సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు తమ సమ్మెను విరమించారు. ఆరోగ్యశాఖ అధికారులతో మంగళవారం అర్ధరాత్రి వరకు జరిగిన చర్చలు సఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ఇది తాత్కాలిక విరమణ మాత్రమే తెలుస్తోంది. కొన్ని అంశాలపై జీవో విడుదల చేస్తామని ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీతోనే జూడాలు సమ్మెను ప్రస్తుతానికి విరమించినట్లు తెలుస్తోంది.
డీఎంఈ, ఆరోగ్య శాఖ అధికారులతో గత అర్ధరాత్రి వరకు చర్చలు జరిగాయి. బోధనాసుపత్రుల్లో జూడాలకు వసతి భవనాల కోసం నిధుల విడుదల, కాకతీయ యూనివర్సిటీలో రహదారుల మరమ్మతులకు నిధుల మంజూరు.. ఈ రెండు జీవోల విడుదలకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. వీటికి సంబంధించిన జీవోలు తక్షణమే విడుదల చేస్తామని ప్రభుత్వం జూడా సంఘానికి హామీ ఇచ్చింది. అయితే ఈ సాయంత్రంలోపు జీవోలు విడుదల కాకుంటే.. రేపటి నుంచి మళ్లీ సమ్మె చేపడతామని జూడాలు స్పష్టం చేశారు.
మరోవైపు ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో.. సమ్మె కొనసాగించాలని అక్కడి జూనియర్ డాక్టర్లు నిర్ణయించారు. ఇంకోవైపు ఇవాళ అన్ని జిల్లాల ప్యానెల్స్‌ను చర్చలకు ఆరోగ్య శాఖ మంత్రి ఆహ్వానించారు.
స్టైఫండ్స్, విద్యార్థుల సమస్యలతో పాటు ఉస్మానియా ఆస్పత్రి భవన నిర్మాణం వెంటనే చేపట్టాలనే ఎనిమిది ప్రధాన డిమాండ్లతో జూన్ 24 నుంచి రాష్ట్రవ్యాప్తంగా జూడాలు సమ్మె ప్రారంభించారు. ఈ క్రమంలో విధులకు దూరంగా ఉంటూనే.. ఆస్పత్రుల వద్ద తమ డిమాండ్లను పరిష్కరించాలని ఫ్లకార్డులు పట్టుకుని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment