Ordinance Providing Statutory Security To AP Secretariat System - Sakshi
Sakshi News home page

సచివాలయ వ్యవస్థకు ‘చట్ట’ భద్రత.. ఆర్డినెన్స్‌ జారీ

Published Tue, Dec 13 2022 3:04 AM | Last Updated on Tue, Dec 13 2022 11:29 AM

Ordinance Providing Statutory Security To AP Secretariat System - Sakshi

సాక్షి, అమరావతి: గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థకు కొత్తగా చట్టం తీసుకొస్తూ ప్రభుత్వం సోమవారం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే.. 2019 అక్టోబర్‌ 2వ తేదీ నుంచి రాష్ట్రంలో గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. అప్పట్లో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ నూతన వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చారు.

సోమవారం తాజా ఆర్డినెన్స్‌తో..  గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటికే అమలులో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టం, ఆంధ్రప్రదేశ్‌ మునిసిపాలిటీ, మునిసిపల్‌ కార్పొరేషన్‌ చట్టం తరహాలోనే సచివాలయ వ్యవస్థకు కూడా చట్ట రూపం వచ్చింది. రాజ్యాంగంలోని 11, 12 షెడ్యూళ్లలో పేర్కొన్న ప్రకారం ప్రజల కేంద్రంగా ప్రభుత్వ సేవలు, ఇతర సదుపాయాలను అందించేందుకు చట్టం ద్వారా గ్రామ/వార్డు సచివాల­యాల పేరుతో వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నట్టు ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు.  

స్థానిక సంస్థల చట్టాలకు అదనంగా..
రాష్ట్రంలో ప్రస్తుతం అమలులో ఉన్న పంచాయతీ­రాజ్, మునిసిపల్‌ చట్టాలకు అదనంగా గ్రామ/­వార్డు సచివాలయ వ్యవస్థ చట్టం ఉంటుందని ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు. ఈ ఆర్డినెన్స్‌తో గ్రామ/­వార్డు సచివాలయాల ద్వారా అందజేసే ప్రభుత్వ సేవలు, గ్రామ/వార్డు సచివాలయ శాఖ ద్వారా జారీ చేసే ఉత్తర్వులు శాసనాధికారంతో కూడిన­విగా ఉంటాయని అందులో పేర్కొన్నారు. గ్రామ/­వార్డు సచివాలయ ఉద్యోగుల నియామకంతో వారి సర్వీస్‌ అంశాలు కూడా ఆర్డినెన్స్‌లోని నిబంధన­లకు అనుగుణంగా చట్టబద్ధత కలిగి ఉంటాయని పేర్కొన్నారు. వచ్చే శాసనసభ సమావేశాల్లో ఈ ఆర్డినెన్స్‌కు చట్టసభల ఆమోదం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. 

చట్టంతో పూర్తిస్థాయి పటిష్టత
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే రాష్ట్రంలో గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటుపై ప్రకటన చేశారు. అనంతరం.. కొత్తగా 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు మంజూరు చేయడమే కాకుండా ఆ వెంటనే ఉద్యోగాల భర్తీ వంటి చర్యలన్నీ కేవలం 4నెలల వ్యవధిలోనే పూర్తయ్యాయి. 2019 అక్టోబర్‌ 2వ తేదీ గాంధీ జయంతి రోజున గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థ అధికారికంగా ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి రెండు వేల జనాభాకు, పట్టణ ప్రాంతాల్లో 4 వేల జనాభాకు ఒక సచివాలయం చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు కొలువుదీ­రాయి.

అంతకు ముందు కనీసం ఒక్క శాశ్వత ఉద్యోగి కూడా నియామకం జరగని చాలా గ్రామాల్లో కొత్తగా ఏర్పాటైన గ్రామ సచివాలయాల్లో 10 నుంచి 11 మంది వరకు శాశ్వత ఉద్యోగులను ప్రభు­త్వం నియమించింది. వీటిలో 545 రకాల సేవలను అందుబాటులోకి తీసు­కొచ్చారు. ప్రతి సచివాల­యా­నికి ఇంటర్‌నెట్‌­తోపాటు కంప్యూటర్లు, ప్రింటర్లసహా ఫర్నిచర్‌ను ప్రభుత్వం అందజేసింది. ఇప్పటివరకు గ్రామ/­వార్డు సచివాలయాల ద్వారా ప్రజలు వారి సొంత ఊరు దాటాల్సిన అవసరం కూడా లేకుండా 5 కోట్లకుపైగా ప్రజలు ప్రభుత్వ సేవలను వినియో­గిం­చు­కుంటున్నారు. దీనికి మరింత పటిష్టత తెచ్చేందుకు అడ్వకేట్‌ జనరల్‌ సూచన మేరకు ప్రభుత్వం ఈ వ్యవస్థకు చట్ట రూపం కూడా తీసుకొస్తూ తాజా ఆర్డినెన్స్‌ జారీ చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement