Fatima Medical College
-
‘ఫాతిమా’ బాధితుడి ఆత్మహత్యాయత్నం
కడప రూరల్/కడప కోటిరెడ్డి సర్కిల్: ఫాతిమా మెడికల్ కళాశాల బాధిత విద్యార్థి తండ్రి మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కడపలోని వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో 2015–2016 బ్యాచ్‌కు చెందిన బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి తండ్రి జగన్మోహన్రెడ్డి విలేకరులతో మాట్లాడుతూనే ఒక్కసారిగా.. వెంట తెచ్చుకున్న నిద్ర మాత్రలను మింగేశారు. ఆయన భార్య లక్ష్మీదేవి, ఇతరులు కలిసి రిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం జగన్మోహన్రెడ్డి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది అంతకుముందు విలేకరుల సమావేశంలో ఫాతిమా కళాశాల బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని, కళాశాల యాజమాన్యంతో అధికార పార్టీ నేతలు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జగన్మోహన్రెడ్డి, నన్నేఖాన్, ఇమ్రాన్‌ఖాన్, వెంకటాద్రి, మహ్మద్ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. ‘నా కుమారుడి భవిష్యత్తు కోసం రూ.55 లక్షలకు పైగా ఫాతిమా మెడికల్ కళాశాల యాజమాన్యానికి చెల్లించాను. నాలా ఎంతో మంది అధిక వడ్డీలకు అప్పులు చేసి, మరికొందరు ఇళ్లు, స్థలాలను తెగనమ్మి దాదాపు రూ. 70 కోట్లకు పైగా చెల్లించారు. కాలేజీలో మా పిల్లలు చేరాక కళాశాలకు గుర్తింపు లేదని తెలిసింది. మోసపోయామని తెలిసి.. భారీ ఆందోళనలు చేపట్టినా కొందరికి న్యాయం జరగలేదు’ అని జగన్మోహన్రెడ్డి వాపోయారు. 2018లో నీట్లో అర్హత పొందిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని ప్రకటించారని, 63 మంది అర్హత సాధించగా 43 మందికే సీట్లు ఇచ్చారన్నారు. మిగతావారికి అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు నష్ట పరిహారం అందించకుండా.. రూ .13 కోట్లు కళాశాల యాజమాన్యానికి ఇవ్వడం ఏంటని నిలదీశారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఫరూక్‌ని గత సోమవారం నంద్యాలలో కలిసి న్యాయం చేయాలని అభ్యర్థించినా.. ఆయన ఏమాత్రం స్పందించలేదన్నారు. సోమవారంలోగా న్యాయం జరగకపోతే, ఈ ప్రభుత్వం తమ చావు చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
‘ఫాతిమా’ విద్యార్థుల సం‘గతి’ ఏంటి?
సాక్షి, అమరావతి: ఫాతిమా మెడికల్ కాలేజీ బాధిత విద్యార్థుల కథ మళ్లీ మొదటికొచ్చింది. ప్రభుత్వమే వారిని చదివిస్తుందని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. ఆ తర్వాత మళ్లీ పట్టించుకోలేదు. మెడికల్ సీట్లకు సంబంధించిన మొదటి దశ కౌన్సెలింగ్ పూర్తయినా.. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం ఇచ్చిన హామీపై అధికారులను ప్రశ్నించినా భరోసా లభించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ నుంచి ఫీజుల రూపంలో వసూలు చేసిన రూ.37 కోట్లు ఇప్పటికీ ఆ కాలేజీ యాజమాన్యం వద్దే ఉన్నాయని తెలిపారు. ఎన్టీఆర్ వర్సిటీ వీసీని సంప్రదించగా.. సీఎం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదన్నారని వాపోయారు. ప్రస్తుతం 62 మంది విద్యార్థులం అర్హత సాధించామని.. మమ్మల్ని చదివిస్తామంటూ ఇచ్చిన హామీని సీఎం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఏ రోజు ఏమన్నారంటే.. 2016 డిసెంబర్ 22: వంద మంది ఫాతిమా విద్యార్థులను ప్రైవేటు కాలేజీల్లోని 50 సీట్లలో, ప్రభుత్వ కాలేజీల్లోని 50 సీట్లలో సర్దుబాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. 2017 జూలై: బాధిత విద్యార్థుల గురించి కేంద్రంతో మాట్లాడానని నంద్యాల ఉప ఎన్నికప్పుడు సీఎం చెప్పారు. వాళ్లందరూ తిరిగి ఎంబీబీఎస్ కొనసాగించేలా చేస్తామన్నారు. 2017 ఆగస్ట్: ఇక మీ కష్టాలన్నీ తీరిపోయాయని విద్యార్థులకు సీఎం చెప్పారు. 2017 నవంబర్ 28: కోచింగ్ ఇప్పించి.. సీట్లు వస్తే వాటికయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. 2018 జూన్ 6: కడపలో సీఎం మాట్లాడుతూ.. నీట్లో క్వాలిఫై అయిన ఫాతిమా విద్యార్థులందరికీ సీట్లు ఇప్పిస్తామని చెప్పారు. -
ఫాతిమా విద్యార్థులకు మరో షాక్
సాక్షి, అమరావతి: ఫాతిమా వైద్యకళాశాల బాధిత విద్యార్థులకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మరో షాక్ ఇచ్చారు. ఇన్నాళ్లూ సీట్లు ఇస్తామని, అందరికీ న్యాయం చేస్తామని, ఆర్డినెన్స్ తెస్తామని, యాజమాన్యం నుంచి డబ్బులు ఇప్పిస్తామని చెప్పిన మంత్రి ఆదివారం తనను కలసిన బాధిత విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఆర్డినెన్స్ గురించి ప్రస్తావించిన విద్యార్థులతో.. నేను ఆర్డినెన్స్ తెస్తాను ఆ తర్వాత మీరు ఆర్ఎంపీ డాక్టర్లవుతారు అంటూ చెప్పేసరికే విద్యార్థులందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇన్నాళ్లూ ఆర్డినెన్స్ తెస్తాం, న్యాయం చేస్తానన్న మంత్రి ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రిని కలసిన అనంతరం బాధిత విద్యార్థులు ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. పదిహేను రోజులుగా ప్రభుత్వం ఫాతిమా విద్యార్థులకు న్యాయం చేయడానికి కేరళ తరహాలోనే ఆర్డినెన్స్ తీసుకొస్తున్నామని చెప్పింది. దీని సంగతి అడగడానికి విజయవాడలోని మంత్రి ఇంటికి బాధిత విద్యార్థులు, కొంతమంది తల్లిదండ్రులు వెళ్లి కలిశారు. ఇక్కడ మంత్రి తమను తీవ్రంగా ఆవేదన చెందేలా మాట్లాడారని వారు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా విమర్శిస్తారని తమపై అసహనం వ్యక్తం చేశారని వాపోయారు. ‘15 రోజుల కిందట వైద్య విద్యాశాఖ ఆర్డినెన్స్‌కు సంబంధించిన డ్రాఫ్ట్‌ను న్యాయశాఖ సలహా కోసమని పంపించారు. దాని సంగతి ఇప్పటికీ అతీగతీ లేదు. తాజాగా మంత్రి కామినేని దీనివల్ల ఉపయోగం లేదని చెబుతున్నారు. పైగా మాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను నిండా ముంచారు’ అని వారు పేర్కొన్నారు. -
‘ఫాతిమా’ విద్యార్థులకు న్యాయం చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం, ఫాతిమా మెడికల్ కళాశాల యాజమాన్యం తప్పు వల్ల అడ్మిషన్లు కోల్పోయి రోడ్డున పడ్డ 100 మంది విద్యార్థులకు న్యాయం చేయాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మరోసారి కోరారు. గురవారం కేంద్ర మంత్రిని ఢిల్లీలో కలసిన సుబ్బారెడ్డి.. అడ్మిషన్లు కోల్పోయిన 100 మంది విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో సీట్లు సర్దుబాటు చేసేందు వీలుగా ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేసి 100 సూపర్‌న్యూమరరీ ఎంబీబీఎస్ సీట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఇదే విధమైన ఆర్డినెన్స్ ద్వారా గతంలో కేరళ, పాండిచ్చేరిలో విద్యార్థులకు సీట్లు సర్దుబాటు చేసిన విషయాన్ని సుబ్బారెడ్డి ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి గుర్తు చేశారు. వీలైతే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఒప్పించి ఫాతిమా కళాశాలకు 100 సీట్లు అదనంగా కేటాయించేలా సిఫార్సు చేయాలని కోరారు. -
మర్యాదగా కోచింగ్‌లో చేరండి
సాక్షి, అమరావతి: ‘ఇలాగైతే మీకు నీట్లో సీట్లు రావు, గీట్లు రావు.. మర్యాదగా కోచింగ్‌లో చేరి చదువుకోండి’ అంటూ ఫాతిమా మెడికల్ కాలేజీ బాధిత విద్యార్థులకు సీఎం పేషీ నుంచి బెదిరింపు ఫోన్లు వస్తున్నాయి. ఓవైపు ఫాతిమా కాలేజీ వ్యవహారమై ఎంసీఐతో చర్చించేందుకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, వైద్య విద్యా సంచాలకులు(అకడమిక్) డా.బాబ్జీ ఢిల్లీకి వెళ్లారు. అక్కడ చర్చలు జరుగుతుండగానే సీఎం పేషీకి చెందిన కొందరు అధికారులు ఫాతిమా విద్యార్థులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. ‘కేంద్రం నుంచి ఎలాంటి హామీ రాలేదు. మర్యాదగా నీట్ కోసం కోచింగ్‌లో చేరండి. లేదంటే మీ కెరీర్ పాడవుతుంది’ అని బెదిరింపులకు దిగుతున్నారని బాధిత విద్యార్థులు వాపోయారు. మరోవైపు ఫాతిమా కాలేజీ యాజమాన్యం కూడా తమకు ఫోన్లు చేసి భయపెట్టేందుకు ప్రయత్నిస్తోందని విద్యార్థులు వాపోయారు. -
నీట్ కోచింగ్ అనడం అన్యాయం
విజయవాడ: కడపలోని ఫాతిమా మెడికల్ కళాశాల విద్యార్థులు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను శుక్రవారం ఉదయం కలుసుకున్నారు. తమ సమస్యపై రెండున్నర సంవత్సరాలుగా పోరాడుతున్నామని తెలిపారు. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా తమకు వేరే కాలేజీలో చదువుకునే అవకాశం కల్పిస్తున్నట్లు సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారని, ఆ తర్వాత తమను పట్టించుకోలేదని వాపోయారు. ఇలాంటి పరిస్థితి కేరళలో ఎదురైతే అక్కడి ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా న్యాయం చేసిందని వివరించారు. ఇక్కడ మాత్రం సీఎం చంద్రబాబు, వైద్య శాఖ మంత్రి కామినేనిలు నీట్ కోసం కోచింగ్ ఇప్పిస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. కళాశాల యాజమాన్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదని, యాజమాన్యం చేసిన తప్పుకు తాము బలి అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులను రీలొకేట్ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఎంసీఏను కోరాలని, లేదా ఆర్డినెన్స్ జారీ చేయాలని కోరారు. కనీసం ‘సి’ కేటగిరీలో కట్టిన డబ్బులు కూడా తిరిగి ఇచ్చేది లేదని మేనేజ్మెంట్ చెబుతోందని విద్యార్థులు పవన్‌కల్యాణ్‌కు మొరపెట్టుకున్నారు. -
ఫాతిమా విద్యార్థులకు ‘నీట్’ కోచింగ్!
విజయవాడ(హెల్త్ యూనివర్సిటీ): ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థులకు నారాయణ విద్యాసంస్థలో ‘నీట్’ కోచింగ్ ఇప్పిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసరావు చెప్పారు. అలాగే వారు కట్టిన డబ్బులను ఫాతిమా యాజమాన్యంతో తిరిగి ఇప్పిస్తామన్నారు. గురువారం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఫాతిమా కాలేజీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మంత్రి సమావేశమయ్యారు. అనంతరం మంత్రి కామినేని మీడియాతో మాట్లాడారు. ఫాతిమా కాలేజీ విద్యార్థులకు జరిగిన అన్యాయంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పాత్ర ఏమీ లేదన్నారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కాలేజీ యాజమాన్యం వల్లే వారికి అన్యాయం జరిగిందని ఆరోపించారు. నష్టపోయిన విద్యార్థులకు విజయవాడ సమీపంలోని పోరంకిలో ఉన్న నారాయణ క్యాంపస్‌లో ప్రభుత్వ ఖర్చులతో నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ ఇప్పిస్తామని చెప్పారు. విద్యార్థులంతా సోమవారం ఉదయం 11 గంటలకు పోరంకి నారాయణ క్యాంపస్‌కు రావాలని సూచించారు. కాగా, 108 అంబులెన్స్ సర్వీస్ ప్రొవైడర్ విషయంలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉమ్మడి హైకోర్టు తీర్పు ఇచ్చిందని మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం పని చేస్తున్న సిబ్బందిని తొలగించబోమని చెప్పారు. -
విద్యార్థులకు హామీ ఇచ్చి మళ్లీ దగా చేశారు
-
ఫాతిమా విద్యార్థులకు సీఎం ఎలాంటి భరోసా ఇవ్వలేదు
-
ఖర్చులిస్తాం.. కోచింగ్‌కు వెళ్లండి
సాక్షి, అమరావతి: ధర్నాలు చేస్తే కోల్పోయిన సీట్లు రావని, ఇలాంటి ధర్నాలు, ఆందోళనలను తాను చాలా చూశానని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఫాతిమా వైద్య కళాశాల బాధిత విద్యార్థులు సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రిని కలిశారు. ప్రభుత్వంలో ఉన్నది తాము అని, ఎవరిలో కలిస్తే వాళ్లు మీకు సీట్లు ఇప్పించలేరని చంద్రబాబు అన్నట్లు విద్యార్థులు తెలిపారు. తమకు సీట్ల విషయంలో సీఎం ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదని వాపోయారు. ఇప్పటికైనా ధర్నాలు చేయడం, టవర్లు ఎక్కడం, ప్రతిపక్ష నేతలను కలవడం వంటివి మానుకోవాలని, కెరీర్ దెబ్బతినకుండా వచ్చే ఏడాది పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలో చూడాలని విద్యార్థులకు చంద్రబాబు హితబోధ చేశారు. ఈ నెల 29న ఢిల్లీకి వెళ్తున్నామని, విద్యార్థుల్లో ఐదుగురు కమిటీగా ఏర్పడి వస్తే వారిని కూడా తీసుకెళ్తామని అన్నారు. అయితే, ఈ ఏడాది (2017–18) నీట్లో అర్హత పొందిన విద్యార్థులకైనా సీట్లు ఇస్తారా? అని అడగ్గా ఈ ఏడాది సాధ్యం కాకపోవచ్చని చెప్పారు. కావాలంటే లాంగ్‌టర్మ్ కోచింగ్‌కు వెళ్లాలని, అందుకయ్యే వ్యయాన్ని ప్రభుత్వం భరిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రితో భేటీ అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నుంచి తమకు ఎలాంటి భరోసా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 29వ తేదీ తర్వాత స్పష్టమైన వైఖరిని వెల్లడిస్తామని ఫాతిమా కళాశాల విద్యార్థులు తెలిపారు. -
ఆత్మహత్యలే శరణ్యం
విజయవాడ: తమ సమస్యను పరిష్కరించాలంటూ నిరాహార దీక్షలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో కడప ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థులు ఆదివారం సెల్ టవర్ ఎక్కారు. బలవన్మరణాలకు సిద్ధమయ్యారు. ఈ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఫాతిమా విద్యార్థులు గత 26 రోజులుగా విజయవాడ అలంకార్ సెంటర్‌కు సమీపంలోని ధర్నా చౌక్‌లో రిలే నిరాహార దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఆదివారం ఉదయం ఏలూరు రోడ్డులోని గుణదల విద్యుత్ సౌధ వద్ద ఉన్న సెల్ టవర్ వద్దకు ఒకరి తర్వాత మరొకరుగా చేరుకున్న ఇద్దరు విద్యార్థినులు సహా ఆరుగురు విద్యార్థులు, ఓ విద్యార్థి తండ్రి దానిపైకి ఎక్కారు. తమ సమస్య విషయంలో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై నోటికి కర్చీఫ్‌లు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. 9 గంటల సమయంలో సమాచారం అందుకున్న తోటి విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు, రాజకీయ పక్షాల నేతలు అక్కడకు చేరుకుని వారికి మద్దతుగా సెల్ టవర్ వద్ద ధర్నాకు దిగారు. తమకు ఆత్మహత్యే శరణ్యమని సెల్ టవర్ ఎక్కిన విద్యార్థులు కౌసర్, జకీరా (విద్యార్థినులు), కిషోర్, హసన్, షమీ, జగన్ సెల్‌ఫోన్ ద్వారా మీడియా ప్రతినిధులకు చెప్పారు. పోలీసులు వచ్చి విద్యార్థి సంఘాల నేతలతో పాటు, వైఎస్సార్సీపీ, వామపక్ష పార్టీల నేతలను అరెస్టు చేశారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కృష్ణా జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, విజయవాడ ఆర్డీఓ హరీష్‌లు వచ్చి సెల్ టవర్‌పై ఉన్న విద్యార్థులతో ఫోన్లో చర్చించారు. మంత్రి కామినేని శ్రీనివాస్ ఫోన్లో మాట్లాడినా టవర్ దిగేందుకు విద్యార్థులు నిరాకరించారు. రోజంతా పలు దఫాలుగా చర్చలు జరిపిన కలెక్టర్ ఇచ్చిన హామీ నేపథ్యంలో నలుగురు విద్యార్థులు, ఓ విద్యార్థి తండ్రి జగన్మోహన్రెడ్డి సెల్ టవర్ దిగారు. మరో ఇద్దరు విద్యార్థులు షమి, జగన్ మాత్రం రాత్రి 7 గంటల వరకు టవర్ దిగేందుకు నిరాకరించారు. చివరకు అధికారులు వారికి కూడా నచ్చచెప్పి కిందకు దించారు. సోమవారం ఉదయం 9 గంటలకు వీరు ముఖ్యమంత్రితో భేటీ కానున్నట్లు తెలిసింది. -
ఫాతిమా విద్యార్థులకు న్యాయం చేయండి
సాక్షి ప్రతినిధి, కడప/ చింతకొమ్మదిన్నె: నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థుల అంశాన్ని వాడుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. విద్యార్థులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఎన్నికలు ముగిశాక వారిని మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాది చదువుకున్న తర్వాత సీట్లు లేవంటే ఎలా? అని ప్రశ్నించారు. తక్షణమే ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాసంకల్ప పాదయాత్రలో ఉన్న జగన్‌ను ఫాతిమా కళాశాల విద్యార్థులు గురువారం మధ్యాహ్నం యర్రగుంట్ల శివారులో కలిశారు. ప్రభుత్వం న్యాయం చేయకపోతే ఆత్మహత్య తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని కన్నీరు పెట్టుకున్నారు. తాము డాక్టర్లవుతామని ఆశ పడ్డామని, కుటుంబ సభ్యులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని చెప్పారు. ఎంసీఐ అనుమతి రాకముందే సీట్లు భర్తీ చేసుకుని సమస్య రావడంతో కర్ణాటక, కేరళ, పంజాబ్ ప్రభుత్వాలు బాధితులకు అండగా నిలిచి న్యాయం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని జగన్ దృష్టికి తెచ్చారు. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో ఇదే సమస్య వస్తే ఆయన న్యాయం చేసి విద్యార్థులను ఆదుకున్నారని తెలిపారు. ప్రభుత్వం సుప్రీంకోర్టులో బలహీనమైన పిటీషన్ వేసి దాన్ని కోర్టు కొట్టేసేలా చేసిందని ఆవేదన చెందారు. న్యాయం కోసం విజయవాడలో కుటుంబాలతో పాటు నిరాహారదీక్ష చేస్తే ప్రభుత్వం సానుభూతిగా కూడా అటువైపు వచ్చి పలకరించలేదని చెప్పారు. కేంద్రప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకుని వస్తే తమకు న్యాయం జరుగుతుందని తెలిపారు. 99 మంది విద్యార్థుల భవిష్యత్ కోసం తమకు సహాయం చేయాలని వేడుకున్నారు. విద్యార్థుల ఆవేదన విన్న జగన్ ఉద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. విద్యార్థుల జీవితాలతో సర్కారు చెలగాటం నంద్యాల ఉప ఎన్నిక సమయంలో చంద్రబాబు ఫాతిమా కళాశాల విద్యార్థులకు సీట్లు ఇచ్చేసినట్లు చెప్పుకుని వారితో సన్మానం కూడా చేయించుకున్నారని జగన్ గుర్తుచేశారు. ఆ తర్వాత మానవత్వం లేకుండా వ్యవహరిస్తూ, తప్పుడు అఫిడవిట్లతో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడారని విమర్శించారు. గతంలో ఇదే సమస్య ఎదురైతే దివంగత సీఎం వైఎస్సార్ విద్యార్థులకు న్యాయం చేశారని చెప్పారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏం చేసైనా సరే విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఏడాదిపాటు విద్యార్థులు తరగతులకు హాజరైన తరువాత సీట్లు ఎలా రద్దవుతాయని ప్రశ్నించారు. విద్యార్థులు నష్టపోతుంటే కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని నిలదీశారు. వచ్చే ఏడాది 100 సీట్లు వదులుకుంటామని సుప్రీంకోర్టులో చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు చెప్పలేక పోయిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ప్రయివేట్ కళాశాలల యాజమాన్యాలతో లాలూచీ పడటమే ఇందుకు కారణమని ఆరోపించారు. ఎంసీఐతో తక్షణం చర్చించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జగన్‌ను కలిసిన వారిలో బాధిత విద్యార్థులు విష్ణు, కౌసర్‌ఖాన్, జహిరాకానంతో పాటు పలువురు విద్యార్థులు, వారి కుటుంబసభ్యులు ఉన్నారు. -
ప్రతిపక్ష నేతను కలిసిన ఫాతిమా విద్యార్ధులు
సాక్షి, జమ్మలమడుగు : నాలుగో రోజు ప్రజాసంకల్పయాత్రలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గురువారం ఫాతిమా మెడికల్ కాలేజ్ విద్యార్ధులు కలిసి తమకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకున్నారు. వై.కోడూరు జంక్షన్లో ఆయనను కలిసిన ఫాతిమా కాలేజీ విద్యార్థులు...తమకు న్యాయం చేయాలంటూ వినతిపత్రం సమర్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి తమ సమస్యపై విజ్ఞప్తి చేసినా, పట్టించుకోవడం లేదని వారు కన్నీటిపర్యంతం అయ్యారు. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు, ఆయా ప్రభుత్వాలు విద్యార్థులను ఆదుకున్నాయని, అన్యాయం జరగకుండా చూశాయని గుర్తు చేశారు. తమకు ఎలాగైనా న్యాయం చేయాలని వైఎస్ జగన్‌ను కోరారు. న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యమని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు సమర్పించిన వినతి పత్రాలు స్వీకరించిన వైఎస్ జగన్... విద్యార్థుల జీవితాలతో చంద్రబాబు సర్కార్ ఆటాడుకుందని మండిపడ్డారు. చంద్రబాబుకు మానవత్వం ఉంటే ఇప్పటికైనా ఫాతిమా కాలేజ్ విద్యార్ధులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగేవరకూ పోరాడతామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. మెడిసిన్ సీట్లు నష్టపోవడానికి బాబు సర్కారే కారణం -
రాజకీయ కోణంలో చూడొద్దు
సాక్షి, విజయవాడ: ఫాతిమా మెడికల్ కళాశాల విద్యార్థులకు మానవతా దృక్పథంతో న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కోరారు. అలంకార్ సెంటర్లోని ధర్నాచౌక్‌లో దీక్ష చేస్తున్న విద్యార్థులకు గురువారం ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ సమస్యను రాజకీయ కోణంలో చూడొద్దని విజ్ఞప్తి చేశారు. సీఎం చంద్రబాబు హామీలతో కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. ఫాతిమా కాలేజీ విద్యార్థులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని భరోసాయిచ్చారు. కాగా, తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన ఆపేది లేదని, కాలేజీ యాజమాన్యం వల్ల నష్టపోయామని విద్యార్థులు వాపోయారు. రివిజన్ పిటిషన్‌తో ప్రయోజనం లేదని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు హామీలపై తమకు నమ్మకం లేదన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి తమకు న్యాయం జరిగేలా చూడాలని అవినాష్‌రెడ్డికి విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, బొప్పన భవకుమార్ తదితరులు అవినాష్ వెంట ఉన్నారు. -
ఫాతిమా విద్యార్థుల ఆశలు ఆవిరి
సాక్షి, న్యూఢిల్లీ: భారత వైద్య మండలి (ఎంసీఐ) చర్యతో అడ్మిషన్ కోల్పోయిన ఫాతిమా వైద్య కళాశాల 2015–16 బ్యాచ్ విద్యార్థులను ప్రస్తుత విద్యా సంవత్సరంలో సర్దుబాటు చేసేందుకు అనుమతించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ (మిస్లేనియస్ అప్లికేషన్)ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు, ఎంసీఐ అభిప్రాయాన్ని పరిశీలించిన అనంతరం.. ఈ కేసులో ఇంకా ముందుకు వెళ్లేందుకు ఏమీ లేనందున ఇంతటితో ముగిస్తున్నామని జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ నవీన్ సిన్హా నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్ జిల్లా కడప సమీపంలోని రామరాజుపల్లిలో గల ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాలలో 2015–16 బ్యాచ్‌లో వంద మంది విద్యార్థులు చేరారు. ఆ తర్వాతి సంవత్సరంలో ఈ కళాశాలకు ఎంసీఐ గుర్తింపు రద్దు చేయడంతో వీరి చదువు అర్ధంతరంగా ఆగిపోయింది. కళాశాల యాజమాన్యం, ఎంసీఐ నిర్వాకం వల్ల తమ భవిష్యత్తు అంధకారమయం అయిందని విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో ఈ విద్యార్థులను ప్రస్తుత విద్యా సంవత్సరంలో సర్దుబాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 22న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సెప్టెంబర్ 21లోగా స్పందించాలని ఆగస్టు 30న జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఎంసీఐ, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసు జారీ చేసింది. విద్యార్థులను ఏయే కళాశాలల్లో సర్దుబాటు చేస్తారో సెప్టెంబరు 21లోగా ప్రతిపాదనలను సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది. అయితే, తదుపరి విచారణలో.. ఏపీ ప్రభుత్వ సీట్ల సర్దుబాటు ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నట్టు ఎంసీఐ ధర్మాసనానికి నివేదించింది. దీంతో మరో ప్రతిపాదనతో వస్తామని, రెండు వారాల గడువు కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరడంతో సుప్రీంకోర్టు సమ్మతించింది. ఏపీ తాజా ప్రతిపాదనకూ నో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కారణంగా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆమోదంతో మెరిట్ లిస్టులో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు నష్టం వాటిల్లకూడదని, తర్వాత అనుమతులు తెచ్చుకోవడంలో ఫాతిమా కళాశాల వైఫల్యం కారణంగా విద్యార్థులు నష్టపోతున్నారని పేర్కొంటూ ఏపీ సర్కారు కొత్త ప్రతిపాదనను ధర్మాసనానికి నివేదించింది. ఇదే ఫాతిమా కళాశాలలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఈ విద్యార్థులను చేర్చుకుని, ఆ మేరకు వచ్చే విద్యా సంవత్సరంలో సీట్లను తగ్గించుకోవాలని ప్రతిపాదించింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆ కళాశాలలో 20 సీట్లు ఖాళీగా ఉన్నాయని, వీటికి అదనంగా అవసరమైన సీట్లను కేటాయించాలని శుక్రవారం విచారణ సందర్బంగా కోరింది. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ‘మీరు ఈ ఏడాది సీట్లు పెంచాలని అడుగుతున్నారు. వచ్చే ఏడాది సీట్లను రద్దు చేయాలని చెబుతున్నారు. మీ ప్రతిపాదనలు, ఎంసీఐ స్పందన పరిశీలించాం. ఇక ఈ కేసులో ముందుకు వెళ్లలేం.. ఇంతటితో కేసును ముగిస్తున్నాం..’ అని ధర్మాసనం స్పష్టీకరించింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతే.. కోర్టు తీర్పు వినగానే బయటకు వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బోరున విలపించారు. ఓ విద్యార్థి తండ్రి, పలువురు విద్యార్థులు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వాపోయారు. విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో కూరుకుపోయిందని, తమకు ఆత్మహత్యలే మిగిలి ఉన్నాయని కన్నీటిపర్యంతమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అటు ఎంసీఐని, ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించలేకపోయిందని కన్నీరు పెట్టుకున్నారు. -
రక్తదానం పట్ల అపోహలు వీడాలి
కడప అర్బన్ : రక్తదానం పట్ల ప్రజల్లో ఇంకా అపోహలు ఉన్నాయని, వాటిని వీడవలసిన అవసరం ఎంతైనా ఉందని ఫాతిమా మెడికల్ కళాశాల కార్యదర్శి ఏక్యూ జావేద్ పేర్కొన్నారు. ఆదివారం ప్రపంచ రక్తదాతల దినోత్సవ సందర్భంగా కడపనగరం ఏడురోడ్ల కూడలి వద్దనుంచి కోటిరెడ్డి సర్కిల్ వరకు కళాశాల కమిటీ సభ్యులు, అధ్యాపకులు, విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కోటిరెడ్డి సర్కిల్లో ఏక్యూ జావెద్ మాట్లాడుతూ రక్తదానం పట్ల ప్రజల్లో ఇటీవల కొంతమేరకు అవగాహన పెరిగిందని, రక్తదానం చేసేందుకు అన్ని వర్గాల వారు ముందుకు వస్తుండడం సంతోషదాయకమన్నారు. తమ కళాశాలలో అత్యున్నత స్థాయి రక్తనిధి కేంద్రం ఉందని, దాతలు ఈ కేంద్రానికి రక్తం ఇస్తే ఆపదలో ఉన్న వారిని ఆదుకోగలమన్నారు. రక్తదానం పట్ల ఇంకా కొన్ని అపోహలు ఉన్నాయని, అవి వీడితే రక్తదాతలకు లోటుండదన్నారు. డాక్టర్ పెద్దన్న మాట్లాడుతూ రక్తదానం పట్ల ప్రజల్లో ఇంకా అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. మెడికల్ సూపరింటెండెంట్ శ్రీనివాసన్, సీఈఓ ఇలియాస్‌సేఠ్, పెద్ద సంఖ్యలో విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు.