సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి వైద్య ప్రవేశాలకు దేశవ్యాప్తంగా నిర్వహించే ‘నీట్’పరీక్షను వచ్చే జూలైలో నిర్వహించాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) సూత్రప్రాయంగా నిర్ణయించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రకాల అర్హత పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇటు ఈ నెల 3న జరగాల్సిన నీట్ పరీక్ష కూడా వాయిదా పడింది. దీంతో నీట్ ఎప్పుడు నిర్వహిస్తారా అన్న దానిపై విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. జూలై నాటికి పరిస్థితులు కుదుటపడితే ఆ నెలలో నీట్ నిర్వహించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇటీవల 16 రాష్ట్రాలకు చెందిన ఆరోగ్య విశ్వవిద్యాలయాల వైస్‌చాన్స్‌లర్లతో ఎంసీఐ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. మరోవైపు కరోనా నేపథ్యంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌కు అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ (ఏఐహెచ్‌ఎస్‌యూ) లేఖ రాసింది. చదవండి: ఈ ఏడాది చివరికల్లా టీకా!
ఆన్‌లైన్ తరగతులు.. హాజరు సమస్య
బోర్డు ఆఫ్ గవర్నర్‌కు రాసిన లేఖలో ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో ఆన్‌లైన్ తరగతులు, పరీక్షల నిర్వహణ కష్టతరంగా మారిందని ఏఐహెచ్‌ఎస్‌యూ తెలి పింది. విద్యా సంవత్సరం ప్రారం భం కాబోతుండటం, పరీక్షలు, తరగతుల నిర్వహణ ఎలా చేపట్టాలన్న దానిపై లేఖలో ప్రస్తావించారు. ప్రధానంగా ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తున్నా హాజరు శాతాన్ని పర్యవేక్షించడం కష్టతరం అవుతోందని ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌లో ఆన్‌లైన్ హాజరును కూడా పరి గణనలోకి తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా ఇది సుదీర్ఘకాలం సాగే ప్రక్రియ కాబట్టి క్లాసు రూం తరగతుల నిర్వహణలోని నిబంధనల్లో మార్పులు తెచ్చే విధంగా చట్ట సవరణ చేయాలని విజ్ఞప్తి చేశారు.
వైరస్ కారణంగా యూజీ, పీజీ మెడికల్ పరీక్షల నిర్వహణకు అంతరాయం కలిగింది. దీంతో కొన్ని విశ్వవిద్యాలయాల పరిధిలోని విద్యార్థులు తమకు ఎటువంటి పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతులకు పంపాలని డిమాండ్ చేస్తున్నారని ఎంసీఐ దృష్టికి తీసుకొచ్చారు. ఇక పరీక్షల నిర్వహణను పర్యవేక్షించే పరిశీలకులను ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చే పరిస్థితి ప్రస్తుతం లేదని పేర్కొన్నారు. వీలైతే ఇతర యూనివర్సిటీల నుంచి, లేకుంటే యూనివర్సిటీ అనుబంధ కాలేజీల నుంచి, అది సాధ్యం కాకుంటే యూనివర్సిటీలోని ఇంటర్నల్ ఎగ్జామినర్లను అనుమతించాలని లేఖలో కోరారు.
Comments
Please login to add a commentAdd a comment