న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘కథువా అత్యాచార’ ఘటనకు సంబంధించి సోషల్ మీడియా సంస్థలకు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. ఈ కేసులో గూగుల్, ఫేస్‌బుక్, ట్విటర్, యూట్యూబ్ సంస్థలకూ నోటిసులు జారీ చేసింది. వివరాల ప్రకారం...‘కథువా అత్యాచార’ ఘటనలో బాధితురాలి వివరాలను వెల్లడి చేసినందుకు గాను వివరణ ఇవ్వాల్సిందిగా గూగుల్, ఫేస్‌బుక్, యూట్యూబ్, ట్విటర్ సంస్థలకు అంతకముందు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాలకు సమాధానం చెప్పే అధికారం తమకు లేదంటూ ఆయా కంపెనీల భారతీయ అనుబంద సంస్థలు తెలిపాయి. దాంతో కోర్టు ఈ సంస్థలకు నోటీసులు జారీ చేసింది.
మీడియా సంస్థలు అత్యాచార బాధితురాలి వివరాలు వెల్లడి చేయడాన్ని వ్యతిరేకిస్తూ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) దాఖలు చేసిన పిటీషన్ విచారించడానికి ఢిల్లీ హైకోర్టు ఒక బెంచ్‌ను ఏర్పాటు చేసింది. ఈ పిటిషన్‌ను పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు బెంచ్ గూగుల్‌తో పాటు ఇతర ఇంటర్నెట్ ప్లాట్‌ఫామ్‌లు, సోషల్ మీడియా సైట్లు మైనర్ అత్యాచార బాధితురాలి వివరాలను బహిర్గతం చేసాయని తెలిపింది. కానీ ఇటువంటి పనులు చేయడానికి సదరు కంపెనీలకే కాక ఎవరికి ఎటువంటి హక్కు లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో కోర్టు గత నెల 12 మీడియా సంస్థలకు, ఒక్కొక్క సంస్థకు రూ.10 లక్షల జరిమానా విధించింది. ఇలా బాధితురాలి వివరాలను వెల్లడించడం వల్ల ఆ కుటుంబానికే కాక సమాజంలోని మహిళలపై కూడా దీర్ఘకాలంలో ఈ అంశాలు ప్రభావం చూపుతాయని తెలిపింది. చట్టాన్ని అతిక్రమించినందుకు గాను సదరు కంపెనీలు ఐపీసీ సెక్షన్ 228 - ఏ కింద శిక్షార్హులని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment