
విజయవాడ(హెల్త్ యూనివర్సిటీ): ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థులకు నారాయణ విద్యాసంస్థలో ‘నీట్’ కోచింగ్ ఇప్పిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసరావు చెప్పారు. అలాగే వారు కట్టిన డబ్బులను ఫాతిమా యాజమాన్యంతో తిరిగి ఇప్పిస్తామన్నారు. గురువారం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఫాతిమా కాలేజీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మంత్రి సమావేశమయ్యారు.
అనంతరం మంత్రి కామినేని మీడియాతో మాట్లాడారు. ఫాతిమా కాలేజీ విద్యార్థులకు జరిగిన అన్యాయంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పాత్ర ఏమీ లేదన్నారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కాలేజీ యాజమాన్యం వల్లే వారికి అన్యాయం జరిగిందని ఆరోపించారు. నష్టపోయిన విద్యార్థులకు విజయవాడ సమీపంలోని పోరంకిలో ఉన్న నారాయణ క్యాంపస్‌లో ప్రభుత్వ ఖర్చులతో నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ ఇప్పిస్తామని చెప్పారు.
విద్యార్థులంతా సోమవారం ఉదయం 11 గంటలకు పోరంకి నారాయణ క్యాంపస్‌కు రావాలని సూచించారు. కాగా, 108 అంబులెన్స్ సర్వీస్ ప్రొవైడర్ విషయంలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉమ్మడి హైకోర్టు తీర్పు ఇచ్చిందని మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం పని చేస్తున్న సిబ్బందిని తొలగించబోమని చెప్పారు.