అసెంబ్లీలోని సీఎం చాంబర్‌లో ముఖ్యమంత్రితో భేటీ అయిన ఫాతిమా కాలేజీ విద్యార్ధులు
సాక్షి, అమరావతి: ధర్నాలు చేస్తే కోల్పోయిన సీట్లు రావని, ఇలాంటి ధర్నాలు, ఆందోళనలను తాను చాలా చూశానని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఫాతిమా వైద్య కళాశాల బాధిత విద్యార్థులు సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రిని కలిశారు. ప్రభుత్వంలో ఉన్నది తాము అని, ఎవరిలో కలిస్తే వాళ్లు మీకు సీట్లు ఇప్పించలేరని చంద్రబాబు అన్నట్లు విద్యార్థులు తెలిపారు. తమకు సీట్ల విషయంలో సీఎం ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదని వాపోయారు. ఇప్పటికైనా ధర్నాలు చేయడం, టవర్లు ఎక్కడం, ప్రతిపక్ష నేతలను కలవడం వంటివి మానుకోవాలని, కెరీర్ దెబ్బతినకుండా వచ్చే ఏడాది పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలో చూడాలని విద్యార్థులకు చంద్రబాబు హితబోధ చేశారు.
ఈ నెల 29న ఢిల్లీకి వెళ్తున్నామని, విద్యార్థుల్లో ఐదుగురు కమిటీగా ఏర్పడి వస్తే వారిని కూడా తీసుకెళ్తామని అన్నారు. అయితే, ఈ ఏడాది (2017–18) నీట్‌లో అర్హత పొందిన విద్యార్థులకైనా సీట్లు ఇస్తారా? అని అడగ్గా ఈ ఏడాది సాధ్యం కాకపోవచ్చని చెప్పారు. కావాలంటే లాంగ్‌టర్మ్ కోచింగ్‌కు వెళ్లాలని, అందుకయ్యే వ్యయాన్ని ప్రభుత్వం భరిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రితో భేటీ అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నుంచి తమకు ఎలాంటి భరోసా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 29వ తేదీ తర్వాత స్పష్టమైన వైఖరిని వెల్లడిస్తామని ఫాతిమా కళాశాల విద్యార్థులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment