న్యూఢిల్లీ: ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నరే సుప్రీం అని స్పష్టతనిచ్చే ‘ఢిల్లీ’ బిల్లును బుధవారం రాజ్యసభ ఆమోదించింది. ఇప్పటికే ఈ బిల్లుకు లోక్‌సభ ఓకే చెప్పడంతో బిల్లును పార్లమెంట్ ఆమోదించినట్లయింది. ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వంకన్నా లెఫ్టినెంట్ గవర్నర్‌దే అంతిమాధికారం అని చెప్పే ఈ బిల్లు ఆమోదం సందర్భంగా బుధవారం రాజ్యసభలో హైడ్రామా నడిచింది. బిల్లును వ్యతిరేకిస్తూ పలు ప్రతిపక్షాలు ఆందోళనచేశాయి. ఎస్‌పీ, కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీల ఎంపీలు వాకవుట్ చేశారు.
ద గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ సవరణ బిల్లు 2021(జీఎన్‌సీటీడీ) ప్రకారం ఢిల్లీలో ప్రభుత్వం అంటే లెఫ్ట్‌నెంట్ గవర్నరే!. ముందుగా బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా వాదనలు జరిగాయి. ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమని, దీన్ని సెలక్ట్ కమిటీకి పంపాలని ప్రతిపక్షాలు కోరాయి. బిల్లుతో ఢిల్లీలో బలమైన ప్రభుత్వయంత్రాంగం ఏర్పడుతుందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. 1991లో తెచ్చిన చట్టంలోని సందిగ్ధతలు తొలగించేందుకే ఈ బిల్లు తెచ్చామన్నారు. సుప్రీంకోర్టు గతంలో చెప్పిన తీర్పుల సారాంశానికి అనుగుణంగానే మార్పులు చేశామని వివరించారు.
ప్రజాస్వామ్యానికి దుర్దినం
బిల్లుకు పార్లమెంట్‌లో ఆమోదం లభించడంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విచారం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి దుర్దినంగా అభివర్ణించారు. అయితే తిరిగి ప్రజా ప్రభుత్వానికి అధికారాలు పునఃసంప్రాప్తించేందుకు తాను చేసే పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రాజ్యసభలో ఈ బిల్లు పాసైంది. ఇది భారత ప్రజాస్వామ్యానికి చీకటిరోజు. ప్రజలకు తిరిగి అధికారం సాధించేవరకు పోరాటం ఆపను. మంచిపనులు ఆగవు, నెమ్మదించవు’ అని ఆయన ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment