మెడికల్ కళాశాల్లో ఎంసీఐ ఆకస్మిక తనిఖీ
-
డాక్టర్ల సర్టిఫికెట్ల పరిశీలన
నెల్లూరు(అర్బన్):
దర్గామిట్టలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలను మంగళవారం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బృందం ఆకస్మికంగా తనిఖీ చేసింది. ఎంబీబీఎస్ కోర్సులో రెండేళ్లు పూర్తి చేసుకుని మూడో సంవత్సరంలోకి అడుగిడుతున్న విద్యార్థులకు వసతులు పరిశీలించి సీట్లు మంజూరు చేసేందుకు ఎంసీఐ బృందం తనిఖీలు చేపట్టింది. ముందస్తు సమాచారం లేకుండా ఎంసీఐ సభ్యులు మెడికల్ కళాశాలకు తనిఖీకి రావడంతో వి«ధుల్లో లేని, సెలవుపై వెళ్లిన డాక్టర్లు, ప్రొఫెసర్లను ప్రిన్సిఫల్ రవిప్రభు హడావుడిగా పిలిపించారు. పాట్నా మెడికల్ కళాశాల నుంచి వచ్చిన ఎంసీఐ టీం చైర్మన్, ఫిజియాలజీ హెడ్ డాక్టర్ ఎస్.ఎన్.శర్మ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. కళాశాలలో ఫ్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు తగినంతమంది ఉన్నారా.. లేరా అని ఆరా తీశారు. విద్యార్థులకు సరిపడా భవనాలు, ల్యాబొరేటరీలు, వసతిగృహాలు, నర్సింగ్ కళాశాల, వివిధ డిపార్ట్‌మెంట్‌లను తనిఖీ చేశారు. రాత్రి వరకు డాక్టర్ల సర్టిఫికెట్లను పరిశీలించారు. బుధవారం ఉదయం మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రి విభాగాలను పరిశీలించనున్నారు. అనంతరం ప్రిన్సిపల్, అధికారులతో ఎంసీఐ బృందం ప్రత్యేక సమావేశమైంది. ఈ కార్యక్రమంలో ఎంసీఐ టీం చైర్మన్ ఎస్.ఎన్.శర్మ, రాయ్‌పూర్‌కి చెందిన జేఎన్‌ఎం మెడికల్ కళాశాల గైనకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ నళినిమిశ్రా, సేలంకు చెందిన మోహన్‌కుమార్‌మంగళం, మెడికల్ కళాశాల పథాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.తెన్మాజి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రాధాకృష్ణరాజు(అకడమిక్). వైఎస్ ప్రిన్సిపల్ డాక్టర్ సీకే.లక్ష్మీదేవి(అడ్మిన్), పెద్దాస్పత్రి సూపరింటెండ్ డాక్టర్ భారతి పాల్గొన్నారు.