
వైద్య కళాశాలల్లో అరువుకు అధ్యాపకులు!
* ఎంసీఐ తనిఖీలకు తాత్కాలిక సిబ్బంది
* ఎంబీబీఎస్ విద్యార్థుల కలవరం
సాక్షి, హైదరాబాద్: సర్కారీ వైద్య కళాశాలల్లో అధ్యాపకులను అరువుకు తెచ్చుకుంటున్నారు. దీంతో సరిగా పాఠాలు చెప్పే వారు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. భారతీయ వైద్య మండలి అధికారులు వసతులు, అధ్యాపకులపై తనిఖీలు చేసే సమయంలో ఇలా కొద్ది మంది వైద్యులను వారం రోజులకు నియమించుకోవడం, అనంతరం వారిని యథాస్థానాలకు పంపిస్తున్నారు. ఫలితంగా ఎంబీబీఎస్ విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు కరువయ్యారు.
కొన్నేళ్లుగా నియామకాలు చేపట్టకుండా పోవడంతో సర్కారీ వైద్య కళాశాలల్లో సీట్లు కోత పడుతున్నాయి. రాష్ట్రంలోనే పేరెన్నికగన్న గాంధీ ఆస్పత్రి, కొత్తగా ఏర్పాటు చేసిన నిజామాబాద్ వైద్య కళాశాలల్లో సీట్లు పోవడమే ఇందుకు నిదర్శనం. విచిత్రమేమంటే పీహెచ్‌సీలలో పనిచేస్తున్న ఎంబీబీఎస్ డాక్టర్లను కూడా అధ్యాపకులుగా చూపిస్తున్నారు.
ప్రధాన విభాగాల్లోనే కొరత
ఎంబీబీఎస్‌లో చేరిన విద్యార్థులకు ఆదిలోనే హంసపాదు ఎదురవుతోంది. ఎంబీబీఎస్‌లో అనాటమీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీ, బయోకెమిస్ట్రీ, పథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్ అనేవి కీలకమైనవి. ముఖ్యంగా అనాటమీ (శరీరధర్మశాస్త్రం) అనేది కీలకమైనది. ఇందులోనే చదువు చెప్పేవారు లేరు. దీనివల్ల ఎంబీబీఎస్‌లో తొలి ఏడాది విద్యార్థులు చాలా మంది ఫెయిలవుతున్న సంఘటనలూ ఉన్నాయి.
రేయింబవళ్లు కష్టపడి చదివి ఎంసెట్‌లో ర్యాంకు తెచ్చుకుని ఎంబీబీఎస్‌లో చేరే విద్యార్థులు వైద్య కళాశాలల్లో ఉన్న పరిస్థితి చూసి విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ రిమ్స్‌లో 30 శాతం వైద్యుల కొరత ఉంది. అదే నిజామాబాద్‌లో అయితే వైద్యులు లేక, వసతులు లేక ఏకంగా 100 ఎంబీబీఎస్ సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. వరంగల్‌లోనూ ప్రస్తుతం ఎంసీఐ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ కూడా యాభై సీట్లు కోల్పోయే పరిస్థితి ఉందని అధికారులు అంటున్నారు.