Ordinance Issued
-
ఢిల్లీ బిల్లు నెగ్గింది
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ సీనియర్ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపై నియంత్రణ కోసం ఉద్దేశించిన ‘గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ(అమెండ్మెంట్) బిల్లు–2023’ సోమవారం రాజ్యసభలో ఆమోదం పొందింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బిల్లును సభలో ప్రవేశపెట్టారు. సుదీర్ఘ చర్చ అనంతరం సభాపతి ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా 131 మంది ఎంపీలు, వ్యతిరేకంగా 102 మంది ఎంపీలు ఓటువేశారు. ఢిల్లీ బిల్లు గత వారమే లోక్‌సభలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎగువ సభ సైతం ఆమోద ముద్ర వేయడంతో ఇక రాష్ట్రపతి సంతకంతో బిల్లు చట్టరూపం దాల్చనుంది. ప్రస్తుతం రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 238. అధికార ఎన్డీయేతోపాటు ఈ బిల్లు విషయంలో ఆ కూటమికి అనుకూలంగా ఉన్న సభ్యుల సంఖ్య 131. వారంతా బిల్లుకు మద్దతు పలికారు. ఇక విపక్ష ‘ఇండియా’ కూటమితోపాటు ఇతర విపక్ష సభ్యుల సంఖ్య 104 ఉండగా, బిల్లుకు వ్యతిరకంగా 102 ఓట్లు మాత్రమే వచ్చాయి. మరో ముగ్గురు సభ్యులు ఎటూ తేల్చుకోలేదు. ఓటింగ్‌లో పాల్గొనలేదు. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తారా?: విపక్షాలు ఢిల్లీ బిల్లును రాజ్యసభలో ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీనిపై తొలుత సభలో చర్చను కాంగ్రెస్ సభ్యుడు అభిషేక్ సింఘ్వీ ప్రారంభించారు. బిల్లు రాజ్యాంగవిరుద్ధమని, ప్రజాస్వామ్య వ్యతిరేకమని చెప్పారు. మనమంతా కచి్చతంగా వ్యతిరేకించాలని విపక్షాలకు పిలుపునిచ్చారు. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉన్న ఈ చర్య ఏదో ఒక రోజు మీ దాకా వస్తుంది అంటూ హెచ్చరించారు. సుప్రీంకోర్టు రాజ్యాంగం ధర్మాసనం ఇచి్చన రెండు తీర్పులకు వ్యతిరేకంగా బిల్లును తీసుకొచ్చారని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కాంగ్రెస్ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం మాట్లాడుతూ.. ఢిల్లీ బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. అలాగే బిల్లుపై చర్చలో ఆమ్ ఆద్మీ పార్టీ, డీఎండీకే, సమాజ్‌వాదీ పార్టీ, భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్), ఆర్జేడీ, సీపీఎం, జేడీ(యూ), కేరళ కాంగ్రెస్(ఎం), సీపీఐ తదితర పారీ్టల సభ్యులు మాట్లాడారు. ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను బలవంతంగా లాక్కోవడానికే బిల్లును తీసుకొచ్చారని దుయ్యబట్టారు. అధికారాలు లాక్కోవడానికి కాదు: అమిత్ షా బిల్లును తీసుకొచ్చింది కేవలం ఢిల్లీ ప్రజల హక్కులను కాపాడడం కోసమేనని, అంతేతప్ప ఆప్ ప్రభుత్వ అధికారాలను లాక్కోవడానికి కాదని అమిత్ షా తేలి్చచెప్పారు. ఢిల్లీ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చకు సమాధానమిచ్చారు. ఇది పూర్తిగా చట్టబద్ధమేనని, సుప్రీంకోర్టు తీర్పును ఏ కోణంలోనూ ఉల్లంఘించడం లేదని వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాల కంటే ఢిల్లీ చాలా భిన్నమని తెలియజేశారు. పార్లమెంట్, వివిధ దేశాల రాయబార కార్యాలయాలు, సుప్రీంకోర్టు ఇక్కడే ఉన్నాయని, వివిధ దేశాల అధినేతలు ఢిల్లీని తరచుగా సందర్శిస్తుంటారని, అందుకే ఈ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేసినట్లు పేర్కొన్నారు. పరిమిత అధికారాలున్న అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీ అని అన్నారు. ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి దినం: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ న్యూఢిల్లీ: ‘దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇది చీకటి రోజు. ఢిల్లీ సర్వీసెస్ బిల్లు విషయంలో ఆప్‌నకు తోడుగా నిలిచిన రాజకీయ పార్టీలకు నా కృతజ్ఞతలు. ఢిల్లీలో నాలుగు పర్యాయాలు ఆప్ చేతిలో ఘోరంగా ఓటమిపాలైన బీజేపీ, దొడ్డిదారిన అధికారంలోకి వచ్చేందుకే ఈ బిల్లును తీసుకువచ్చింది. ఆప్ చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో బీజేపీ పోటీ పడలేకపోతోంది. నన్ను ముందుకు వెళ్లకుండా చేయడమే వారి ఏకైక లక్ష్యం. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఒక్క సీటును కూడా ప్రజలు బీజేపీకి దక్కనివ్వరు. ఢిల్లీ వ్యవహారాల్లో ప్రధాని మోదీ జోక్యం ఎందుకు చేసుకుంటున్నారు? ’అంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఒక వీడియో విడుదల చేశారు. -
అసైన్డ్ భూముల సవరణ చట్టం అమలుకు మార్గదర్శకాలు జారీ
సాక్షి, అమరావతి: అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తూ అసైన్డ్ చట్టంలో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసిన ప్రభుత్వం దాన్ని అమలు చేసేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఆదివారం జిల్లా కలెక్టర్లకు ఈ–ఫైల్ విధానంలో ఆదేశాలిచ్చారు. ప్రభుత్వం భూమి కేటాయించిన వ్యక్తి, అతను లేకపోతే అతని వారసుల ఆదీనంలో ఆ భూమి ఉంటేనే యాజమాన్య హక్కులు కల్పించాలని సూచించారు. ఆ భూములను 1908 రిజిస్ట్రేషన్ల చట్టంలోని నిషేధిత ఆస్తుల జాబితా 22 (ఎ) నుంచి తొలగించాలని ఆదేశించారు. లంక భూములు, నీటి వనరులకు సంబంధించిన భూములకు ఇందులో నుంచి మినహాయించాలని సూచించారు. ఇందుకోసం వీఆర్ఓలు, తహశీల్దార్లు, ఆర్డీఓలు–సబ్ కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, కలెక్టర్లు ఏం చేయాలనే అంశాలను నిర్దిష్టంగా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. వీఆర్ఓలు ఇలా చేయాలి.. రికార్డులను సంస్కరించడంలో (పీఓఎల్ఆర్–ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్) భాగంగా తహశీల్దార్లు వ్యవసాయం, ఇళ్ల పట్టాల కోసం అసైన్ చేసిన భూములను గుర్తించారు. వాటిని బట్టి వీఆర్ఓలు ఆన్లైన్ అప్లికేషన్ కోసం వివరాలను సమకూర్చాలి. ఇప్పటికే గుర్తించిన సర్వే నంబర్ల ప్రకారం ఆ భూముల డీకేటీ రిజిష్టర్లు, 1బీ, అడంగల్, 22 (ఎ) జాబితా, ఇతర రెవెన్యూ రికార్డులను పరిశీలించి క్షేత్ర స్థాయిలో వంద శాతం తనిఖీలు నిర్వహించాలి. ప్రతి సర్వే నంబర్‌కు సంబంధించిన పట్టాను పరిశీలించి, ఆ పట్టాదారు.. ప్రభుత్వం భూమి కేటాయించిన వ్యక్తా లేక అతని వారసుడా? (ఒరిజినల్ అసైనీనా లేక లీగల్ హైరా), సంబంధిత భూమి వారి ఆ«దీనంలోనే ఉందా? రెవెన్యూ రికార్డుల ప్రకారం అది లంక భూమా? లేక నీటి వనరులకు సంబంధించిన భూమా? ఆ భూమి అతనికి ప్రభుత్వం ఎప్పుడు అసైన్ చేసింది? వంటి వివరాలను కచ్చితంగా సేకరించాలి. ఇందుకోసం అన్ని రికార్డులను పరిశీలించి క్షేత్ర స్థాయి విచారణ నిర్వహించాలి. తహశీల్దార్ల పాత్ర వీఆర్ఓలు ఇచ్చిన అసైన్డ్ భూముల సర్వే నంబర్లను తహశీల్దార్లు క్షుణ్ణంగా పరిశీలించాలి. మండలంలోని అన్ని అసైన్డ్ భూముల వివరాలు ఆ జాబితాలో ఉన్నాయో.. లేదో.. చూడాలి. ఈ కసరత్తులో ఏ అసైన్డ్ భూమిని వదిలి వేయకూడదు. ఒకవేళ ఏదైనా భూమిని వదిలివేసినట్లు గుర్తిస్తే వెంటనే ఆ వివరాలను సీసీఎల్ఏ కార్యాలయంలోని సీఎంఆర్ఓ (కంప్యూటరైజేషన్ ఆఫ్ మండల రెవెన్యూ ఆఫీసెస్) సెక్షన్‌కు ఈ–ఫైల్ విధానంలో పంపి కసరత్తులో చేర్చాలి. పక్కాగా తనిఖీ చేసిన తర్వాత తహశీల్దార్ అసైన్డ్ భూముల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో పబ్లిక్ నోటీస్ బోర్డులో పెట్టాలి. సూచనలు, అభ్యంతరాల కోసం 7 రోజుల సమయం ఇవ్వాలి. ఏవైనా అభ్యంతరాలు వస్తే పరిశీలించి, నిబంధనల ప్రకారం వాటిని వెంటనే క్లియర్ చేయాలి. ఆ తర్వాత మొత్తం రికార్డుల్లో 5 శాతాన్ని ఆర్డీఓలు తనిఖీ చేయాలి. జాయింట్ కలెక్టర్ల పాత్ర ఆర్డీఓలు/సబ్ కలెక్టర్లు తనిఖీ చేసిన 5 శాతం రికార్డుల్లో 1 శాతం రికార్డులను జాయింట్ కలెక్టర్ తనిఖీ చేసి, అన్నీ సరిగా ఉన్నాయో లేదో చూడాలి. వీఆర్వో నుంచి ఆర్డీఓ స్థాయి వరకు జరిగిన కసరత్తును పూర్తిగా పర్యవేక్షిస్తూ అన్ని దశల్లోనూ పారదర్శకంగా జరిగిందో లేదో పరిశీలించాలి. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత 22 (ఎ) జాబితా నుంచి ఎంపిక చేసిన సర్వే నంబర్లను తొలగించాలని కోరుతూ జిల్లా రిజిస్ట్రార్లకు ముసాయిదా లేఖ సిద్ధం చేయాలి. కలెక్టర్ దాన్ని జిల్లా రిజిస్ట్రార్‌కు పంపాలి. ప్రతి సంవత్సరం ఆగస్టు 5వ తేదీన ఇదే విధంగా నిబంధనల ప్రకారం 22 (ఎ) నుంచి తొలగించాల్సిన అసైన్డ్ భూముల వివరాలను జిల్లా రిజిస్ట్రార్లకు పంపాలి. అసైన్డ్ భూములను 22 (ఎ) జాబితా నుంచి తొలగించే ప్రక్రియను జిల్లా కలెక్టర్లు జాగ్రత్తగా పరిశీలించాలి. మొత్తం కసరత్తు పూర్తయిన తర్వాత కలెక్టర్.. జిల్లా రిజిస్ట్రార్‌కు 22 (ఎ) నుంచి తొలగించాల్సిన సర్వే నంబర్ల జాబితాను పంపి, తర్వాత దాన్ని జిల్లా గెజిట్‌లో ప్రచురించాలి. -
ఢిల్లీ బిల్లుపై కేంద్రానికి బీజేడీ మద్దతు
న్యూఢిల్లీ: ఢిల్లీ సర్వీసెస్ ఆర్డినెన్స్ స్థానంలో కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లుకు ఒడిశా అధికార పక్షం బిజూ జనతా దళ్(బీజేడీ) మద్దతివ్వనుంది. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి సైతం వ్యతిరేకంగా ఓటేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బీజేడీ నిర్ణయాన్ని మంగళవారం రాజ్యసభలో ఆ పార్టీ నేత సస్మిత్ పాత్ర ప్రకటించారు. బీజేడీ నిర్ణయం ఢిల్లీ ఆర్డినెన్స్ విషయంలో పార్లమెంట్లో ముఖ్యంగా రాజ్యసభలో కేంద్రానికి పెద్ద ఊరటనివ్వనుంది. బీజేపీ కూటమితోగానీ ప్రతిపక్షాలతోగానీ జట్టుకట్టకుండా ఢిల్లీ ఆర్డినెన్స్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తర్వాత కేంద్రానికి మద్దతు పలికిన రెండో పార్టీ బీజేడీ. రాజ్యసభలో అధికార పక్షంపై ప్రతిపక్ష పార్టీలదే పైచేయిగా ఉంది. బీజేడీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల నిర్ణయంతో రాజ్యసభలో కేంద్రం తీసుకొచ్చే బిల్లును ఓడించాలన్న ప్రతిపక్షాల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్, బీజేడీలకు చెరో 9 మంది సభ్యుల బలముంది. ఈ రెండు పార్టీల 18 మంది సభ్యుల మద్దతుతో కేంద్రం ప్రవేశపెట్టే బిల్లు రాజ్యసభలో నెగ్గేందుకు అవకాశమేర్పడింది. -
ఢిల్లీ ఆర్డినెన్స్ పిటిషన్ రాజ్యాంగ బెంచ్‌కు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అధికార యంత్రాంగంపై నియంత్రణ తన పరిధిలోకి తీసుకుంటూ కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. అయిదుగురు న్యాయమూర్తులున్న రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించాలంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ మనోజ్ మిశ్రాల డివిజన్ బెంచ్ సిఫారసు చేసింది. ఢిల్లీలో అధికారుల నియమకాలు, బదిలీలను తన అధీనంలోకి తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ కేంద్రం, ఢిల్లీలో కేజ్రివాల్ ప్రభుత్వం మధ్య కొత్త వివాదాన్ని రేపిన విషయం తెలిసిందే. జమ్మూ కశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దుని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన తర్వాత దీనిపై విచారణ చేపడుతుందని సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది. -
సచివాలయ వ్యవస్థకు ‘చట్ట’ భద్రత.. ఆర్డినెన్స్ జారీ
సాక్షి, అమరావతి: గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థకు కొత్తగా చట్టం తీసుకొస్తూ ప్రభుత్వం సోమవారం ఆర్డినెన్స్ జారీ చేసింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే.. 2019 అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలో గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. అప్పట్లో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ నూతన వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చారు. సోమవారం తాజా ఆర్డినెన్స్‌తో.. గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటికే అమలులో ఉన్న ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం, ఆంధ్రప్రదేశ్ మునిసిపాలిటీ, మునిసిపల్ కార్పొరేషన్ చట్టం తరహాలోనే సచివాలయ వ్యవస్థకు కూడా చట్ట రూపం వచ్చింది. రాజ్యాంగంలోని 11, 12 షెడ్యూళ్లలో పేర్కొన్న ప్రకారం ప్రజల కేంద్రంగా ప్రభుత్వ సేవలు, ఇతర సదుపాయాలను అందించేందుకు చట్టం ద్వారా గ్రామ/వార్డు సచివాలయాల పేరుతో వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నట్టు ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు. స్థానిక సంస్థల చట్టాలకు అదనంగా.. రాష్ట్రంలో ప్రస్తుతం అమలులో ఉన్న పంచాయతీరాజ్, మునిసిపల్ చట్టాలకు అదనంగా గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ చట్టం ఉంటుందని ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు. ఈ ఆర్డినెన్స్‌తో గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా అందజేసే ప్రభుత్వ సేవలు, గ్రామ/వార్డు సచివాలయ శాఖ ద్వారా జారీ చేసే ఉత్తర్వులు శాసనాధికారంతో కూడినవిగా ఉంటాయని అందులో పేర్కొన్నారు. గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల నియామకంతో వారి సర్వీస్ అంశాలు కూడా ఆర్డినెన్స్‌లోని నిబంధనలకు అనుగుణంగా చట్టబద్ధత కలిగి ఉంటాయని పేర్కొన్నారు. వచ్చే శాసనసభ సమావేశాల్లో ఈ ఆర్డినెన్స్‌కు చట్టసభల ఆమోదం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. చట్టంతో పూర్తిస్థాయి పటిష్టత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే రాష్ట్రంలో గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటుపై ప్రకటన చేశారు. అనంతరం.. కొత్తగా 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు మంజూరు చేయడమే కాకుండా ఆ వెంటనే ఉద్యోగాల భర్తీ వంటి చర్యలన్నీ కేవలం 4నెలల వ్యవధిలోనే పూర్తయ్యాయి. 2019 అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి రోజున గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థ అధికారికంగా ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి రెండు వేల జనాభాకు, పట్టణ ప్రాంతాల్లో 4 వేల జనాభాకు ఒక సచివాలయం చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు కొలువుదీరాయి. అంతకు ముందు కనీసం ఒక్క శాశ్వత ఉద్యోగి కూడా నియామకం జరగని చాలా గ్రామాల్లో కొత్తగా ఏర్పాటైన గ్రామ సచివాలయాల్లో 10 నుంచి 11 మంది వరకు శాశ్వత ఉద్యోగులను ప్రభుత్వం నియమించింది. వీటిలో 545 రకాల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతి సచివాలయానికి ఇంటర్నెట్తోపాటు కంప్యూటర్లు, ప్రింటర్లసహా ఫర్నిచర్‌ను ప్రభుత్వం అందజేసింది. ఇప్పటివరకు గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా ప్రజలు వారి సొంత ఊరు దాటాల్సిన అవసరం కూడా లేకుండా 5 కోట్లకుపైగా ప్రజలు ప్రభుత్వ సేవలను వినియోగించుకుంటున్నారు. దీనికి మరింత పటిష్టత తెచ్చేందుకు అడ్వకేట్ జనరల్ సూచన మేరకు ప్రభుత్వం ఈ వ్యవస్థకు చట్ట రూపం కూడా తీసుకొస్తూ తాజా ఆర్డినెన్స్ జారీ చేసింది. -
అంత అవసరం ఏమొచ్చింది?
న్యూఢిల్లీ: సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలాన్ని పెంచుతూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్సుల విషయంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఆగమేఘాల మీద ఆర్డినెన్సులను తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందని కేంద్రంపై విరుచుకుపడుతున్నాయి. కొన్ని వ్యవస్థలకు ఉన్న స్వతంత్రతను ఈ ఆర్డినెన్సులతో కేంద్రం పూర్తిగా తుడిచిపెట్టేసిందని విమర్శించాయి. ఆర్డినెన్స్ రాజ్యాన్ని తీసుకొచ్చి, వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి ఆరోపించారు. రెండు వారాల్లో పార్లమెంటు సమావేశాలు పెట్టుకుని వాటిని తీసుకురావడం పార్లమెంటరీ వ్యవస్థను అపహాస్యం చేయడమేనని దుయ్యబట్టారు. పదవీ కాలం పొడిగింపు చాలా తక్కువ కాలం ఉండాలన్న సుప్రీం కోర్టు తీర్పును తప్పించుకునేందుకే కేంద్రం ఈ ఆర్డినెన్సులను తీసుకొచ్చిందని విమర్శించారు. ‘ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టు.. ఎక్స్టెన్షన్ పట్టు’అన్న చందంగా కేంద్రం తీరు ఉందని పేర్కొంది. ఇప్పటివరకు ఈ సంస్థలకు ఎంతో కొంత సమగ్రత ఉందని, ఆర్డినెన్స్ రాజ్యాన్ని తీసుకొచ్చి, వ్యవస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని మండిపడింది. కాగా, కేంద్ర నిరంకుశ పాలనను ప్రతిపక్షాలమంతా కలసి అడ్డకుంటామని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఒ బ్రియెన్ పేర్కొన్నారు. ఆర్డినెన్సులకు వ్యతిరేకంగా టీఎంసీ రాజ్యసభలో నోటీసులు అందించింది. కేంద్రప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు రూల్స్‌కు సంబంధించి ప్రాథమిక నిబంధనల్లో కేంద్రం సవరణలు చేసింది. సర్వీసులో ఉన్న ఉద్యోగులు, రిటైర్మెంట్ అనంతరం విధులకు సంబంధించి అన్ని అంశాలు ఈ నిబంధనల్లో ఉంటాయి. ఈ నిబంధనల ప్రకారం ఏ ప్రభుత్వ ఉద్యోగి సర్వీసును కూడా రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లకు మించి పొడిగించడానికి వీల్లేదు. కాకపోతే కేబినెట్ సెక్రటరీ, బడ్జెట్ సంబంధిత అంశాలు చూసుకునే అధికారులు, ప్రముఖ శాస్త్రవేత్తలు, ఐబీ, ఆర్ఏడబ్ల్యూ చీఫ్‌లు, సీబీఐ డైరెక్టర్లకు మాత్రం మినహాయింపు ఉంటుంది. అయితే తాజాగా చేసిన సవరణల్లో డిఫెన్స్ సెక్రెటరీ, హోం సెక్రెటరీ, ఐబీ డైరెక్టర్, ఆర్ఏడబ్ల్యూ, సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలాన్ని పెంచే అధికారం కేంద్రానికి వచ్చింది. కాగా, సోమవారం విడుదల చేసిన నోటిఫికేషన్లో ప్రాథమిక నిబంధనల జాబితా నుంచి విదేశీ వ్యవహారాల సెక్రటరీని తొలగించి ఈడీ పేరును చేర్చారు. ఆయన పదవీ కాలాన్ని పొడిగించేందుకేనా? ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్డినెన్స్–2021, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆర్డినెన్స్–2021 ప్రకారం సీబీఐ డైరెక్టర్, ఈడీ చీఫ్‌ల పదవీకాలాన్ని ఒకేసారి ఏడాది పాటు పెంచే వీలుంది. ఆ పొడిగింపు ఐదేళ్లకు మించి ఉండొద్దని ఈ రెండు ఆర్డినెన్సులు స్పష్టం చేస్తున్నాయి. కాగా, ఈడీ చీఫ్ ఎస్కే మిశ్రా బుధవారంతో ఆయన పదవీ కాలాన్ని పూర్తి చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం తాజా ఆర్డినెన్సులు తీసుకురావడం చర్చనీయాంశమైంది. రెండేళ్ల పాటు ఈడీ చీఫ్‌గా పనిచేసిన అనంతరం 2020లో ఆయన పదవీ కాలాన్ని కేంద్రం ఏడాది పాటు పెంచింది. -
ఏపీ విద్యా చట్టం 1982ను సవరిస్తూ ఆర్డినెన్స్ జారీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యా చట్టము 1982ను సవరిస్తూ శనివారం న్యాయశాఖ ప్రభుత్వ కార్యదర్శి వి.సునీత ఆర్డినెన్స్ చేశారు. ఏదైనా విద్యాసంస్ధకు ప్రభుత్వ గ్రాంటును నిలుపుదల చేయడం, తగ్గించడం, ఉపసంహరించుకోవచ్చని ఆర్డినెన్స్ ద్వారా వెల్లడించారు. అలాగే నిర్ణయం తీసుకునే ముందు ఆ సంస్ధ మేనేజరుకు ఒక అవకాశం ఇవ్వాలని విచారణ రెండు నెలల్లో పూర్తి చేయాలని ఆర్డినెన్స్ ద్వారా సూచించారు. విచారణ సమయంలో కూడా గ్రాంటును నిలుపుదల చేసే అధికారాన్ని ప్రభుత్వానికి కట్టబెడుతూ గవర్నర్ పేరుతో ఏపీ న్యాయశాఖ ప్రభుత్వ కార్యదర్శి పేర్కొన్నారు. -
లవ్ జిహాద్: ఆర్డినెన్స్ ఆమోదించిన యోగి సర్కార్
లక్నో: దేశవ్యాప్తంగా ‘లవ్ జిహాద్’ గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దీనికి వ్యతిరేకంగా చట్టం చేయాలని భావిస్తోన్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ తరహా వివాహాల్లో బలవంతపు మత మార్పిడిలను గుర్తించేందుకు ఓ ఆర్డినెన్స్‌ని తీసుకువచ్చింది. యూపీ ప్రభుత్వం మంగళవారం సాయంత్రం దీనికి ఆమోదం తెలిపింది. లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా కఠినమైన చట్టం తీసుకోస్తామని కొద్ది రోజుల క్రితం యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నెల రోజుల లోపున ఈ ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలపడం విశేషం. ఉత్తర ప్రదేశ్ చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధ ఆర్డినెన్స్ (2020) ప్రకారం అబద్ధం, బలవంతంగా జరిగే మత మార్పిడులు.. అలానే వివాహ ప్రయోజనం కోసం మాత్రమే జరిగే మత మార్పిడులను నేరంగా ప్రకటిస్తారు. ఈ తరహా కేసుల్లో బెయిల్ కూడా మంజూరు చేయరు. ఒకేవళ ఎవరైనా వివాహాం తర్వాత మతం మారాలని భావిస్తే.. దాని గురించి రెండు నెలల ముందుగానే జిల్లా అధికారికి తెలపాలని పేర్కొంది. "బలవంతంగా మత మార్పిడి జరిగిన 100 కేసులు మన ముందు ఉన్నాయి. అందువల్ల ఒక చట్టాన్ని రూపొందించడం అవసరం. యోగిజీ మంత్రివర్గం ఒక ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. దాని ప్రకారం బలవంతంగా మత మార్పిడి జరిగితే జరిమానాతో పాటు జైలు శిక్ష విధించడం వంటి నియమాలు ఉన్నాయి" అని యూపీ క్యాబినెట్ మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్ తెలిపారు. ఇక ఈ ఆర్డినెన్స్ ప్రకారం, బలవంతపు మత మార్పిడికి పాల్పడితే (మోసం ద్వారా మార్పిడి) ఐదేళ్ల వరకు జైలు శిక్ష లేదా 15,000 రూపాయల జరిమానా విధించబడుతుంది. బలవంతపు మత మార్పిడిలో అట్టడుగు వర్గాలకు చెందిన ఒక మహిళ ఉంటే.. మూడు నుంచి 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 25,000 రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇక సామూహిక మత మార్పిడిలకు పాల్పడితే 3-10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 50,000 రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. (లవ్ జిహాద్ : కోర్టు సంచలన తీర్పు) ఆర్డినెన్స్ ఆమోదించడానికి కొన్ని గంటల ముందు, అలహాబాద్ హైకోర్టు ఈ తరహా కేసులో కీలక వ్యాఖ్యలు చేసింది. మేజర్లయిన ఇద్దరు వ్యక్తులకు వారికి నచ్చినవారితో జీవించే హక్కు ఉంటుందని.. దీనిలో ఎవరి జోక్యం తగదని తెలిపింది. -
ఐదేళ్ల జైలు.. కోటి జరిమానా
న్యూఢిల్లీ: ఢిల్లీ, పరిసర రాష్ట్రాల్లో వాయు కాలుష్యానికి కారణమయ్యే వారికి భారీగా జరిమానా, జైలుశిక్ష విధించేలా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టింది. దీనిప్రకారం కాలుష్య కారకులకు ఏకంగా కోటి రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది. గరిష్టంగా ఐదేళ్ల దాకా జైలు శిక్ష పడే ప్రమాదం కూడా ఉంది. ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి రామ్‌నాథ్ బుధవారం సంతకం చేయడంతో వెంటనే అమల్లోకి వచ్చింది. ఆర్డినెన్స్‌ను కేంద్ర న్యాయ శాఖ గురువారం విడుదల చేసింది. దీని ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీ, హరియాణా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ నిమిత్తం 22 ఏళ్ల క్రితం నాటి ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ అథారిటీ(ఈపీసీఏ)ని రద్దు చేసి, దాని స్థానంలో ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తారు. ఈ కమిషన్‌లో 20 మందికిపైగా సభ్యులు ఉంటారు. ఆర్డినెన్స్ నియమ నిబంధనలను, ప్రత్యేక కమిషన్ ఆదేశాలను ఉల్లంఘిస్తే కోటి రూపాయల జరిమానా లేదా ఐదేళ్ల దాకా జైలు శిక్ష విధించవచ్చు. కమిషన్ చైర్మన్‌ను కేంద్ర పర్యావరణం, అటవీ శాఖ మంత్రి అధ్యక్షతన ఏర్పాటయ్యే కమిటీ ఎంపిక చేస్తుంది. ఈ కమిటీలో రవాణా, వాణిజ్య, సైన్స్ అండ్ టెక్నాలజీ తదితర శాఖల మంత్రులు, కేబినెట్ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. ఢిల్లీకి పొరుగున ఉన్న రాష్ట్రాల్లో ప్రతిఏటా పంట వ్యర్థాలను దహనం చేస్తుంటారు. దీనివల్ల ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. పంట వ్యర్థాల దహనాన్ని, తద్వారా వాయు కాలుష్యాన్ని అరికట్టాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయ్యింది. ఈ వ్యాజ్యంపై న్యాయస్థానం ఇటీవలే విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. కమిషన్ ఏం చేస్తుందంటే.. ►ఏయే ప్రాంతాల్లో గాలి నాణ్యతను ఎంత స్థాయిలో ఉండాలో నిర్ధారించే అధికారం కమిషన్‌కు కట్టబెట్టారు. ►చట్టాన్ని ఉల్లంఘిస్తూ వాయు కాలుష్యానికి కారణమవుతున్న కంపెనీలు/ప్లాంట్లను కమిషన్ తనిఖీ చేస్తుంది. ►అలాంటి కంపెనీలు/ప్లాంట్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేస్తుంది. ►కమిషన్ తనంతట తానుగా(సుమోటో) లేదా ఫిర్యాదుల ఆధారంగా ఆదేశాలు జారీ చేస్తుంది. ►కమిషన్ తన వార్షిక నివేదికలను నేరుగా పార్లమెంట్‌కు సమర్పిస్తుంది. ►కమిషన్ ఆదేశాలను సివిల్ కోర్టుల్లో సవాలు చేసేందుకు వీల్లేదు. జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో సవాలు చేయొచ్చు. -
ఏడేళ్ల జైలు.. 5 లక్షల జరిమానా
న్యూఢిల్లీ: వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిపై దాడులు చేస్తే ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 5 లక్షల వరకు జరిమానా విధించేందుకు వీలు కల్పించే ఆర్డినెన్స్‌కు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యంగా, కోవిడ్–19 పేషెంట్లకు చికిత్స అందిస్తున్న వైద్యులపై, కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు, అనుమానితులను క్వారంటైన్ చేసేందుకు వచ్చిన వైద్య సిబ్బందిపై దేశవ్యాప్తంగా పలుచోట్ల దాడులు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిపై హింసకు, వేధింపులకు పాల్పడితే అది శిక్షార్హమైన, బెయిల్‌కు వీలు లేని నేరంగా పరిగణిస్తామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. కోవిడ్‌పై ముందుండి పోరాడుతున్న వైద్యులు, నర్సులు, ఆశ కార్యకర్తలు, ఇతర పారామెడికల్ సిబ్బందిపై దాడులు చేస్తే తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో సహించబోదన్నారు. ఈ కొత్త చట్టం ప్రకారం.. మామూలు దాడులకు మూడు నెలల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షల వరకు జరిమానా ఉంటుందని, ఒకవేళ దాడి తీవ్రస్థాయిలో జరిగి, బాధిత వైద్య సిబ్బందికి గాయాలు తీవ్రంగా ఉంటే.. ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 5 లక్షల వరకు జరిమానా ఉంటుందని జవదేకర్ వివరించారు. ఆస్తి నష్టం జరిగితే, ఆ ఆస్తి మార్కెట్ విలువకు రెట్టింపు వసూలు చేస్తామన్నారు. కోవిడ్–19కు చికిత్స అందించే లేదా కరోనా వ్యాప్తిని నిర్ధారించే విధుల్లో ఉన్న వైద్యులు, వైద్య సిబ్బంది తమతో పాటు కరోనా వైరస్‌ను తీసుకువస్తున్నారనే అనుమానంతో వారు అద్దెకు ఉంటున్న ఇంటి యజమానులు, స్థానికులు ఆయా వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులు చేసినా, వేధింపులకు పాల్పడినా ఈ చట్టం కింద కఠిన చర్యలుంటాయన్నారు. ఈ ఆర్డినెన్స్ ద్వారా ఎపిడమిక్ డిసీజెస్ చట్టం, 1897కు సవరణలు చేస్తామన్నారు. కరోనా విపత్తు ముగిసిన అనంతరం కూడా ఈ చట్టంలోని నిబంధనలను కొనసాగిస్తారా? అన్న ప్రశ్నకు పూర్తి వివరణ ఇవ్వకుండా.. ‘ఎపిడమిక్ చట్టానికి సవరణ చేసేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్స్ ఇది, అయితే, ఇది మంచి ప్రారంభం’అని మాత్రం వ్యాఖ్యానించారు. కోవిడ్–19పై పోరాడుతున్న వైద్య సిబ్బందికి రూ. 50 లక్షల బీమా కల్పిస్తూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని జవదేకర్ గుర్తు చేశారు. కరోనా పేషెంట్ల కోసం ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1.86 లక్షల బెడ్స్, 24 వేల ఐసీయూ బెడ్స్‌తో 723 కోవిడ్ ఆసుపత్రులను సిద్ధం చేశామన్నారు. రూ. 15 వేల కోట్ల ప్యాకేజీ కరోనాపై పోరుకు అవసరమైన అత్యవసర నిధి కోసం రూ. 15 వేల కోట్లతో ‘ఇండియా కోవిడ్–19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టమ్ ప్రిపేర్డ్నెస్ ప్యాకేజ్’ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రత్యేక చికిత్స కేంద్రాలు, ల్యాబొరేటరీల ఏర్పాటుకు ఈ నిధిని వినియోగిస్తారు. ఈ మొత్తంలో రూ. 7,774 కోట్లను ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఫండ్ కింద వినియోగించాలని, మిగిలిన మొత్తాన్ని ఒకటి నుంచి నాలుగేళ్లలో ఇతర అవసరాల కోసం ఖర్చు చేయాలని నిర్ణయించారు. కోవిడ్‌చికిత్సకు వాడే వైద్య పరికరాలు, ఔషధాలను సమకూర్చుకోవడంతో ఇతర అత్యవసరాల కోసం, ప్రత్యేక లాబొరేటరీలు, పరిశోధనశాలల ఏర్పాటుకూ నిధులు వాడతారు. ప్యాకేజీ కింద అదనంగా, రూ. 3 వేల కోట్లను ప్రస్తుతమున్న వైద్య సదుపాయాలను కోవిడ్ వైద్య కేంద్రాలుగా ఆధునీకరించడం కోసం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటికే అందజేశారు. ‘ల్యాబొరేటరీ నెట్‌వర్క్‌ను విస్తరించాం. రోజువారీ పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచాం. 13 లక్షల టెస్టింగ్ కిట్స్ కోసం ఆర్డర్ పెట్టాం’ అని ఆరోగ్య శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. భద్రతలో రాజీలేదు: మోదీ కరోనాపై పోరాడుతున్న వైద్యులు, ఇతర సిబ్బందికి భద్రత కల్పించడంలో రాజీపడే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. ఆ విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని తాజాగా తీసుకువచ్చిన ఆర్డినెన్స్ స్పష్టం చేస్తుందన్నారు. ప్రతీ ఆరోగ్య కార్యకర్తకు రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ట్వీట్ చేశారు. -
గోల్డ్ స్కీమ్స్‌తో జాగ్రత్త!
బంగారు వర్తకులు ఆఫర్ చేసే బంగారం పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా...? ఏడాది పాటు పొదుపు చేయడం వల్ల ఒక నెల మొత్తం బోనస్‌గా లభించడం, ఎటువంటి తరుగు లేకుండా నగలు కొనుగోలుకు అవకాశం కల్పించే ఆఫర్లు ఆకర్షిస్తున్నాయా..? కానీ, జ్యుయలర్స్ ఆఫర్ చేసే సేవింగ్స్ పథకాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలన్నది నిపుణుల సూచన. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో అనుమతి లేని డిపాజిట్ పథకాలను నిషేధిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. వాస్తవానికి అనుమతి లేని అన్ని పథకాలకు ఇది వర్తిస్తుందని భావించారు. జ్యుయలరీ సంస్థల పథకాలకు కూడా బ్రేక్ పడుతుందనుకున్నప్పటికీ... అవి మాత్రం ఇంతకుముందు మాదిరే నిధులను సమీకరిస్తూనే ఉన్నాయి. కాకపోతే చట్టంలో ఉన్న చిన్న వెసులుబాటును అనుకూలంగా మలచుకుని జ్యూయలరీ సంస్థలు తమ పొదుపు పథకాలను కేవలం పదకొండు నెలల కాలానికే పరిమితం చేస్తున్నాయి. చట్టానికి అతీతంగా జ్యుయలరీ సంస్థలు వ్యవహరించడం ఇదే మొదటిసారి కాదు. కంపెనీల చట్టం 2014... బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు మినహా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించే ఇతర సంస్థలకు షరతులు విధించింది. 365 రోజులకు మించిన కాలానికి డిపాజిట్లు తీసుకునే రిజిస్టర్డ్ సంస్థలు అన్నీ కూడా కచ్చితంగా తిరిగి చెల్లించే సామర్థ్యంపై రేటింగ్ తీసుకోవడంతోపాటు, డిపాజిట్ ఇన్సూరెన్స్‌ను కూడా తీసుకోవాలి. పైగా డిపాజిట్‌పై వడ్డీని ఎన్‌బీఎఫ్‌సీల కంటే ఎక్కువ ఆఫర్ చేయరాదు. కానీ, జ్యుయలరీ సంస్థలు మాత్రం గతంలో 12, 24, 36 నెలల పథకాలను నిర్వహించగా, చట్టంలోని నిబంధనలు కఠినతరం కావడంతో తమ పథకాల కాల వ్యవధిని 11 నెలలకు కుదించుకున్నాయి. సంస్థ బిచాణా ఎత్తేస్తే? ఆభరణాల సంస్థలు వినియోగదారులను మోసం చేసిన ఘటనలు కూడా లేకపోలేదు. ఇందుకు నిదర్శనం తమిళనాడుకు చెందిన నాదెళ్ల సంపత్ జ్యుయలరీ సంస్థ వ్యవహారమే. తమిళనాడులో బంగారు ఆభరణాల మార్కెట్లో మంచి పేరున్న సంస్థ. 75 ఏళ్లకు పైగా కార్యకలాపాల్లో ఉన్న సంస్థ. కానీ 2017 అక్టోబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఆభరణాల దుకాణాలను ఆర్థిక సమస్యల కారణంగా ఈ సంస్థ మూసేసింది. ఖాతాల్లో అవకతవకలు, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టడం వెలుగు చూశాయి. నాదెళ్ల బంగారు పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేసిన వారు ఉసూరుమనక తప్పలేదు. కంపెనీ 2018 మే నెలలో దివాలా పిటిషన్ వేసింది. ఈ తరహా పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేసే వారికి ఈ సంఘటన ఓ హెచ్చరిక వంటిది. బంగారు ఆభరణాల సంస్థ దివాలా పిటిషన్ దాఖలు చేస్తే, ఆస్తులను విక్రయించగా వచ్చిన మొత్తం నుంచి ఖర్చులు పోను, ఉద్యోగులకు వేతన బకాయిలు చెల్లిస్తారు. మిగిలి ఉంటే సెక్యూర్డ్ రుణదాతలకు చెల్లింపులు చేస్తారు. ఆ తర్వాత అన్సెక్యూర్డ్ రుణదాతల వంతు వస్తుంది. బంగారం పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేసే వారు అన్సెక్యూర్డ్ ఆపరేషనల్ క్రెడిటర్ల కిందకు వస్తారని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. కనుక కస్టమర్ల వంతు ఆఖరు అవుతుంది. లొసుగులు.. అనుమతి లేని డిపాజిట్ పథకాల నిషేధ ఆర్డినెన్స్... డిపాజిట్‌కు నిర్వచనం ఇచ్చింది. అడ్వాన్స్ రూపంలో తీసుకోవడం లేదా రుణం, తిరిగి నగదు లేదా సేవ రూపంలో ఇస్తానన్న హామీతో తీసుకునే మొత్తాన్ని డిపాజిట్‌గా పేర్కొంది. ఎవరు డిపాజిట్ తీసుకున్నారన్నది ఇక్కడ అంశం కాదు. వ్యక్తి లేదా యాజమాన్య సంస్థ, భాగస్వామ్య సంస్థ, కోపరేటివ్ సొసైటీ లేదా ట్రస్ట్ అయినా కావచ్చు. కనుక జ్యుయలర్స్ నిర్వహించే పథకాలు ఈ చట్టం పరిధిలోకే వస్తాయంటున్నారు కొందరు. అయితే, కొన్ని మినహాయింపులు ఉన్నాయి. బంధువుల నుంచి రుణాల రూపంలో తీసుకోవడం, వ్యాపార సరుకుల సరఫరా కోసం అడ్వాన్స్ రూపంలో తీసుకోవడానికి డిపాజిట్ నిర్వచనం నుంచి మినహాయింపు ఉంది. భవిష్యత్తులో ఆభరణాల కొనుగోలు సాధనాలుగా తాము బంగారం పొదుపు పథకాలను విక్రయిస్తున్నట్టు