న్యూఢిల్లీ: దృష్టిలోపం ఉన్న అర్హులైన అభ్యర్థులు వైద్యవిద్య (ఎంబీబీఎస్)ను అభ్యసించేందుకు అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. 2018 నీట్ (జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష)లో పాసైనప్పటికీ దృష్టిలోపం ఉండటంతో అడ్మిషన్ కోల్పోయిన అశుతోశ్ అనే ఓ అభ్యర్థి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీల ధర్మాసనం.. దివ్యాంగుల కోటాలో అశుతోశ్‌కు అడ్మిషన్ ఇవ్వాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ)ను ఆదేశించింది. 2018–19 విద్యాసంవత్సరంలోనే ఆయనకు ఎంబీబీఎస్ చేసేందుకు అవకాశం కల్పించాలని స్పష్టం చేసింది. ఈ అంశంపై సీనియర్ కంటివైద్యులతో ఓ కమిటీని ఏర్పాటుచేసిన సుప్రీంకోర్టు వారిచ్చిన సూచనల ఆధారంగానే ఈ తీర్పునిచ్చింది. దివ్యాంగుల కోటా కింద అభ్యర్థి ఎంబీబీఎస్ అడ్మిషన్ పొందేందుకు అర్హుడంది. గతేడాది ఇద్దరు వర్ణ అంధత్వం ఉన్న విద్యార్థులకు ఎంబీబీఎస్ సీటు నిరాకరించిన కేసులోనూ సుప్రీంకోర్టు ఇదే తీర్పును వెలువరించింది. కంటిచూపు సరిగాలేదనే కారణంతో అడ్మిషన్లను నిరాకరించలేమని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment