- ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ తీసుకోవాల్సిందే
- ఎంబీబీఎస్ కోర్సు కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఎంసీఐ స్పష్టీకరణ
- అలా చేయకపోతే ఆ సర్టిఫికెట్లను రిజిస్ట్రేషన్ చేయలేమని వెల్లడి
- తాజాగా అన్ని రాష్ట్రాలకూ ఎంసీఐ ఆదేశాలు
హైదరాబాద్ : ఏటా వేలాదిమంది విద్యార్థులు కన్సల్టెన్సీల మాటలు నమ్మి విదేశాలకు వైద్య విద్య కోసం వెళ్తున్నారు. వీళ్లందరూ కోర్సు పూర్తిచేసుకుని తిరిగొచ్చాక సర్టిఫికెట్లను రిజిస్ట్రేషన్ చేసేందుకు భారతీయ వైద్యమండలి (ఎంసీఐ) అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా అన్ని రాష్ట్రాలకు ఎంసీఐ ఆదేశాలు జారీచేసింది. భారతదేశం నుంచి ఎవరైనా విదేశాలకు ఎంబీబీఎస్ చదవడానికి వెళ్లాలనుకుంటే దేశం విడిచి వెళ్లేముందే భారతీయ వైద్యమండలి నుంచి ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ (అర్హత ధ్రువపత్రం) తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ 1956 ప్రకారం ఈ సర్టిఫికెట్ తీసుకుని వెళ్తేనే విదేశాల్లో చేసిన ఎంబీబీఎస్ డిగ్రీని అనుమతిస్తామని పేర్కొంది. ఈ చట్టం చేయాలని 2014 జనవరిలోనే సమీక్ష నిర్వహించారని, 2016-17 నుంచి అమల్లోకి తెచ్చామని ఎంసీఐ పేర్కొంది. అయినా చాలామంది అభ్యర్థులు ఉక్రెయిన్, రష్యా, చైనా, ఫిలిప్పీన్ తదితర దేశాలకు వెళ్లి ఎంబీబీఎస్ డిగ్రీలు చేస్తున్నారని, ఇకపై ఎట్టిపరిస్థితుల్లోనూ అలాంటి డిగ్రీలకు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసేది లేదని తేల్చిచెప్పింది.
విదేశాల్లో ఏ యూనివర్సిటీగానీ, ఏదైనా ఇన్‌స్టిట్యూషన్‌లోగానీ చదవడానికి వెళ్లేముందు ఎంసీఐ రూపొందించిన ప్రత్యేక దరఖాస్తు పూర్తి చేసి, అందులో వివరాలు పొందుపరిస్తే దానికి సంబంధించి అనుమతి లభిస్తుందని, అలా చెయ్యకపోతే అభ్యర్థులు నష్టపోతారని ఎంసీఐ సూచించింది. ఎంబీబీఎస్ కోర్సుకు విదేశాలకు వెళ్లే విద్యార్థులు తీసుకునే అర్హత సర్టిఫికెట్‌కు సంబంధించి కొన్ని డాక్యుమెంట్లు ఇవ్వాల్సి ఉంటుందని, దీనికి నిర్ణయించిన మేరకు ఫీజు చెల్లించాలన్నారు. దీనికోసం వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫారాలను డౌన్‌లోడ్ చేసుకుని ఢిల్లీలోని ఎంసీఐ ప్రధాన కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు.
ఇదిలా ఉండగా చాలామంది అభ్యర్థులు ఇప్పటికీ అర్హత సర్టిఫికెట్లు తీసుకోకుండా కన్సల్టెన్సీల మాటలు నమ్మి నేరుగా విదేశాలకు వెళుతున్నారు. అలాంటి వాళ్లు కోర్సు పూర్తి చేసుకున్నా ఎంసీఐ వారి సర్టిఫికెట్లను రిజిస్ట్రేషన్ చెయ్యకపోవడంతో అటు ఉద్యోగాలకు, ఇటు ప్రాక్టీస్‌కు దూరంగా ఉండే పరిస్థితి వచ్చింది. పీజీ వైద్య విద్యకు మాత్రం ఇప్పటికీ ఎంసీఐ చైనా, రష్యా, ఉక్రెయిన్ తదితర దేశాల కోర్సులను గుర్తించడం లేదని స్పష్టం చేసింది. కేవలం అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, యూకే దేశాల్లో అనుమతి ఉన్న యూనివర్సిటీల్లో చదివితేనే వారి సర్టిఫికెట్లను భారతీయ వైద్యమండలిలో నమోదు చేస్తున్నట్టు ఎంసీఐ అధికారులు చెబుతున్నారు.
విదేశీ వైద్యవిద్యకు అనుమతి తప్పనిసరి
Published Sat, Jun 11 2016 7:40 PM | Last Updated on Tue, Oct 16 2018 2:57 PM
Advertisement
Advertisement