
రక్తదానం పట్ల అపోహలు వీడాలి
కడప అర్బన్ : రక్తదానం పట్ల ప్రజల్లో ఇంకా అపోహలు ఉన్నాయని, వాటిని వీడవలసిన అవసరం ఎంతైనా ఉందని ఫాతిమా మెడికల్ కళాశాల కార్యదర్శి ఏక్యూ జావేద్ పేర్కొన్నారు. ఆదివారం ప్రపంచ రక్తదాతల దినోత్సవ సందర్భంగా కడపనగరం ఏడురోడ్ల కూడలి వద్దనుంచి కోటిరెడ్డి సర్కిల్ వరకు కళాశాల కమిటీ సభ్యులు, అధ్యాపకులు, విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కోటిరెడ్డి సర్కిల్‌లో ఏక్యూ జావెద్ మాట్లాడుతూ రక్తదానం పట్ల ప్రజల్లో ఇటీవల కొంతమేరకు అవగాహన పెరిగిందని, రక్తదానం చేసేందుకు అన్ని వర్గాల వారు ముందుకు వస్తుండడం సంతోషదాయకమన్నారు.
తమ కళాశాలలో అత్యున్నత స్థాయి రక్తనిధి కేంద్రం ఉందని, దాతలు ఈ కేంద్రానికి రక్తం ఇస్తే ఆపదలో ఉన్న వారిని ఆదుకోగలమన్నారు. రక్తదానం పట్ల ఇంకా కొన్ని అపోహలు ఉన్నాయని, అవి వీడితే రక్తదాతలకు లోటుండదన్నారు. డాక్టర్ పెద్దన్న మాట్లాడుతూ రక్తదానం పట్ల ప్రజల్లో ఇంకా అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. మెడికల్ సూపరింటెండెంట్ శ్రీనివాసన్, సీఈఓ ఇలియాస్‌సేఠ్, పెద్ద సంఖ్యలో విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు.