సాక్షి, వరంగల్ : తెలంగాణ ఉద్యమంలో వైద్యుల సహకారం మరువ లేనిదని వైద్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. సంక్షేమ పథకాల్లో దూసుకుపోతున్న ప్రభుత్వం వైద్య రంగంపైన కూడా తనదైన ముద్ర వేస్తుందని పేర్కొన్నారు. కాకతీయ మెడికల్ కాలేజీ డైమండ్ జూబ్లీ వేడుకలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతానికి ఇప్పటికీ తేడాను అందరూ గమనించే ఉంటారన్నారు. ‘నేడు తెలంగాణా దేశంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఎక్కడ ఉన్నా తెలంగాణ మా రాష్ట్రం అని గొప్పగా చెప్పుకునే అవకాశం వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో హరితహారం, మిషన్ భగీరథ లాంటి అద్భుతమైన పథకాలు అమలు అవుతున్నాయి. మానవ సంబంధాలను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది’ అని ఈటెల వ్యాఖ్యానించారు.
తెలంగాణకే తలమానికం
వైద్య వృత్తి దేవుడిచ్చిన వరం..సంపాదనకంటే... పేదలకు వైద్యం చేసి వారిని బతికించడంలో ఎక్కువ తృప్తి లభిస్తుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంత్రి ఈటెలను అడిగిన వెంటనే సీఎం కేసీఆర్‌ను ఒప్పించి ఎంజీఎంలో మౌలిక వసతుల కోసం రూ. 10 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. అదే విధంగా ఎంజీఎంలో మరిన్ని మెరుగైన వసతుల కోసం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వంతో పాటు ఎన్నారైలు కూడా ఎంజిఎమ్ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. ఇక 60 వసంతాల పయనంలో వందలాది మందిని వైద్యులుగా తీర్చిదిద్దిన కేఎంసీ తెలంగాణకే తలమానికమని కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment