![Mp Ys Avinash Reddy Pa Raghava Reddy Arrested](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/7/RGHAVA-REDDY1.jpg.webp?itok=Wzfq-PAx)
సాక్షి, వైఎస్సార్ జిల్లా: సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కేసులో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. సంబంధం లేని వ్యక్తులను కూడా నిందితులుగా చేరుస్తూ అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా పులివెందుల(Pulivendula)లో కడప ఎంపీ వైఎ అవినాష్‌రెడ్డి(YS Avinash Reddy) పీఏ రాఘవరెడ్డి(PA Raghava Reddy)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వర్రా రవీంద్రారెడ్డి కేసులో తనకు సంబంధం లేదంటున్నా రాఘవరెడ్డిని నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేశారు.
వర్రా రవీంద్రారెడ్డి కేసులో నిందుతుల జాబితాకు అంతే లేకుండా పోయింది. ఇప్పటికే 112 మందికి పైగా నిందితులను చేర్చగా.. తాజాగా ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డిని పులివెందుల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో బండి రాఘవరెడ్డిని నిందితునిగా చేర్చారు.
దీంతో రాఘవరెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు. అయితే హైకోర్టు ఆయనకు నేడు బెయిల్ నిరాకరించడంతో పోలీసులు వెంటనే అతని ఇంటికి చేరుకుని అదుపులోకి తీసుకుని పులివెందుల అర్బన్ పీఎస్‌కు తరలించారు. ఇప్పటికే పలు దఫాలుగా రాఘవరెడ్డిని పులివెందుల డిఎస్పీ విచారణ చేశారు.
ఇదీ చదవండి: సీజ్ ద షిప్.. సర్వం లాస్!
ముందస్తు బెయిల్ అంశం కోర్టులో పెండింగులో ఉన్నప్పుడు ఆయన పోలీసులు పిలిచినప్పుడల్లా విచారణకు హాజరయ్యారు. కోర్టు చెప్పిన మేరకు విచారణకు సహకరించారు. అయినా పోలీసులు బెయిల్ పిటిషన్ రద్దు కాగానే వెంటనే అదుపులోకి తీసుకున్నారు. వాస్తవంగా వర్రా రవీంద్రారెడ్డి కేసుకు తనకు సబంధం లేదని రాఘవరెడ్డి పలుమార్లు చెప్తున్నారు. అయితే వర్రా రవీంద్రారెడ్డి పెట్టే పోస్టులకు కంటెంట్ రాఘవరెడ్డే ఇస్తున్నాడంటూ కేసు నమోదు చేశారు.
వర్రా రవీంద్రారెడ్డి ఇచ్చిన వాగ్మూలంలో ఈ వివరాలు చెప్పారని పోలీసులు అంటుండగా.. వర్రా రవీంద్రారెడ్డి తనను చిత్రహింసలకు గురిచేసి తనతో తప్పుడు వాగ్మూలం రాయించుకున్నారని మేజిస్ట్రేట్ ముందు చెప్పారు. ఈ నేపథ్యంలో రాఘవరెడ్డి అరెస్ట్ ప్రాధాన్యతను సంతరించుకుంది. మరో వైపు ఈ కేసులో నిందితుల జాబితా ఎంతవరకూ పెంచుకుంటూ పోతారో అర్థం కావడం లేదని బాధితులు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment