- నష్టాలకు కారణం యాజమాన్య వైఖరే
- -ఎన్‌ఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రయ్య
ఆర్టీసీని కాపాడుకుందాం
Published Thu, Oct 6 2016 1:35 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
నెల్లూరు (అర్బన్) : ప్రజల ఆస్తి ఆర్టీసీ సంస్థను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య అన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న ఆ సంఘం కార్యాలయంలో బుధవారం జిల్లాలోని 10 డిపోలకు చెందిన సంఘం అధ్యక్ష, కార్యదర్శలు, ముఖ్యులతో సమీక్ష సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ నష్టాల్లోకి పోవడానికి కారణం కార్మికులేనని ప్రభుత్వం, యాజమాన్యం ప్రకటించడం తమ మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు. నష్టాలకు కారణమేంటో అధ్యయనం చేసి నివేదికను ప్రభుత్వానికి పంపి వాస్తవాలు వెలుగులోకి తెస్తామన్నారు. మేనేజ్‌మెంట్ లోపాలు, ఇష్టారాజ్యంగా అప్పులు చేయడం, ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు వసూలు చేయలేకపోవడం, అక్రమ ప్రైవేట్ వాహనాల రవాణాను అరికట్టలేక పోవడంతోనే ఆర్టీసీ నష్టాల పాలయిందన్నారు. ఆర్టీసీ ఆస్తులన్ని తెలంగాణలో మిగిలిపోయాయని, వాటిలో వాట తెస్తే నష్టాల నుంచి బయట పడొచ్చన్నారు. ఇవన్ని మరచి యాజమాన్యం కార్మికులపై పనిభారం, ఒత్తిడి పెంచుతుందన్నారు. ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి రమణరాజు మాట్లాడుతూ నష్టాల ఊబిలో ఉన్న ఆర్టీసీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి గట్టెక్కించాడని తెలిపారు. మళ్లీ ఇప్పుడు టీడీపీ పాలనలో నష్టాలు వచ్చాయన్నారు. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సంస్థను కాపాడేందుకు పోరాటం చేస్తామన్నారు. ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి రమణరాజు, రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్లు, జోనల్ కార్యదర్శి ఎంవీరావు, రుక్సన్ పాల్గొన్నారు.
Advertisement