
క్యాజువాలిటి వద్ద ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లు
కర్నూలు(హాస్పిటల్) : ఆందోళనల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తమ సత్తా ఏంటో చూపిస్తామని జూనియర్ డాక్టర్లు హెచ్చరించారు. గత నెలలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ఈనెల 6 నుంచి కర్నూలులో జూనియర్ డాక్టర్లు సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ మధ్యలో ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ జోక్యం చేసుకుని జూడాలతో చర్చలు జరిపారు. అవి ఫలవంతం కాకపోవడంతో గురువారం నుంచి జూడాలు మెరుపు సమ్మె ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆసుపత్రిలోని ఓల్డ్ క్లినికల్ లెక్చరర్ గ్యాలరీలో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై వారు సమాలోచనలు జరిపారు.
అనంతరం బయట ఏర్పాటు చేసిన శిబిరం వద్ద సహ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తమతో వెట్టిచాకిరీ చేయిస్తోందని ఆరోపించారు. 6 – 8 నెలలకోసారి ఉపకార వేతనాలు ఇస్తూ తమ సహనాన్ని ప్రతిసారీ పరీక్షిస్తోందన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులకు జీతాలు, అలవెన్సులు పెంచుకోవడంలో ఉన్న ఆసక్తి పేద రోగులకు వైద్యం చేస్తున్న తమ పట్ల లేదని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్లే తాము సమ్మెకు వెళ్లాల్సి వచ్చిందని, ఇప్పటికైనా స్పందించకపోతే అత్యవసర విధులను బహిష్కరిస్తామని, ఇందుకు ప్రజలు సహకరించాలని వారు కోరారు.
హామీలు నెరవేరలేదు
మా డిమాండ్ల పరిష్కారం కోసం గత నెలలో సమ్మెలో వెళ్లేందుకు సిద్ధమై నోటీసులు ఇచ్చాం. ఈ క్రమంలో ఆరోగ్యమంత్రి కామినేని చర్చలకు పిలిచి సమస్యల పరిష్కారం కోసం హామీలిచ్చారు. 40 రోజులైనా ఆయన ఇచ్చిన హామీలు నెరవేరలేదు. – డాక్టర్ భార్గవ్, కేఎంసీ
Comments
Please login to add a commentAdd a comment