
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా, ఉన్నావ్ ఘటనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పోక్సో(లైంగిక అత్యాచార ఘటనల నుంచి పిల్లలను సంరక్షించే చట్టం) చట్టానికి సవరణ చేసిన విషయం తెలిసిందే. ఈ సవరణలకు ఆమోదం తెలుపుతూ రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా వేశారు. ఈ ఆర్డినెన్స్ ప్రకారం 12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడే రేపిస్టులకు గరిష్టంగా మరణశిక్ష విధిస్తారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పోక్సో చట్టానికి సవరణలు చేసే ముందు కేంద్రం పూర్వాపరాలను పరిగణలోకి తీసుకోలేదని.. ఎటువంటి పరిశోధన జరపకుండానే హడావిడిగా ఆర్డినెన్స్ జారీ చేసిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలను చల్లార్చేందుకు మాత్రమే కేంద్రం పోక్సో చట్టానికి సవరణలు చేసినట్టుగా ఉందంటూ ఢిల్లీ హైకోర్టు బెంచ్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
కాగా ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు లేనందున కేంద్రం ప్రతిపాదించిన పలు ఆర్డినెన్స్‌లపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం ఆమోద ముద్ర వేశారు. అత్యాచార దోషులకు కఠిన శిక్షలతోపాటు, రుణ ఎగవేత దారుల ఆస్తుల జప్తు, శిక్షల విధింపునకు సంబంధించిన ఆర్డినెన్స్‌లను అత్యవసరమైనవిగా భావించి రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్లు గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి రానున్నాయి.