కేఎంసీలో సీట్లు భద్రమేనా?
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కళాశాలలో అంతకుముందు ఉన్న 150 సీట్లకు అదనంగా మరో 50 సీట్లు గత సంవత్సరం మంజూరయ్యాయి. అయితే ఈ సంవత్సరం 200 సీట్లు ఉంటాయా లేదా 150 సీట్లనే కొనసాగిస్తారా అనేది సంది గ్ధంగా మారింది.గత సంవత్సరం ఎంసీఐ (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) 50 సీట్లు మంజూరు చేసినప్పుడు కళాశాలలో సిబ్బం దిని నియమించాలని, వసతులను కల్పిం చాలని సూచించింది. కానీ, ఇప్పటివరకూ ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు, ఉద్యోగులను నియమించలేదు.
దీంతో ఈసారి ఎంసీఐ బృందం తనిఖీ నిర్వహిస్తే కచ్చితంగా 50 సీట్లు రద్దయ్యే అవకాశం ఉందని పలువురు ప్రొఫెసర్లు చెబుతున్నా రు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు మెడికల్ కళాశాలల్లో ఎంసీఐ బృందం తనిఖీలు నిర్వహించి.. నాలుగు కళాశాలల్లో సీట్లను రద్దు చేసింది. నిజామాబాద్ మెడికల్ కళాశాలలో తనిఖీ నిర్వహించిన ఎంసీఐ బృందం సరైన సౌకర్యాలు లేవంటూ 100 సీట్లను రద్దు చేసినట్లు తెలిసింది. ఏదేమైనా ఎంసీఐ బృందం తనిఖీకి వచ్చిన తర్వాతే కేఎంసీలో ఎన్ని సీట్లు ఉంటాయో తేలనుంది.