
జగన్‌మోహన్‌రెడ్డిని ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం
కడప రూరల్/కడప కోటిరెడ్డి సర్కిల్: ఫాతిమా మెడికల్ కళాశాల బాధిత విద్యార్థి తండ్రి మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కడపలోని వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో 2015–2016 బ్యాచ్‌కు చెందిన బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి తండ్రి జగన్‌మోహన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూనే ఒక్కసారిగా.. వెంట తెచ్చుకున్న నిద్ర మాత్రలను మింగేశారు. ఆయన భార్య లక్ష్మీదేవి, ఇతరులు కలిసి రిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం జగన్‌మోహన్‌రెడ్డి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది
అంతకుముందు విలేకరుల సమావేశంలో ఫాతిమా కళాశాల బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని, కళాశాల యాజమాన్యంతో అధికార పార్టీ నేతలు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జగన్‌మోహన్‌రెడ్డి, నన్నేఖాన్, ఇమ్రాన్‌ఖాన్, వెంకటాద్రి, మహ్మద్ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. ‘నా కుమారుడి భవిష్యత్తు కోసం రూ.55 లక్షలకు పైగా ఫాతిమా మెడికల్ కళాశాల యాజమాన్యానికి చెల్లించాను. నాలా ఎంతో మంది అధిక వడ్డీలకు అప్పులు చేసి, మరికొందరు ఇళ్లు, స్థలాలను తెగనమ్మి దాదాపు రూ. 70 కోట్లకు పైగా చెల్లించారు.
కాలేజీలో మా పిల్లలు చేరాక కళాశాలకు గుర్తింపు లేదని తెలిసింది. మోసపోయామని తెలిసి.. భారీ ఆందోళనలు చేపట్టినా కొందరికి న్యాయం జరగలేదు’ అని జగన్‌మోహన్‌రెడ్డి వాపోయారు. 2018లో నీట్‌లో అర్హత పొందిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని ప్రకటించారని, 63 మంది అర్హత సాధించగా 43 మందికే సీట్లు ఇచ్చారన్నారు. మిగతావారికి అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు నష్ట పరిహారం అందించకుండా.. రూ .13 కోట్లు కళాశాల యాజమాన్యానికి ఇవ్వడం ఏంటని నిలదీశారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఫరూక్‌ని గత సోమవారం నంద్యాలలో కలిసి న్యాయం చేయాలని అభ్యర్థించినా.. ఆయన ఏమాత్రం స్పందించలేదన్నారు. సోమవారంలోగా న్యాయం జరగకపోతే, ఈ ప్రభుత్వం తమ చావు చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment