
సాక్షి, విజయవాడ: ఫాతిమా మెడికల్ కళాశాల విద్యార్థులకు మానవతా దృక్పథంతో న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కోరారు. అలంకార్ సెంటర్‌లోని ధర్నాచౌక్‌లో దీక్ష చేస్తున్న విద్యార్థులకు గురువారం ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ సమస్యను రాజకీయ కోణంలో చూడొద్దని విజ్ఞప్తి చేశారు. సీఎం చంద్రబాబు హామీలతో కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. ఫాతిమా కాలేజీ విద్యార్థులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని భరోసాయిచ్చారు.
కాగా, తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన ఆపేది లేదని, కాలేజీ యాజమాన్యం వల్ల నష్టపోయామని విద్యార్థులు వాపోయారు. రివిజన్ పిటిషన్‌తో ప్రయోజనం లేదని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు హామీలపై తమకు నమ్మకం లేదన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి తమకు న్యాయం జరిగేలా చూడాలని అవినాష్‌రెడ్డికి విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, బొప్పన భవకుమార్ తదితరులు అవినాష్ వెంట ఉన్నారు.