న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టానికి రాజ్యాంగరక్షణ కల్పిస్తూ దీనిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేసేలా చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఈ చట్టాన్ని రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చడం ద్వారా న్యాయస్థానాల సమీక్షకు వీలు లేకుండా చేయాలని భావిస్తోంది. అయితే, దీనికి ముందుగా ఒక ఆర్డినెన్స్ కూడా జారీ చేయనుంది. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద సత్వర అరెస్టులను నిరోధిస్తూ మార్చిలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో దేశ వ్యాప్తంగా నిరసనలు పెల్లుబికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వచ్చే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ,ఎస్టీ చట్టాన్ని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలనే అంశంపై బిల్లు ప్రవేశపెట్టనుంది. తొమ్మిదో షెడ్యూల్‌లోని అంశాలపై సుప్రీంకోర్టు సహా న్యాయస్థానాలు జోక్యం చేసుకునేందుకు వీలుండదు. దీనికంటే ముందుగా ఆర్డినెన్స్ తేనుందని సమాచారం. తీర్పును సమీక్షించాలన్న ప్రభుత్వ పిటిషన్ ఈ నెల 16వ తేదీన విచారణకు రానుంది. సుప్రీం తీర్పు మేరకు తదుపరి చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment