
సాక్షి, జమ్మలమడుగు : నాలుగో రోజు ప్రజాసంకల్పయాత్రలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గురువారం ఫాతిమా మెడికల్ కాలేజ్ విద్యార్ధులు కలిసి తమకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకున్నారు. వై.కోడూరు జంక్షన్‌లో ఆయనను కలిసిన ఫాతిమా కాలేజీ విద్యార్థులు...తమకు న్యాయం చేయాలంటూ వినతిపత్రం సమర్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి తమ సమస్యపై విజ్ఞప్తి చేసినా, పట్టించుకోవడం లేదని వారు కన్నీటిపర్యంతం అయ్యారు. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు, ఆయా ప్రభుత్వాలు విద్యార్థులను ఆదుకున్నాయని, అన్యాయం జరగకుండా చూశాయని గుర్తు చేశారు. తమకు ఎలాగైనా న్యాయం చేయాలని వైఎస్ జగన్‌ను కోరారు. న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యమని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
బాధితులు సమర్పించిన వినతి పత్రాలు స్వీకరించిన వైఎస్ జగన్... విద్యార్థుల జీవితాలతో చంద్రబాబు సర్కార్ ఆటాడుకుందని మండిపడ్డారు. చంద్రబాబుకు మానవత్వం ఉంటే ఇప్పటికైనా ఫాతిమా కాలేజ్ విద్యార్ధులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగేవరకూ పోరాడతామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
మెడిసిన్ సీట్లు నష్టపోవడానికి బాబు సర్కారే కారణం