
న్యూఢిల్లీ: దేశంలోగానీ, ప్రపంచంలోగానీ ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్ చేయాల్సిన అవసరం లేదని అది సైంటిఫిక్ పద్ధతి కాదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. వైరస్ తన పంథాను మార్చుకుంటున్న కొద్దీ, దాన్ని బట్టి మన ప్రాధాన్యతలను మార్చుకోవాలని లోక్‌సభలో క్వశ్చన్ అవర్ సందర్భంగా చెప్పారు. ఈ క్రమంలోనే జాతీయ, అంతర్జాతీయ నిపుణుల సలహా మేరకు ఆరోగ్య రంగం, ఫ్రంట్‌లైన్ వర్కర్ల రంగం, వృద్ధులు, 45 సంవత్సరాలు దాటి వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ అందిస్తున్నామని తెలిపారు.
వ్యాక్సిన్ తీసుకోవాలి..
కాంగ్రెస్ ఎంపీ రవీత్‌సింగ్ బిట్టు ప్రశ్నిస్తూ.. కోవిడ్ –19 వల్ల ప్రజల భయపడుతున్నారని, అది భవిష్యత్తులో వారికి హాని చేస్తుందా అని ప్రశ్నించారు.. దానికి హర్షవర్ధన్ సమాధానమిచ్చారు. పోలియో, చికెన్ పాక్స్ వంటి వ్యాధులపై మనం విజయం సాధించామని, అందుకు కారణం వ్యాక్సినేషన్ అని చెప్పారు. త్వరలోనే భారత్ నుంచి మరికొన్ని కోవిడ్ వ్యాక్సిన్లు వస్తాయని వాటితో పాటే ప్రీ–ట్రయల్స్, క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన వివరాలను వెల్లడిస్తామని చెప్పారు.
అందరికీ రక్తం అందింది..
తలసేమియాపై పార్లమెంటులో లేవనెత్తిన ప్రశ్నకు హర్షవర్ధన్ సమాధానమిస్తూ.. తలసేమియా రోగులకు తరచుగా రక్తం ఎక్కించాల్సి ఉంటుందని అన్నారు. కరోనాతో దేశం అతలాకుతలమైన సమయంలో కూడా ఏ ఒక్క తలసేమియా రోగికి రక్తం అందని పరిస్థితి ఎదురుకాలేదని చెప్పారు.
ఒక్క ఏడాదిలోనే..
ఏడాదిలోనే 75 వైద్య కళాశాలలను మంజూరు చేసినట్లు తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద 30 వేల ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించామన్నారు. ఇదంతా కోవిడ్ విజృంభించి సమయంలోనే జరిగిందన్నారు. ఆరేళ్లలో 24 వేల కొత్త పీజీ మెడికల్ సీట్లను సృష్టించినట్లు వెల్లడించారు.
39,726 కొత్త కరోనా కేసులు..
దేశంలో గత 24 గంటల్లో 39,726 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. ఈ ఏడాదిలో నమోదైన అత్యధిక కేసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,15,14,331కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 154 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,59,370కు చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,10,83,679కు చేరుకుంది. యాక్టివ్ కేసుల సంఖ్య 2,71,282గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment