
ఎస్సై మృతదేహానికి పోస్టుమార్టం
ఒంగోలు సెంట్రల్ : తుపాకీ మిస్‌ఫైరై మరణించిన జె.పంగులూరు మండలం రేణంగివరం ఎస్సై కె.విష్ణుగోపాల్(28) మృతదేహానికి ఒంగోలు రిమ్స్‌లో శనివారం పోస్టుమార్టం నిర్వహించారు. ఫోరెన్సిక్ ప్రొఫెసర్ రాజ్‌కుమార్ ఆధ్వర్యంలోని వైద్యుల బృందం మధ్యాహ్నానికల్లా పోస్టుమార్టం పూర్తి చేసింది. ఒంగోలు డీఎస్పీ జాషువా, ఇతర పోలీసు అధికారులు రిమ్స్‌లోనే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ మధ్యాహ్నం 3 గంటల సమయంలో రిమ్స్‌కు చేరుకుని ఎస్సై మృతదేహాన్ని పరిశీలించి ఘన నివాళులర్పించారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా మృతుని తండ్రి రామకృష్ణ, తమ్ముడు ప్రవీణ్‌కుమార్‌లు మాట్లాడుతూ తమ కుటుంబానికి ఎస్సై విష్ణుగోపాలే పెద్ద దిక్కని, అంతా ఆయనపైనే ఆధారపడి జీవిస్తున్నామని, తమకు న్యాయం చేయాలని ఎస్పీని కోరారు. అనంతరం మృతదేహాన్ని ఐస్ బాక్సులో ఉంచి మార్చూరీ నుంచి బయటకు తీసుకువచ్చి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన టెంట్‌లో ఉంచారు. ఈ సందర్భంలో మృతుని తల్లి భోరున విలపించింది. అనంతరం ఎస్సై మృతదేహాన్ని స్వగ్రామం నెల్లూరు జిల్లా బోగోలు బిట్రగుంట తీసుకెళ్లారు.
అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, మాజీ ఎంపీ కరణం బలరామకృష్ణమూర్తిలు నివాళులర్పించారు. మృతుని తల్లిదండ్రులకు సంతాపం ప్రకటించారు. మృతుని కుటుంబ సభ్యులకు ఏఎస్పీ రాములు నాయక్, ఎస్బీ సీఐ తిరుమలరావు, వన్‌టౌన్ సీఐ కె.వెంకటేశ్వరరావు, ట్రాఫిక్ సీఐ రవిచంద్ర, పలువురు ఎస్సైలు, కానిస్టేబుళ్లు ఓదార్చారు.