జ్యుయలరీ వర్తకులు సమర్థించుకుంటున్నారు. కనుక దీన్ని ముందస్తు వాణిజ్యంగా చూడాలని పేర్కొంటున్నాయి. డిపాజిట్లు కాదు... ‘‘జ్యుయలర్ల పొదుపు పథకాలకు సంబంధించి ఆర్డినెన్స్ తీసుకురాలేదు. జ్యుయలర్స్ సమీకరించే నిధులు కేవలం ముందస్తు వాణిజ్య రూపంలోనే. దీన్ని డిపాజిట్‌గా చూడరాదు. ఈ పథకాల కింద కస్టమర్లకు తగ్గింపులు, బహుమానాలు ఆఫర్ చేయవచ్చా, స్పష్టం చేయాలని కోరుతూ కేంద్ర వాణిజ్య శాఖకు లేఖ రాశాం’’ అని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ అనంత పద్మనాభన్ తెలిపారు. నిపుణుల అభిప్రాయాలు వేరు అయితే, బంగారం డిపాజిట్ పథకాలు అనుమతి లేని డిపాజిట్ పథకాల నిషేధ ఆర్డినెన్స్ పరిధిలోకి వస్తాయా అన్న దానిపై అస్పష్టత నెలకొందని పలువురు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ముందస్తు వాణిజ్యం పేరుతో తప్పించుకోవడం కుదరదని మరో నిపుణుడు పేర్కొన్నారు. ‘‘ఓ కస్టమర్ కొన్ని నెలల పాటు నగదు ఉంచి, చివర్లో ఏది కొనుగోలు చేయాలన్నది నిర్ణయించుకోవచ్చు. లేదా ఆ డబ్బులను వెనక్కి తీసుకోవచ్చు. అన్ని నెలల పాటు అతడు చెల్లించినది డిపాజిట్‌కు భిన్నమేమీ కాదు. వస్తువులకు ముందస్తుగా చెల్లించడం అంటే... మా అభిప్రాయం ప్రకారం ఆ సరుకులు ఏంటన్నది ముందే గుర్తించాల్సి ఉంటుంది. ఏదన్నది గుర్తించకుండా ముందుగానే అడ్వాన్స్‌గా ఎవరూ చెల్లించరు. కనుక ఈ తరహా పథకాలను నిషేధించాలి’’ అని వినోద్ కొతారి అండ్ కంపెనీ సీనియర్ అసోసియేట్ సీఎస్ శిఖా బన్సాల్ అభిప్రాయపడ్డారు. ఎవరి నియంత్రణ? బ్యాంకు లేదా ఎన్బీఎఫ్సీ లేదా కంపెనీల చట్టం కింద నమోదైన ఓ కంపెనీ, మ్యూచువల్ ఫండ్ పథకాల్లో డిపాజిట్ చేసి చేతులు కాల్చుకుంటే... సంబంధిత నియంత్రణ సంస్థలు ఆర్బీఐ, కార్పొరేట్ శాఖ, సెబీ ఫిర్యాదుల పరిష్కార బాధ్యత చూస్తాయి. బంగారం పొదుపు పథకాల విషయానికొస్తే వీటిని నియంత్రించే సంస్థ లేదు. చాలా వరకు ఈ జ్యుయలరీ సంస్థలు కంపెనీలుగా రిజిస్టర్డ్ అయినవి కావు. కనుక కార్పొరేట్ వ్యవహారాల శాఖ జోక్యం చేసుకోదు. ఈ తరహా అనియంత్రిత డిపాజిట్ పథకాలకు సంబంధించి సమస్య ఎదురైతే పోలీసులకు ఫిర్యాదు చేయడం తప్ప పరిష్కారం లేదు. కనుక పరిష్కారానికి సమయం తీసుకుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. -
సీఐసీలోకి నలుగురు కొత్త కమిషనర్లు
న్యూఢిల్లీ: కేంద్ర సమాచార కమిషన్‌లో నలుగురు కొత్త కమిషనర్లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. కమిషన్‌లో మొత్తం ఉండాల్సిన కమిషనర్ల సంఖ్య 11 కాగా, ప్రస్తుతం అందులో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్(సీఐసీ) సహా ముగ్గురు కమిషనర్లు మాత్రమే ఉన్నారు. తాజాగా మాజీ ఐఎఫ్ఎస్(ఇండియన్ ఫారిన్ సర్వీస్) అధికారి యశ్వర్ధన్ కుమార్ సిన్హా, మాజీ ఐఆర్ఎస్ అధికారి వనజ ఎన్ సర్నా, మాజీ ఐఏఎస్ అధికారి నీరజ్ కుమార్ గుప్తా, న్యాయ శాఖ మాజీ కార్యదర్శి సురేశ్ చంద్ర సమాచార కమిషనర్లుగా నియమితులయ్యారు. వీరి నియామకంతో కమిషన్‌లో సభ్యుల సంఖ్య ఏడుకు చేరింది. సిన్హా 1981 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి. యూకేలో భారత హైకమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. తాజా నియామకంతో వనజ(1980 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారిణి) సీఐసీలోని ఏకైక మహిళా కమిషనర్‌గా నిలవనున్నారు. గుప్తా 1982 ఐఏఎస్ అధికారి కాగా, సురేశ్ చంద్ర ఈ ఏడాదే న్యాయశాఖ కార్యదర్శిగా రిటైర్ అయ్యారు. 2002–04 మధ్య ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి ప్రైవేట్ సెక్రటరీగా కూడా చంద్ర ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగాలు చేసినవారు(బ్యూరొక్రాట్స్) కాకుండా.. లా, సైన్స్, సోషల్ సర్వీస్, మేనేజ్మెంట్, జర్నలిజం తదితర రంగాల్లోని నిపుణులకు(నాన్ బ్యూరొక్రాట్స్) కమిషనర్లుగా సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 12(5)ని ఉటంకిస్తూ మాజీ కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు విజ్ఞప్తిని తాజా నియామకాల్లో కేంద్రం పట్టించుకోలేదు. -
తొమ్మిదో షెడ్యూల్లోకి ఎస్సీ, ఎస్టీ చట్టం!
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టానికి రాజ్యాంగరక్షణ కల్పిస్తూ దీనిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేసేలా చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఈ చట్టాన్ని రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడం ద్వారా న్యాయస్థానాల సమీక్షకు వీలు లేకుండా చేయాలని భావిస్తోంది. అయితే, దీనికి ముందుగా ఒక ఆర్డినెన్స్ కూడా జారీ చేయనుంది. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద సత్వర అరెస్టులను నిరోధిస్తూ మార్చిలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో దేశ వ్యాప్తంగా నిరసనలు పెల్లుబికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వచ్చే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ,ఎస్టీ చట్టాన్ని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలనే అంశంపై బిల్లు ప్రవేశపెట్టనుంది. తొమ్మిదో షెడ్యూల్లోని అంశాలపై సుప్రీంకోర్టు సహా న్యాయస్థానాలు జోక్యం చేసుకునేందుకు వీలుండదు. దీనికంటే ముందుగా ఆర్డినెన్స్ తేనుందని సమాచారం. తీర్పును సమీక్షించాలన్న ప్రభుత్వ పిటిషన్ ఈ నెల 16వ తేదీన విచారణకు రానుంది. సుప్రీం తీర్పు మేరకు తదుపరి చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. -
పోక్సో చట్ట సవరణపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా, ఉన్నావ్ ఘటనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పోక్సో(లైంగిక అత్యాచార ఘటనల నుంచి పిల్లలను సంరక్షించే చట్టం) చట్టానికి సవరణ చేసిన విషయం తెలిసిందే. ఈ సవరణలకు ఆమోదం తెలుపుతూ రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా వేశారు. ఈ ఆర్డినెన్స్ ప్రకారం 12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడే రేపిస్టులకు గరిష్టంగా మరణశిక్ష విధిస్తారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పోక్సో చట్టానికి సవరణలు చేసే ముందు కేంద్రం పూర్వాపరాలను పరిగణలోకి తీసుకోలేదని.. ఎటువంటి పరిశోధన జరపకుండానే హడావిడిగా ఆర్డినెన్స్ జారీ చేసిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలను చల్లార్చేందుకు మాత్రమే కేంద్రం పోక్సో చట్టానికి సవరణలు చేసినట్టుగా ఉందంటూ ఢిల్లీ హైకోర్టు బెంచ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. కాగా ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు లేనందున కేంద్రం ప్రతిపాదించిన పలు ఆర్డినెన్స్‌లపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం ఆమోద ముద్ర వేశారు. అత్యాచార దోషులకు కఠిన శిక్షలతోపాటు, రుణ ఎగవేత దారుల ఆస్తుల జప్తు, శిక్షల విధింపునకు సంబంధించిన ఆర్డినెన్స్‌లను అత్యవసరమైనవిగా భావించి రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్లు గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి రానున్నాయి. -
ఏపీ కొత్త డీజీపీగా మాలకొండయ్య!
అమారావతి: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా ఎం.మాలకొండయ్య నియామకం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈయన నియామకంపై గురువారం ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వమే డీజీపీని ఎంపిక చేసుకునే అధికారం కల్పిస్తూ ఏపీ పోలీస్ యాక్టును సవరిస్తూ మంగళవారం ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మాలకొండయ్య 1985 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన గుంటూరు జిల్లా ఎస్పీగా, డీఐజీగా కీలక పదవులు నిర్వహించారు. ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం డీజీపీగా ఉన్న సాంబశివరావు ఈనెల 31న పదవీ విరమణ చేయనున్నారు. -
ఆ 82 గ్రామాలు మనకే
ఖమ్మం జిల్లా నుంచి ‘పశ్చిమ’లో విలీనం ముంపుగ్రామాల ఆర్డినెన్స్ జారీ పెరగనున్న జిల్లా విస్తీర్ణం.. జనాభా ఏలూరు సిటీ, న్యూస్‌లైన్ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కమ్ముకున్న నీలినీడలు తొలగిపోనున్నా యి. ప్రాజెక్టు నిర్మాణం కారణంగా ఖమ్మం జిల్లా పరిధిలో ముంపుబారిన పడనున్న 205 గ్రామా ల్లో 82 గ్రామాలను మన జిల్లాలో విలీనం చేస్తూ ఆర్డినెన్స్ జారీ అయ్యింది. మిగిలిన గ్రామాలు తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి వెళతాయి. అయితే, గోదావరి పరీవాహక ప్రాంత పరిధిలోని ఖమ్మం జిల్లానుంచి పూర్తిస్థాయిలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉభయగోదావరి జిల్లాల్లో కలుస్తాయనే అంశంపై ఆర్డినెన్స్‌లో పొందుపరిచిన విషయూలేమిటనే దానిపై ఇంకా స్పష్టత లేదని ఇరిగేషన్ అధికారులు పేర్కొంటున్నారు. మన జిల్లాకు 3మండలాలు.. 82 గ్రామాలు ఖమ్మం జిల్లా పాల్వంచ రెవెన్యూ డివిజన్ పరిధిలోని కుకునూరు, వేలేరుపాడు, బూర్గంపహాడ్ మండలాల్లోని సుమారు 82 ముంపు గ్రామాలను మన జిల్లాలో విలీనం చేస్తారని అధికారులు చెబుతున్నారు. కుకునూరు మండలంలోని 34 గ్రామా లు, వేలేరుపాడు మండలంలోని 39 గ్రామాలు, బూర్గంపహాడ్ మండలంలోని 9 ముంపు గ్రామా లు మన జిల్లా పరిధిలోకి వస్తాయని పేర్కొంటున్నారు. వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఖమ్మం జిల్లాలో ఎన్ని మండలాలు, ఎన్ని గ్రామాలు ముంపుబారిన పడతాయనే అంశంపై ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయిలో స్పష్టత ఇవ్వలేదని తెలుస్తోంది. ఆయా మండలాలు, గ్రామ పంచాయతీలో కొంత ప్రాంతాన్ని మాత్రమే వేరు చేసేందుకు రెవెన్యూ అధికారులు ససేమిరా అనటం.. రికార్డులు వేరు చేయటం తలకు మించిన భారం అవుతుందనే కారణాలతో పంచాయతీల వారీగా విలీనం చేయాలంటూ రెవెన్యూ అధికారులు నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో పూర్తిస్థాయిలో ఏఏ గ్రామాలు, పంచాయతీలు విలీనం అవుతాయనే విషయమై ఆర్డినెన్స్‌లో ఏమైనా మార్పులు చేశారా అనే దానిపై స్పష్టత లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. పెరగనున్న జనాభా ఖమ్మం జిల్లా పరిధిలోని ముంపు గ్రామాలు మన జిల్లాలో విలీనం కానుండటంతో జిల్లా విస్తీర్ణంతో పాటు జనాభా సైతం పెరగనుంది. ఐటీడీఏ పరిధిలో గిరిజన జనాభా కూడా భారీగా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. చిన్న ఐటీడీఏ కాస్తా భారీగా మారనుంది. ‘పశ్చిమ’ ఏజెన్సీలోని మూడు మండలాల్లో 1.24 లక్షల జనాభా ఉండగా, వారిలో 60 వేలకు పైగా గిరిజనులే. ముంపు గ్రామాల విలీనం నేపథ్యంలో మరో 70వేల జనాభా అదనంగా జిల్లాలో చేరనుంది. కుకునూరు మండలం నుంచి 35వేల మంది, వేలేరుపాడు మండలం నుంచి 25వేల మంది, బూర్గంపహాడ్ నుంచి 10వేలకు పైగా జనాభా అదనంగా ఐటీడీఏ పరిధిలో చేరే అవకాశం ఉంది.