
సాక్షి ప్రతినిధి, కడప/ చింతకొమ్మదిన్నె: నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థుల అంశాన్ని వాడుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. విద్యార్థులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఎన్నికలు ముగిశాక వారిని మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాది చదువుకున్న తర్వాత సీట్లు లేవంటే ఎలా? అని ప్రశ్నించారు. తక్షణమే ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాసంకల్ప పాదయాత్రలో ఉన్న జగన్‌ను ఫాతిమా కళాశాల విద్యార్థులు గురువారం మధ్యాహ్నం యర్రగుంట్ల శివారులో కలిశారు. ప్రభుత్వం న్యాయం చేయకపోతే ఆత్మహత్య తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని కన్నీరు పెట్టుకున్నారు. తాము డాక్టర్లవుతామని ఆశ పడ్డామని, కుటుంబ సభ్యులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని చెప్పారు.
ఎంసీఐ అనుమతి రాకముందే సీట్లు భర్తీ చేసుకుని సమస్య రావడంతో కర్ణాటక, కేరళ, పంజాబ్ ప్రభుత్వాలు బాధితులకు అండగా నిలిచి న్యాయం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని జగన్ దృష్టికి తెచ్చారు. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో ఇదే సమస్య వస్తే ఆయన న్యాయం చేసి విద్యార్థులను ఆదుకున్నారని తెలిపారు. ప్రభుత్వం సుప్రీంకోర్టులో బలహీనమైన పిటీషన్ వేసి దాన్ని కోర్టు కొట్టేసేలా చేసిందని ఆవేదన చెందారు. న్యాయం కోసం విజయవాడలో కుటుంబాలతో పాటు నిరాహారదీక్ష చేస్తే ప్రభుత్వం సానుభూతిగా కూడా అటువైపు వచ్చి పలకరించలేదని చెప్పారు. కేంద్రప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకుని వస్తే తమకు న్యాయం జరుగుతుందని తెలిపారు. 99 మంది విద్యార్థుల భవిష్యత్ కోసం తమకు సహాయం చేయాలని వేడుకున్నారు. విద్యార్థుల ఆవేదన విన్న జగన్ ఉద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు.
విద్యార్థుల జీవితాలతో సర్కారు చెలగాటం
నంద్యాల ఉప ఎన్నిక సమయంలో చంద్రబాబు ఫాతిమా కళాశాల విద్యార్థులకు సీట్లు ఇచ్చేసినట్లు చెప్పుకుని వారితో సన్మానం కూడా చేయించుకున్నారని జగన్ గుర్తుచేశారు. ఆ తర్వాత మానవత్వం లేకుండా వ్యవహరిస్తూ, తప్పుడు అఫిడవిట్‌లతో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడారని విమర్శించారు. గతంలో ఇదే సమస్య ఎదురైతే దివంగత సీఎం వైఎస్సార్ విద్యార్థులకు న్యాయం చేశారని చెప్పారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏం చేసైనా సరే విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఏడాదిపాటు విద్యార్థులు తరగతులకు హాజరైన తరువాత సీట్లు ఎలా రద్దవుతాయని ప్రశ్నించారు. విద్యార్థులు నష్టపోతుంటే కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని నిలదీశారు. వచ్చే ఏడాది 100 సీట్లు వదులుకుంటామని సుప్రీంకోర్టులో చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు చెప్పలేక పోయిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ప్రయివేట్ కళాశాలల యాజమాన్యాలతో లాలూచీ పడటమే ఇందుకు కారణమని ఆరోపించారు. ఎంసీఐతో తక్షణం చర్చించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జగన్‌ను కలిసిన వారిలో బాధిత విద్యార్థులు విష్ణు, కౌసర్‌ఖాన్, జహిరాకానంతో పాటు పలువురు విద్యార్థులు, వారి కుటుంబసభ్యులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment