సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య పీజీ సీట్ల భర్తీలో నేషనల్ పూల్ విధానం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత విద్యా సంవత్సరం పీజీ వైద్య సీట్ల భర్తీ మార్గదర్శకాలు ఖరారు చేస్తూ మంగళవారం రెండు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ప్రకారం భారత వైద్య మండలి (ఎంసీఐ) మార్గదర్శకాలకు అనుగుణంగా, జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ర్యాంకుల ఆధారంగా సీట్లు భర్తీ చేయనున్నారు. ఇందులో 50 శాతం సీట్లు నేషనల్ పూల్‌లోకి, మిగిలిన 50 శాతం సీట్లను స్థానిక కోటాగా పరిగణించనున్నారు. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు యథావిధిగా అమలు చేస్తారు.
ప్రస్తుతం వైద్య ఉద్యోగంలో ఉన్న వారికి (ఇన్ సర్వీస్ అభ్యర్థులు).. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో పని చేసే వారికి సర్వీస్ రిజర్వేషన్లకు బదులుగా నీట్‌లో వచ్చిన మార్కులకు అదనంగా వెయిటేజీ మార్కులు కలపనున్నారు. గిరిజన ప్రాంతాల్లో మూడేళ్ళు లేదా అంతకు మించి పని చేసిన అభ్యర్థులకు నీట్ ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కులకు అదనంగా 30 శాతం.. గ్రామీణ ప్రాంతాల్లో మూడేళ్ళు లేదా అంతకు మించి పని చేసిన అభ్యర్థులకు నీట్ ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కులకు అదనంగా 24 శాతం మార్కులు కలుపుతారు. అలాగే సర్వీస్ అభ్యర్థులకు డిప్లొమా చేసిన సబ్జెక్టులోనే పీజీ చేయాలనే నిబంధన తొలగించారు.
త్వరలో నోటిఫికేషన్
భారత వైద్య మండలి మార్గదర్శకాల ప్రకారం వైద్య విద్య పీజీ సీట్ల భర్తీ జరుగుతుందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. పీజీ సీట్ల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment