ఆర్టీసీకి రూ. 12 కోట్ల నష్టం
గత ఏడాదితో పోలిస్తే తగ్గిన వైనం
ఇంధన పొదుపులో రాష్ట్రంలోనే రెండో స్థానం
హన్మకొండ : ఆర్టీసీని నష్టాలు వీడడం లేదు. వరంగల్ రీజియన్‌లో పరిస్థితి గత ఏడాది కంటే మెరుగైనా.. నష్టాల నుంచి మాత్రం గట్టెక్కలేదు. వరంగల్ రీజియన్‌లో గత ఏడాది రూ.17.37 కోట్ల నష్టాన్ని మూటకట్టుకోగా.. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు రూ.12.43 కోట్ల నష్టం వచ్చినట్లు తేలింది. అయితే, గత ఏడాదితో పోలిస్తే రూ.4.92 కోట్లు అదనంగా ఆదాయం సమకూర్చుకుంది. ఈ మేరకు నష్టం పూడ్చుకున్నట్లు అయింది. కొత్త నోట్ల రద్దుతో ఆర్టీసీ కొంత మేర ఆదా యం కోల్పోయింది. లేకుంటే నష్టం మరింత తగ్గేదని అధికారులు చెబుతున్నారు. రీజియన్‌లోని వరంగల్ అర్బన్ డివిజన్‌లో వరంగల్–1, వరంగల్–2 డిపోలు లాభాల్లో ఉండగా హన్మకొండ, జనగామ డిపోలు నష్టాల్లో ఉన్నాయి. వరంగల్ రూరల్ డివిజన్‌లోని పరకాల, భూపాలపల్లి, నర్సంపేట, తొర్రూరు, మహబూబాబాద్ డిపోలు నష్టాల్లో ఉన్నాయి.
ఇంధన పొదుపులో భేష్
ఇందన పొదుపులో రాష్ట్రంలోనే వరంగల్ రీజియన్ రెండో స్థానంలో నిలిచింది. కరీంనగర్ రీజియన్ 5.73 కేఎంపీఎల్‌తో మొదటి స్థానంలో ఉండగా, 5.69 కేఎంపీఎల్‌తో వరంగల్ రీజియన్ ద్వితీయ స్థానం సాధించింది. వరంగల్ రీజియన్‌లో డిపోల వారీగా పరిశీలిస్తే 5.80 కేఎంపీఎల్‌తో మహబూబాబాద్ డిపో మొదటి స్థానంలో ఉండగా 5.79 కేఎంపీఎల్‌తో జనగామ డిపో రెండో స్థానంలో నిలిచింది. వరంగల్ రీజియన్ గత ఏడాది 5.64 కేఎంపీఎల్ సాధించగా ఈ ఏడాది 5.68 కేఎంపీఎల్‌తో ముందుకు సాగుతోంది. కాగా, పరకాల డిపో ఇందన పొ దుపులో మైనస్‌లో ఉండగా మిగతా ఎని మిది డిపోలు మెరుగుగా ఉన్నాయి.