Rahul Gandhi: రాజ్యాంగ సంస్థలు మోదీ సొత్తు కాదు Lok sabha elections 2024: Constitutional institutions not personal property of PM Narendra Modi | Sakshi
Sakshi News home page

Rahul Gandhi: రాజ్యాంగ సంస్థలు మోదీ సొత్తు కాదు

Published Tue, Apr 16 2024 5:07 AM

Lok sabha elections 2024: Constitutional institutions not personal property of PM Narendra Modi - Sakshi

వయనాడ్‌ ప్రచార సభలో రాహుల్‌ విమర్శ

వయనాడ్‌/నీలగిరి: సీబీఐ, ఈడీ మొదలుకుని కేంద్ర ఎన్నికల సంఘం దాకా ప్రతి రాజ్యాంగబద్ద సంస్థల్లోకి తమ వారిని జొప్పిస్తూ ప్రధాని మోదీ వాటిని తన సొంత ఆస్తులుగా భావిస్తున్నారని కాంగ్రెస్‌ నేత రాహల్‌ గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. కేరళలోని సొంత ఎంపీ నియోజకవర్గం వయనాడ్‌లో ప్రచారంలో భాగంగా సోమవారం వల్లిమండలో రోడ్‌షో నిర్వహించి అక్కడి పార్టీ కార్యకర్తలు, ఓటర్లనుద్దేశించి రాహుల్‌ ప్రసంగించారు.

‘‘ రాజ్యాంగబద్ధ సంస్థలన్నింటనీ బీజేపీ హస్తగతం చేసుకుంటున్న తీరు మీకందరికీ అర్థమయ్యే ఉంటుంది. న్యాయవ్యవస్థ, ఎలక్షన్‌ కమిషన్, సీబీఐ, ఈడీ, ఆదాయ పన్ను శాఖ ఇలా ప్రతి రాజ్యాంగబద్ధ విభాగంలోనూ తమ అస్మదీయులను జొప్పించడంలో ఆర్‌ఎస్‌ఎ‹స్, బీజేపీ బిజీగా ఉన్నాయి. అవే రాజ్యాంగబద్ధ సంస్థల పరిరక్షణ కోసం విపక్షాల ‘ఇండియా’ కూటమి పాటుపడుతోంది. ఇవి ఎవరి సొంత సంస్థలుకావు. ప్రధాని మోదీ వ్యక్తిగత ఆస్తులు అస్సలు కావు. ఇవి ప్రతి ఒక్క భారతీయ పౌరుడివి.

రాజ్యాంగాన్ని సవరించబోతున్నట్లు ఒక బీజేపీ ఎంపీ ఇటీవలే ప్రకటించారు. రాజ్యాంగాన్ని మార్చే అవకాశం ఆర్‌ఎస్‌ఎస్‌కు కాంగ్రెస్‌ పార్టీ ఇవ్వదు. రాజ్యాంగాన్ని తమకు నచి్చనట్లు మార్చేసి జాతి సమున్నత ఆశయాలను సమాధిచేయాలని చూస్తున్నారు’ అని ఆరోపించారు. ‘‘ కేరళను నాగ్‌పూర్‌(ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధానకేంద్రం) పాలించకూడదు. సొంత పట్టణాలు, పల్లెల నుంచే పరిపాలన సాగాలి. కేరళ ప్రజలకు ఏం కావాలో, వాళ్లేం ఆశిస్తున్నారో ఢిల్లీ(మోదీ సర్కార్‌)కి ఎలా తెలుస్తుంది?’’ అని ప్రశ్నించారు.

‘‘ఎంతోకాలంగా డిమాండ్‌చేస్తున్నా సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌ సర్కార్‌ వయనాడ్‌ జిల్లాలో ఇంతవరకు ఒక్క వైద్యకళాశాలను ఏర్పాటుచేయలేదు. యూడీఎఫ్‌ ప్రభుత్వం వస్తేగానీ కాలేజీ రాదేమో’’ అని విమర్శించారు. ‘ఇంతటి అందమైన ప్రదేశం వయనాడ్‌లో ఓ వారం పది రోజులు గడపమని మా అమ్మ(సోనియా)కు చెప్పా. ఆమెకు అతి ఉక్కబోత పడదు. భువిపైనే అందమైన ప్రదేశాన్ని మిస్‌ అవుతున్నావని గుర్తుచేశా’’ అని రాహుల్‌ అన్నారు.

రాహుల్‌ హెలికాప్టర్‌లో తనిఖీలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులోని నీలగిరి ప్రాంతానికి రాహుల్‌ వచ్చినపుడు ఆయన ప్రయాణించిన హెలీకాప్టర్‌లో ఎన్నికల అధికారులు తనిఖీలు చేపట్టారు. ఫ్లైయింగ్‌ స్వా్కడ్‌ తనిఖీల్లో ఎలాంటి చట్టవ్యతిరేక వస్తువులు లభించలేదు. 

Advertisement
 
Advertisement
 
Advertisement