జూలై 20వ తేదీ తర్వాత మెడికల్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు.
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: జూలై 20వ తేదీ తర్వాత మెడికల్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. ఈ విషయంపై మంగళవారం ఆయన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా, తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ డాక్టర్ పాపిరెడ్డి, వైద్య విద్య సంచాలకులు, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు తదితరులు హాజరయ్యారు. వచ్చేనెల 15 వరకు భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) కొత్త కాలేజీలు, సీట్ల పెంపునకు అనుమతి ఇచ్చేందుకు సమయం ఉన్నందున కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను 20వ తేదీ తర్వాతే విడుదల చేస్తామని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సహకారంతో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు.
హైదరాబాద్‌లో రెండు, వరంగల్, విజయవాడల్లో ఒక్కో కేంద్రం చొప్పున 4 కేంద్రాల్లో కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. ప్రైవేటు వైద్య కళాశాలలు ప్రత్యేకంగా నిర్వహించిన ఎం-సెట్ కౌన్సెలింగ్‌ను పారదర్శకంగా జరిపేందుకు ప్రభుత్వం ఒక ప్రతినిధిని నియమించిందన్నారు. ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ శంకర్‌ను ప్రతినిధిగా నియమించనున్నట్లు తెలిసింది.