం లేదు. కొండగట్టు భారం రూ.1.8 కోట్లు తెలంగాణ ఆర్టీసీ చరిత్రలోనే ‘కొండగట్టు’అతిపెద్ద దుర్ఘటన. ఏకంగా 62 మంది అసువులు బాయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ప్రమాదంపై ఆర్టీసీ వెంటనే స్పందించి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. అంటే 62 మందికి రూ.1.8 కోట్లకుపైగా నష్టపరిహారం రూపంలో చెల్లించాలి. వీటిని సొంత నిధులనుంచే ఇవ్వాలి. ఈ విషయంలో బాధితుల కుటుంబసభ్యులు కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యునల్‌ని ఆశ్రయిస్తే, ఈ మొత్తం ఇంకా పెరిగే అవకాశాలు లేకపోలేదు. కానీ, ప్రమాదం జరిగి నెలరోజులు గడుస్తున్నా.. బాధితులకు ఇంకా పూర్తిస్థాయిలో పరిహారం అందకపోవడంతో బాధిత కుటుంబాలు ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. రైల్వేలో బీమా ఎలా ఉందంటే.. రైల్వేలో బీమా సదుపాయంకోసం ప్రతి ఆన్లైన్ టికెట్‌పై 90పైసల చొప్పున వసూలు చేస్తున్నారు. ఇందుకోసం ఐసీఐసీఐ, సుందరం, శ్రీరామ్ ఫైనాన్స్‌లాంటి సంస్థలతో భారతీయ రైల్వే ఒప్పందం చేసుకుంది. ఆ లెక్కన బీమా తీసుకున్న ప్రయాణికులు ప్రమాదవశాత్తూ చనిపోతే రూ.10 లక్షల పరిహారం చెల్లిస్తారు. శాశ్వతంగా అంగవైకల్యానికి గురైతే రూ.7.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల వరకు పరిహారం లభిస్తుంది. మరోవైపు ఈ బీమా కాకుండా రైల్వే నుంచి వచ్చే నష్టపరిహారం కూడా అందుతుంది. వెంటనే పరిహారం చెల్లించాలి కొండగట్టు ప్రమాదంలో బాధితులందరికీ పరిహారం చెల్లించాలి. సంస్థపై భారం తగ్గాలంటే ఆర్టీసీలో బీమా అమలు చేయాలి. ఈ పథకం వల్ల మృతుల కుటుంబాలకే కాదు, క్షతగాత్రులకూ మెరుగైన వైద్యం అందే వీలుంది. కేవలం కొందరి ప్రయోజనాల కోసం ప్రజలకు ఉపయోగపడే మంచి పథకాలను నిలువరించడం సరికాదని నాగేశ్వరరావు (ఎన్ఎంయూ), హన్మంత్ ముదిరాజ్ (టీజేఎంయూ)లు అభిప్రాయపడ్డారు. వెంటనే ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. ఆర్టీసీలో ఎందుకు విఫలమైంది..? వాస్తవానికి ఆర్టీసీలోనూ ఇదే తరహా ప్రయత్నం జరిగింది. ఏటా తమపై పడుతున్న నష్టపరిహారం (దాదాపుగా రూ.35 కోట్లు) భారం తగ్గించడం, బాధితులకు మెరుగైన పరిహారాన్ని చెల్లించాలన్న తలంపుతో ఉన్నతస్థాయిలో చర్చలు జరిగాయి. తొలుత ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని అనుకున్నారు. ఇందుకోసం బజాజ్ అలయెన్స్, సుందరంఫైనాన్స్ లాంటి కంపెనీలు ఆర్టీసీతో ఒప్పందానికి ముందుకు వచ్చాయి. ప్రతిపాదన ప్రకారం ఈ ఒప్పందం అమలు కావాలంటే.. ప్రతి టికెట్‌పై ఎంతో కొంత చార్జీలు పెంచాలి, కానీ, చార్జీలు పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న ఆందోళనతో కొందరు ఈ ప్రతిపాదనను వాయిదా వేయించారని ఉన్నతాధికారులు వాపోతున్నారు. -
ఆర్టీసీకి రూ. 12 కోట్ల నష్టం
గత ఏడాదితో పోలిస్తే తగ్గిన వైనం ఇంధన పొదుపులో రాష్ట్రంలోనే రెండో స్థానం హన్మకొండ : ఆర్టీసీని నష్టాలు వీడడం లేదు. వరంగల్ రీజియన్‌లో పరిస్థితి గత ఏడాది కంటే మెరుగైనా.. నష్టాల నుంచి మాత్రం గట్టెక్కలేదు. వరంగల్ రీజియన్‌లో గత ఏడాది రూ.17.37 కోట్ల నష్టాన్ని మూటకట్టుకోగా.. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు రూ.12.43 కోట్ల నష్టం వచ్చినట్లు తేలింది. అయితే, గత ఏడాదితో పోలిస్తే రూ.4.92 కోట్లు అదనంగా ఆదాయం సమకూర్చుకుంది. ఈ మేరకు నష్టం పూడ్చుకున్నట్లు అయింది. కొత్త నోట్ల రద్దుతో ఆర్టీసీ కొంత మేర ఆదా యం కోల్పోయింది. లేకుంటే నష్టం మరింత తగ్గేదని అధికారులు చెబుతున్నారు. రీజియన్‌లోని వరంగల్ అర్బన్ డివిజన్లో వరంగల్–1, వరంగల్–2 డిపోలు లాభాల్లో ఉండగా హన్మకొండ, జనగామ డిపోలు నష్టాల్లో ఉన్నాయి. వరంగల్ రూరల్ డివిజన్లోని పరకాల, భూపాలపల్లి, నర్సంపేట, తొర్రూరు, మహబూబాబాద్ డిపోలు నష్టాల్లో ఉన్నాయి. ఇంధన పొదుపులో భేష్ ఇందన పొదుపులో రాష్ట్రంలోనే వరంగల్ రీజియన్ రెండో స్థానంలో నిలిచింది. కరీంనగర్ రీజియన్ 5.73 కేఎంపీఎల్‌తో మొదటి స్థానంలో ఉండగా, 5.69 కేఎంపీఎల్‌తో వరంగల్ రీజియన్ ద్వితీయ స్థానం సాధించింది. వరంగల్ రీజియన్‌లో డిపోల వారీగా పరిశీలిస్తే 5.80 కేఎంపీఎల్‌తో మహబూబాబాద్ డిపో మొదటి స్థానంలో ఉండగా 5.79 కేఎంపీఎల్‌తో జనగామ డిపో రెండో స్థానంలో నిలిచింది. వరంగల్ రీజియన్ గత ఏడాది 5.64 కేఎంపీఎల్ సాధించగా ఈ ఏడాది 5.68 కేఎంపీఎల్‌తో ముందుకు సాగుతోంది. కాగా, పరకాల డిపో ఇందన పొ దుపులో మైనస్‌లో ఉండగా మిగతా ఎని మిది డిపోలు మెరుగుగా ఉన్నాయి. -
బస్టాండ్లలో స్వైపింగ్ యంత్రాలు
-
'ఆర్టీసీకి రూ.17 కోట్ల నష్టం'
-
'ఆర్టీసీకి రూ.17 కోట్ల నష్టం'
► విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌లో నగదు రహిత కార్యకలాపాలు అమరావతి : పెద్ద నోట్ల రద్దు పరిణామం తర్వాత ఆర్టీసీ రూ.17 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు తెలిపారు. గురువారం విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో నగదు రహిత కార్యకలాపాల్లో భాగంగా స్వైపింగ్ యంత్రాలను మంత్రి శిద్ధా ప్రారంభించారు. అనంతరం మంత్రి శిద్ధా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... తొలి విడత కష్ణా, గుంటూరు జిల్లాల్లో ఆర్టీసీ బస్టాండ్లలో టిక్కెట్ రిజర్వేషన్ కోసం 50 స్వైపింగ్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చారు. వారం రోజుల్లోగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్టాండ్లలో స్వైపింగ్ యంత్రాలను ఏర్పాటు చేసి ప్రయాణికులకు చిల్లర సమస్య లేకుండా చూస్తామన్నారు. త్వరలో రెగ్యులర్ సర్వీసుల్లో కూడా డ్రైవర్లకు స్వైపింగ్ యంత్రాలను అందిస్తామన్నారు. నగదు రహిత ప్రయాణాలకు ఆర్టీసీ శ్రీకారం చుట్టిందని, దశల వారీగా అన్ని సర్వీసుల్లో ఈ-పోస్ యంత్రాలు అందుబాటులో ఉంచుతామని ఆర్టీసీ ఎండీ మాలకొండయ్య పేర్కొన్నారు. -
ఆర్టీసీని కాపాడుకుందాం
నష్టాలకు కారణం యాజమాన్య వైఖరే -ఎన్ఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రయ్య నెల్లూరు (అర్బన్) : ప్రజల ఆస్తి ఆర్టీసీ సంస్థను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య అన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న ఆ సంఘం కార్యాలయంలో బుధవారం జిల్లాలోని 10 డిపోలకు చెందిన సంఘం అధ్యక్ష, కార్యదర్శలు, ముఖ్యులతో సమీక్ష సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ నష్టాల్లోకి పోవడానికి కారణం కార్మికులేనని ప్రభుత్వం, యాజమాన్యం ప్రకటించడం తమ మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు. నష్టాలకు కారణమేంటో అధ్యయనం చేసి నివేదికను ప్రభుత్వానికి పంపి వాస్తవాలు వెలుగులోకి తెస్తామన్నారు. మేనేజ్మెంట్ లోపాలు, ఇష్టారాజ్యంగా అప్పులు చేయడం, ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు వసూలు చేయలేకపోవడం, అక్రమ ప్రైవేట్ వాహనాల రవాణాను అరికట్టలేక పోవడంతోనే ఆర్టీసీ నష్టాల పాలయిందన్నారు. ఆర్టీసీ ఆస్తులన్ని తెలంగాణలో మిగిలిపోయాయని, వాటిలో వాట తెస్తే నష్టాల నుంచి బయట పడొచ్చన్నారు. ఇవన్ని మరచి యాజమాన్యం కార్మికులపై పనిభారం, ఒత్తిడి పెంచుతుందన్నారు. ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి రమణరాజు మాట్లాడుతూ నష్టాల ఊబిలో ఉన్న ఆర్టీసీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి గట్టెక్కించాడని తెలిపారు. మళ్లీ ఇప్పుడు టీడీపీ పాలనలో నష్టాలు వచ్చాయన్నారు. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సంస్థను కాపాడేందుకు పోరాటం చేస్తామన్నారు. ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి రమణరాజు, రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్లు, జోనల్ కార్యదర్శి ఎంవీరావు, రుక్సన్ పాల్గొన్నారు. -
ఏకపక్ష నిర్ణయాలతోనే ఆర్టీసీకి నష్టాలు
గూడూరు : అధికారుల ఏకపక్ష నిర్ణయాలతోనే ఆర్టీసీ నష్టాల ఊబిలో కూరుకుపోతోందని ఈయూ రాష్ట్ర కార్యదర్శి సుబ్రమణ్యంరాజు అన్నారు. ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక డిపో ఎదుట మంగళవారం ఆర్టీసీ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్రమణ్యంరాజు మాట్లాడుతూ రోజురోజుకూ కార్మికులపై పనిభారాన్ని మోపుతూ అడ్డూ అదుపూ లేకుండా సర్వీసులను కుదిస్తూ, కార్మికులను నిలిపివేస్తున్నారని, దీంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవతున్నారని అన్నారు. సమస్యల పరిష్కారానికి అన్ని డిపోల్లో 27, 28 తేదీల్లో ధర్నాలకు పిలుపునిచ్చామన్నారు. కార్యక్రమంలో శర్మ, చెంగయ్య, వెంకటేశ్వర్లు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. అధికారుల నిర్ణయాలతోనే.. రాపూరు : ఆర్టీసీ అధికారుల ఏకపక్ష నిర్ణయాలతోనే ఆర్టీసీకి తీవ్రనష్టాలు వాటిల్లుతున్నాయని నెల్లూరు రీజియన్ ఎంప్లాయీస్ యూనియన్ సహాయ కార్యదర్శి హరిహరన్ ఆరోపించారు. రాపూరు ఆర్టీసీ డిపో ఎదుట మంగళవారం ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు డీఏ, అరియర్స్‌ను చెల్లించాలని, కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలని, విజయవాడలో ఆర్టీసీ ఆస్పత్రి నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డిపో అధ్యక్ష కార్యదర్శులు రామూర్తి, శేషయ్య, గ్యారేజి కార్యదర్శి వెంకటయ్య, సహాయ కార్యదర్శి వాసులు, నాయకులు బాబు, హసన్ కార్మికులు పాల్గొన్నారు. సమస్యలను పరిష్కరించాలి నెల్లూరు(టౌన్): ఆర్టీసీలో పనిచేసే కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి నారాయణరావు డిమాండ్ చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ మంగళవారం డిపో–1, డిపో–2ల ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్ఎంయూ స్వార్థ ప్రయోజనాల కోసం కార్మిక వ్యవస్థను యాజమాన్యం వద్ద తాకట్టు పెట్టిందని ఆరోపించారు. కార్యక్రమంలో ఎంప్లాయిస్ యూనియన్ నాయుకులు వెంకటేశ్వర్లు, ప్రసాద్, మల్లి,మధు, ప్రభాకరరెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.