
ఏం.. తమాషానా..?
‘వైద్య కళాశాలల పట్ల మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) తీరు సరిగా లేదు.
► వైద్య కళాశాలల్లో ఎంసీఐ తనిఖీల తీరుపై గవర్నర్ నరసింహన్ ఆగ్రహం
► వైద్యసేవల్లో ఏకీకృత ఫీజు అమలు చేయాలని సూచన
సాక్షి, హైదరాబాద్: ‘వైద్య కళాశాలల పట్ల మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) తీరు సరిగా లేదు. కళాశాల ప్రారంభసమయంలో తనిఖీలు చేసి అన్ని సవ్యంగా ఉన్నాయని కోర్సుల ఏర్పాటుకు అనుమతి ఇస్తుంది. తీరా అడ్మిషన్లు పూర్తైతరగ తులు ప్రారంభమైన తర్వాత మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్వహణ సరిగా లేదని, ఆపరేషన్ థియేటర్లు, వార్డులు, ల్యాబ్‌ల్లో వైద్య పరికరాలు లేవని కోర్సుల గుర్తింపు రద్దు చేస్తుంది. ఏం.. తమాషానా..?’ అని ఎంసీఐ తీరుపై గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో బుధవారం ఏర్పాటు చేసిన ఇండియన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ 59వ వార్షిక సదస్సును గవర్నర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొన్ని ప్రైవేటు వైద్య కళాశాలలు డాక్టర్ డిగ్రీల ను మార్కెట్లో వస్తువుల్లా అమ్ముకుంటున్నాయని విమర్శించా రు. రూ.కోట్లు కుమ్మరించి డిగ్రీలు సంపాదించిన వారు తర్వాత సంపాదనే లక్ష్యంగా పని చేస్తున్నారన్నారు. రోగులకు చికిత్స చేసే విషయంలో వైద్యుల ఆలోచన దృక్పథంలో మార్పు రావాలన్నారు. దేశంలో 50 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారని, ఎక్కువ శాతం కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారని తెలిపారు.
వీరికి వైద్యం అందేలా చూడాల్సిన బాధ్యత ఆర్థోపెడిక్స్‌పై ఉందన్నారు. అన్ని ఆసుపత్రుల్లో ఏకీకృత ఫీజుల విధానం అమలు చేయాలని సూచిం చారు. ఇండియన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ కే జైన్ మాట్లాడుతూ 50 ఏళ్లు పైబడిన వారిలో 90 శాతం మంది కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో పద్మశ్రీ డాక్టర్ ఎస్‌ఎస్ యాదవ్, డాక్టర్లు విజయ్‌చందర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, జున్‌జున్‌వాలా, సుధీర్‌కపూర్‌లతో పాటు 20 రాష్ట్రాలకు చెందిన ఆర్థోపెడిక్ సర్జన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ ఎముకల వైద్య నిపుణుడు ప్రీతీపాల్‌సింగ్ మైనీని జీవితసాఫల్య పురస్కారంతో సత్కరించారు.