జిల్లాలోని వైద్య కళాశాలకు మంగళవారం ఎంసీఐ బృందం రానుంది.
నిజామాబాద్ అర్బన్ : జిల్లాలోని వైద్య కళాశాలకు మంగళవారం ఎంసీఐ బృందం రానుంది. మూడో సంవత్సరం తరగతుల నిర్వహణకు అనుమతి కోసం కళాశాలను పరి శీలించనుంది. ఈ బృందం ఆదివారమే రావాల్సి ఉంది. అయితే హైదరాబాద్‌లో ఇతర కళాశాలల పరిశీలన వల్ల పర్యటన మంగళవారానికి వాయిదా పడింది. ఈ విషయమై మెడికల్ కళాశాల అధికారులు కలెక్టర్‌ను కలిసి సమాచారం అందించారు.
అనుమతిపై ఉత్కంఠ
మెడికల్ కళాశాలకు ఎంసీఐ బృందం రాక నేపథ్యంలో అధికారుల్లో ఉత్కంఠ నెలకొంది. కళాశాలలో మూడో సంవత్సరం తరగతుల నిర్వహణకు అనుమతి లభిస్తుందా అన్న విషయమై ఆందోళన కొనసాగుతోంది.
గతంలో మొదటి సంవత్సరం తరగతుల నిర్వహణకు అనుమతికోసం ఎంసీఐ బృందం పరి శీలనకు వచ్చింది. మూడుసార్లు పరిశీలించి వెళ్లినా.. తరగతుల నిర్వహణకు అనుమతి ఇవ్వలేదు. అప్పటి భారీ నీటి పారుదల శాఖ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి పలుమార్లు ఢిల్లీ వెళ్లి ప్రయత్నాలు చేశారు. ప్రయత్నాలు ఫలించి కళాశాలలో మొదటి సంవత్సరం తరగతుల నిర్వహణకు అనుమతి లభించింది.
రెండో సంవత్సరంలోనూ అదే పరిస్థితి కొనసాగింది.
ఇద్దరు సభ్యుల ఎంసీఐ బృందం రెండుసార్లు కళాశాలకు వచ్చి వసతులను పరిశీలించింది. అయినా సంతృప్తి వ్యక్తం చేయలేదు. మూడోసారి పరిశీలన అనంతరం రెండో సంవత్సరం తరగతుల నిర్వహణకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం కళాశాలలో వంద సీట్లున్నాయి. మూడో సంవత్సరం తరగతుల అనుమతికోసం కళాశాలను పరిశీలించడానికి ఎంసీఐ బృందం మంగళవారం జిల్లాకు వస్తోంది. దీంతో ఎంసీఐ బృందం ఎలా స్పందిస్తుందోనని అధికారుల్లో ఉత్కంఠ నెలకొంది.
గతంలో ఎంసీఐ బృందం కళాశాలను సందర్శించినప్పుడు కళాశాలకు ఆసుపత్రిని అనుసంధానం చేయాలని, ప్రొఫెసర్ పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని, పారామెడికల్ సిబ్బంది, పరిపాలన సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించాలని, సరిపోయేంత స్థలం, ఆటస్థలం కేటాయించాలని, ఆధునిక లైబ్రరీ ఏర్పాటు చేయాలని సూచించింది.
అయితే ఇవేవీ నేటికీ పూర్తికాలేదు. మరోవైపు ప్రొఫెసర్లను నియమించినా వారు ఆసుపత్రికి రావడం లేదు. తరచుగా 40 నుంచి 50 మంది ప్రొఫెసర్లు విధులకు గైర్హాజరవుతున్నారు. ఈ అంశం కూడా కళాశాలలో మూడో సంవత్సరం తరగతుల నిర్వహణకు అనుమతిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎంసీఐ బృందం ఎలా స్పందిస్తుంది అన్న విషయమై అందరిలో ఆసక్తి నెలకొంది.