ఏకపక్ష నిర్ణయాలతోనే ఆర్టీసీకి నష్టాలు
ఏకపక్ష నిర్ణయాలతోనే ఆర్టీసీకి నష్టాలు
Published Wed, Sep 28 2016 1:46 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
గూడూరు : అధికారుల ఏకపక్ష నిర్ణయాలతోనే ఆర్టీసీ నష్టాల ఊబిలో కూరుకుపోతోందని ఈయూ రాష్ట్ర కార్యదర్శి సుబ్రమణ్యంరాజు అన్నారు. ఏపీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక డిపో ఎదుట మంగళవారం ఆర్టీసీ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్రమణ్యంరాజు మాట్లాడుతూ రోజురోజుకూ కార్మికులపై పనిభారాన్ని మోపుతూ అడ్డూ అదుపూ లేకుండా సర్వీసులను కుదిస్తూ, కార్మికులను నిలిపివేస్తున్నారని, దీంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవతున్నారని అన్నారు. సమస్యల పరిష్కారానికి అన్ని డిపోల్లో 27, 28 తేదీల్లో ధర్నాలకు పిలుపునిచ్చామన్నారు. కార్యక్రమంలో శర్మ, చెంగయ్య, వెంకటేశ్వర్లు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
అధికారుల నిర్ణయాలతోనే..
రాపూరు : ఆర్టీసీ అధికారుల ఏకపక్ష నిర్ణయాలతోనే ఆర్టీసీకి తీవ్రనష్టాలు వాటిల్లుతున్నాయని నెల్లూరు రీజియన్ ఎంప్లాయీస్ యూనియన్ సహాయ కార్యదర్శి హరిహరన్ ఆరోపించారు. రాపూరు ఆర్టీసీ డిపో ఎదుట మంగళవారం ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు డీఏ, అరియర్స్‌ను చెల్లించాలని, కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలని, విజయవాడలో ఆర్టీసీ ఆస్పత్రి నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డిపో అధ్యక్ష కార్యదర్శులు రామూర్తి, శేషయ్య, గ్యారేజి కార్యదర్శి వెంకటయ్య, సహాయ కార్యదర్శి వాసులు, నాయకులు బాబు, హసన్ కార్మికులు పాల్గొన్నారు.
సమస్యలను పరిష్కరించాలి
నెల్లూరు(టౌన్): ఆర్టీసీలో పనిచేసే కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి నారాయణరావు డిమాండ్ చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ మంగళవారం డిపో–1, డిపో–2ల ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్‌ఎంయూ స్వార్థ ప్రయోజనాల కోసం కార్మిక వ్యవస్థను యాజమాన్యం వద్ద తాకట్టు పెట్టిందని ఆరోపించారు. కార్యక్రమంలో ఎంప్లాయిస్ యూనియన్ నాయుకులు వెంకటేశ్వర్లు, ప్రసాద్, మల్లి,మధు, ప్రభాకరరెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Advertisement