ఆ 82 గ్రామాలు మనకే
ఖమ్మం జిల్లా నుంచి ‘పశ్చిమ’లో విలీనం
ముంపుగ్రామాల ఆర్డినెన్స్ జారీ
పెరగనున్న జిల్లా విస్తీర్ణం.. జనాభా
ఏలూరు సిటీ, న్యూస్‌లైన్ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కమ్ముకున్న నీలినీడలు తొలగిపోనున్నా యి. ప్రాజెక్టు నిర్మాణం కారణంగా ఖమ్మం జిల్లా పరిధిలో ముంపుబారిన పడనున్న 205 గ్రామా ల్లో 82 గ్రామాలను మన జిల్లాలో విలీనం చేస్తూ ఆర్డినెన్స్ జారీ అయ్యింది. మిగిలిన గ్రామాలు తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి వెళతాయి. అయితే, గోదావరి పరీవాహక ప్రాంత పరిధిలోని ఖమ్మం జిల్లానుంచి పూర్తిస్థాయిలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉభయగోదావరి జిల్లాల్లో కలుస్తాయనే అంశంపై ఆర్డినెన్స్‌లో పొందుపరిచిన విషయూలేమిటనే దానిపై ఇంకా స్పష్టత లేదని ఇరిగేషన్ అధికారులు పేర్కొంటున్నారు.
మన జిల్లాకు 3మండలాలు.. 82 గ్రామాలు
ఖమ్మం జిల్లా పాల్వంచ రెవెన్యూ డివిజన్ పరిధిలోని కుకునూరు, వేలేరుపాడు, బూర్గంపహాడ్ మండలాల్లోని సుమారు 82 ముంపు గ్రామాలను మన జిల్లాలో విలీనం చేస్తారని అధికారులు చెబుతున్నారు. కుకునూరు మండలంలోని 34 గ్రామా లు, వేలేరుపాడు మండలంలోని 39 గ్రామాలు, బూర్గంపహాడ్ మండలంలోని 9 ముంపు గ్రామా లు మన జిల్లా పరిధిలోకి వస్తాయని పేర్కొంటున్నారు. వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఖమ్మం జిల్లాలో ఎన్ని మండలాలు, ఎన్ని గ్రామాలు ముంపుబారిన పడతాయనే అంశంపై ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయిలో స్పష్టత ఇవ్వలేదని తెలుస్తోంది. ఆయా మండలాలు, గ్రామ పంచాయతీలో కొంత ప్రాంతాన్ని మాత్రమే వేరు చేసేందుకు రెవెన్యూ అధికారులు ససేమిరా అనటం.. రికార్డులు వేరు చేయటం తలకు మించిన భారం అవుతుందనే కారణాలతో పంచాయతీల వారీగా విలీనం చేయాలంటూ రెవెన్యూ అధికారులు నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో పూర్తిస్థాయిలో ఏఏ గ్రామాలు, పంచాయతీలు విలీనం అవుతాయనే విషయమై ఆర్డినెన్స్‌లో ఏమైనా మార్పులు చేశారా అనే దానిపై స్పష్టత లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
పెరగనున్న జనాభా
ఖమ్మం జిల్లా పరిధిలోని ముంపు గ్రామాలు మన జిల్లాలో విలీనం కానుండటంతో జిల్లా విస్తీర్ణంతో పాటు జనాభా సైతం పెరగనుంది. ఐటీడీఏ పరిధిలో గిరిజన జనాభా కూడా భారీగా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. చిన్న ఐటీడీఏ కాస్తా భారీగా మారనుంది. ‘పశ్చిమ’ ఏజెన్సీలోని మూడు మండలాల్లో 1.24 లక్షల జనాభా ఉండగా, వారిలో 60 వేలకు పైగా గిరిజనులే. ముంపు గ్రామాల విలీనం నేపథ్యంలో మరో 70వేల జనాభా అదనంగా జిల్లాలో చేరనుంది. కుకునూరు మండలం నుంచి 35వేల మంది, వేలేరుపాడు మండలం నుంచి 25వేల మంది, బూర్గంపహాడ్ నుంచి 10వేలకు పైగా జనాభా అదనంగా ఐటీడీఏ పరిధిలో చేరే అవకాశం ఉంది.