న్యూఢిల్లీ: వర్ణాంధత్వం (కొన్ని రంగులను గుర్తించలేకపోవడం)తో బాధపడుతున్న ఇద్దరు విద్యార్థులను ఎంబీబీఎస్ చదివేందుకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. 2015 ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకులు సాధించినా వర్ణాంధత్వం కారణంగా త్రిపురకు చెందిన ఇద్దరు విద్యార్థులకు భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) గతంలో ఎంబీబీఎస్ అడ్మిషన్‌ను నిరాకరించింది. వాస్తవానికి ఈ సమస్యతో బాధపడుతున్న వారు ఎంబీబీఎస్ చదవకూడదని నిబంధనలు లేకున్నా, వివిధ కళాశాలలు, ఎంసీఐ వీరికి అడ్మిషన్ ఇవ్వలేదు.
దీనిపై విద్యార్థులు తొలుత త్రిపుర హైకోర్టుకు వెళ్లినా వారికి నిరాశే ఎదురైంది. అనంతరం వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం... 2018–19 విద్యా సంవత్సరంలో వీరికి ఓ కళాశాలలో సీట్లు కేటాయిస్తూ తీర్పు వెలువరించింది. అంతకుముందు... వర్ణాంధత్వం ఉన్నవారు వైద్యులుగా పనిచేసేందుకు అర్హులో కాదో తేల్చడానికి ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు ఓ కమిటీని కూడా నియమించింది. వర్ణాంధత్వం వల్ల డాక్టర్లకు వృత్తిలో ఎలాంటి ఇబ్బందులూ ఉండబోవనీ, అయితే కేటగిరీ–1 లేదా అంతకన్నా ఎక్కువ వర్ణాంధత్వం ఉన్న వారిని వైద్యవిద్య చదివేందుకు అనుమతించకుండా నిబంధనలు తీసుకురావాలని కమిటీ సిఫారసు చేసింది.
వర్ణాంధులకు వైద్యవిద్యలో ప్రవేశం: సుప్రీం
Published Mon, Sep 25 2017 3:46 AM | Last Updated on Tue, Oct 9 2018 5:50 PM
Advertisement
Advertisement