న్యూఢిల్లీ: సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలాన్ని పెంచుతూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్సుల విషయంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఆగమేఘాల మీద ఆర్డినెన్సులను తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందని కేంద్రంపై విరుచుకుపడుతున్నాయి. కొన్ని వ్యవస్థలకు ఉన్న స్వతంత్రతను ఈ ఆర్డినెన్సులతో కేంద్రం పూర్తిగా తుడిచిపెట్టేసిందని విమర్శించాయి.
ఆర్డినెన్స్ రాజ్యాన్ని తీసుకొచ్చి, వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి ఆరోపించారు. రెండు వారాల్లో పార్లమెంటు సమావేశాలు పెట్టుకుని వాటిని తీసుకురావడం పార్లమెంటరీ వ్యవస్థను అపహాస్యం చేయడమేనని దుయ్యబట్టారు. పదవీ కాలం పొడిగింపు చాలా తక్కువ కాలం ఉండాలన్న సుప్రీం కోర్టు తీర్పును తప్పించుకునేందుకే కేంద్రం ఈ ఆర్డినెన్సులను తీసుకొచ్చిందని విమర్శించారు. ‘ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టు.. ఎక్స్‌టెన్షన్ పట్టు’అన్న చందంగా కేంద్రం తీరు ఉందని పేర్కొంది.
ఇప్పటివరకు ఈ సంస్థలకు ఎంతో కొంత సమగ్రత ఉందని, ఆర్డినెన్స్ రాజ్యాన్ని తీసుకొచ్చి, వ్యవస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని మండిపడింది. కాగా, కేంద్ర నిరంకుశ పాలనను ప్రతిపక్షాలమంతా కలసి అడ్డకుంటామని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఒ బ్రియెన్ పేర్కొన్నారు. ఆర్డినెన్సులకు వ్యతిరేకంగా టీఎంసీ రాజ్యసభలో నోటీసులు అందించింది. కేంద్రప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు రూల్స్‌కు సంబంధించి ప్రాథమిక నిబంధనల్లో కేంద్రం సవరణలు చేసింది. సర్వీసులో ఉన్న ఉద్యోగులు, రిటైర్‌మెంట్ అనంతరం విధులకు సంబంధించి అన్ని అంశాలు ఈ నిబంధనల్లో ఉంటాయి.
ఈ నిబంధనల ప్రకారం ఏ ప్రభుత్వ ఉద్యోగి సర్వీసును కూడా రిటైర్‌మెంట్ వయసు 60 ఏళ్లకు మించి పొడిగించడానికి వీల్లేదు. కాకపోతే కేబినెట్ సెక్రటరీ, బడ్జెట్ సంబంధిత అంశాలు చూసుకునే అధికారులు, ప్రముఖ శాస్త్రవేత్తలు, ఐబీ, ఆర్‌ఏడబ్ల్యూ చీఫ్‌లు, సీబీఐ డైరెక్టర్లకు మాత్రం మినహాయింపు ఉంటుంది. అయితే తాజాగా చేసిన సవరణల్లో డిఫెన్స్ సెక్రెటరీ, హోం సెక్రెటరీ, ఐబీ డైరెక్టర్, ఆర్‌ఏడబ్ల్యూ, సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలాన్ని పెంచే అధికారం కేంద్రానికి వచ్చింది. కాగా, సోమవారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ప్రాథమిక నిబంధనల జాబితా నుంచి విదేశీ వ్యవహారాల సెక్రటరీని తొలగించి ఈడీ పేరును చేర్చారు.
ఆయన పదవీ కాలాన్ని పొడిగించేందుకేనా?
ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఆర్డినెన్స్–2021, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆర్డినెన్స్–2021 ప్రకారం సీబీఐ డైరెక్టర్, ఈడీ చీఫ్‌ల పదవీకాలాన్ని ఒకేసారి ఏడాది పాటు పెంచే వీలుంది. ఆ పొడిగింపు ఐదేళ్లకు మించి ఉండొద్దని ఈ రెండు ఆర్డినెన్సులు స్పష్టం చేస్తున్నాయి. కాగా, ఈడీ చీఫ్ ఎస్‌కే మిశ్రా బుధవారంతో ఆయన పదవీ కాలాన్ని పూర్తి చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం తాజా ఆర్డినెన్సులు తీసుకురావడం చర్చనీయాంశమైంది. రెండేళ్ల పాటు ఈడీ చీఫ్‌గా పనిచేసిన అనంతరం 2020లో ఆయన పదవీ కాలాన్ని కేంద్రం ఏడాది పాటు పెంచింది.
Comments
Please login to add a commentAdd a comment