ఫాతిమా విద్యార్థుల ఆశలు ఆవిరి | Shock to the Fatima Medical College student's hopes | Sakshi
Sakshi News home page

ఫాతిమా విద్యార్థుల ఆశలు ఆవిరి

Published Sat, Oct 28 2017 12:54 AM | Last Updated on Tue, Oct 9 2018 5:50 PM

Shock to the Fatima Medical College student's hopes - Sakshi

తీర్పు అనంతరం కన్నీటిపర్యంతమవుతున్న బాధిత విద్యార్థులు, తల్లిదండ్రులు

సాక్షి, న్యూఢిల్లీ: భారత వైద్య మండలి (ఎంసీఐ) చర్యతో అడ్మిషన్‌ కోల్పోయిన ఫాతిమా వైద్య కళాశాల 2015–16 బ్యాచ్‌ విద్యార్థులను ప్రస్తుత విద్యా సంవత్సరంలో సర్దుబాటు చేసేందుకు అనుమతించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌ (మిస్లేనియస్‌ అప్లికేషన్‌)ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు, ఎంసీఐ అభిప్రాయాన్ని పరిశీలించిన అనంతరం.. ఈ కేసులో ఇంకా ముందుకు వెళ్లేందుకు ఏమీ లేనందున ఇంతటితో ముగిస్తున్నామని జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ నవీన్‌ సిన్హా నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్‌ జిల్లా కడప సమీపంలోని రామరాజుపల్లిలో గల ఫాతిమా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ కళాశాలలో 2015–16 బ్యాచ్‌లో వంద మంది విద్యార్థులు చేరారు.

ఆ తర్వాతి సంవత్సరంలో ఈ కళాశాలకు ఎంసీఐ గుర్తింపు రద్దు చేయడంతో వీరి చదువు అర్ధంతరంగా ఆగిపోయింది. కళాశాల యాజమాన్యం, ఎంసీఐ నిర్వాకం వల్ల తమ భవిష్యత్తు అంధకారమయం అయిందని విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో ఈ విద్యార్థులను ప్రస్తుత విద్యా సంవత్సరంలో సర్దుబాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 22న సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై సెప్టెంబర్‌ 21లోగా స్పందించాలని ఆగస్టు 30న జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఎంసీఐ, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసు జారీ చేసింది. విద్యార్థులను ఏయే కళాశాలల్లో సర్దుబాటు చేస్తారో సెప్టెంబరు 21లోగా ప్రతిపాదనలను సమర్పించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సూచించింది. అయితే, తదుపరి విచారణలో.. ఏపీ ప్రభుత్వ సీట్ల సర్దుబాటు ప్రతిపాదనలను  తిరస్కరిస్తున్నట్టు ఎంసీఐ ధర్మాసనానికి నివేదించింది. దీంతో మరో ప్రతిపాదనతో వస్తామని, రెండు వారాల గడువు కావాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోరడంతో సుప్రీంకోర్టు సమ్మతించింది.   

ఏపీ తాజా ప్రతిపాదనకూ నో  
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కారణంగా డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ ఆమోదంతో మెరిట్‌ లిస్టులో అడ్మిషన్‌ పొందిన విద్యార్థులకు నష్టం వాటిల్లకూడదని, తర్వాత అనుమతులు తెచ్చుకోవడంలో ఫాతిమా కళాశాల వైఫల్యం కారణంగా విద్యార్థులు నష్టపోతున్నారని పేర్కొంటూ ఏపీ సర్కారు కొత్త ప్రతిపాదనను ధర్మాసనానికి నివేదించింది. ఇదే ఫాతిమా కళాశాలలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఈ విద్యార్థులను చేర్చుకుని, ఆ మేరకు వచ్చే విద్యా సంవత్సరంలో సీట్లను తగ్గించుకోవాలని ప్రతిపాదించింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆ కళాశాలలో 20 సీట్లు ఖాళీగా ఉన్నాయని, వీటికి అదనంగా అవసరమైన సీట్లను కేటాయించాలని శుక్రవారం విచారణ సందర్బంగా కోరింది. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ‘మీరు ఈ ఏడాది సీట్లు పెంచాలని అడుగుతున్నారు. వచ్చే ఏడాది సీట్లను రద్దు చేయాలని చెబుతున్నారు. మీ ప్రతిపాదనలు, ఎంసీఐ స్పందన పరిశీలించాం. ఇక ఈ కేసులో ముందుకు వెళ్లలేం.. ఇంతటితో కేసును ముగిస్తున్నాం..’ అని ధర్మాసనం స్పష్టీకరించింది. 

ఇది రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతే.. 
కోర్టు తీర్పు వినగానే బయటకు వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బోరున విలపించారు. ఓ విద్యార్థి తండ్రి, పలువురు విద్యార్థులు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వాపోయారు. విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో కూరుకుపోయిందని, తమకు ఆత్మహత్యలే మిగిలి ఉన్నాయని కన్నీటిపర్యంతమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అటు ఎంసీఐని, ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించలేకపోయిందని కన్నీరు పెట్టుకున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement