న్యూఢిల్లీ: ఢిల్లీ సర్వీసెస్ ఆర్డినెన్స్ స్థానంలో కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బిల్లుకు ఒడిశా అధికార పక్షం బిజూ జనతా దళ్(బీజేడీ) మద్దతివ్వనుంది. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి సైతం వ్యతిరేకంగా ఓటేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బీజేడీ నిర్ణయాన్ని మంగళవారం రాజ్యసభలో ఆ పార్టీ నేత సస్మిత్ పాత్ర ప్రకటించారు. బీజేడీ నిర్ణయం ఢిల్లీ ఆర్డినెన్స్ విషయంలో పార్లమెంట్‌లో ముఖ్యంగా రాజ్యసభలో కేంద్రానికి పెద్ద ఊరటనివ్వనుంది.
బీజేపీ కూటమితోగానీ ప్రతిపక్షాలతోగానీ జట్టుకట్టకుండా ఢిల్లీ ఆర్డినెన్స్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తర్వాత కేంద్రానికి మద్దతు పలికిన రెండో పార్టీ బీజేడీ. రాజ్యసభలో అధికార పక్షంపై ప్రతిపక్ష పార్టీలదే పైచేయిగా ఉంది. బీజేడీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల నిర్ణయంతో రాజ్యసభలో కేంద్రం తీసుకొచ్చే బిల్లును ఓడించాలన్న ప్రతిపక్షాల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్, బీజేడీలకు చెరో 9 మంది సభ్యుల బలముంది. ఈ రెండు పార్టీల 18 మంది సభ్యుల మద్దతుతో కేంద్రం ప్రవేశపెట్టే బిల్లు రాజ్యసభలో నెగ్గేందుకు అవకాశమేర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment