DERC
-
విద్యుత్ ఆదా ఒప్పందానికి ఎన్డీఎమ్సీ యత్నాలు
న్యూఢిల్లీ: విద్యుత్ తక్కువ వినియోగం ఉండే శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని...కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖతో విద్యుత్ ఆదా ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్(ఎన్డీఎమ్సీ) ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ప్రస్తుత అగ్రిమెంట్ వల్ల ఢిల్లీ ట్రాన్స్‌కో లిమిటెడ్(డీటీఎల్),ఎన్డీమ్సీ సంవత్సరమంతా ఒకే పరిమాణంలో విద్యుత్‌ను కొనుగోలు చేసేవి. ‘వేసవి, శీతాకాలంలో విద్యుత్ వినియోగంలో చాలా తేడా ఉంటోంది. కాబట్టి ప్రస్తుత ఒప్పందాన్ని పునర్ పరిశీలించాలని మేం కేంద్ర మంత్రిత్వశాఖను కోరాం. ప్రధానంగా అక్టోబర్- ఏప్రిల్, మార్చి- సెప్టెంబర్‌లో ఉండే విద్యుత్ వినియోగ తేడాలను సరిచేయాలనుకుంటున్నాం’ అని ఎన్డీఎమ్సీ చైర్మన్ జలజ్ శ్రీవాత్సవ చెప్పారు. 2005 వరకు ఎన్డీమ్సీ తన పరిధిలోని అన్ని ప్రాంతాలకు మిగులు విద్యుత్‌ను మంచి ధరకు అమ్ముకునేందుకు ప్రభుత్వం అనుమతించేది. అయితే ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(డీఈఆర్సీ) ఈ విధానాన్ని పక్కన పెట్టింది. మిగులు విద్యుత్‌ను చాలా తక్కువ ధరకు డిస్కమ్‌లకు అమ్మాలనే నిబంధనను పెట్టింది. ఎక్కువ ధరకు విద్యుత్‌ను కొని, తక్కువ ధరకు అమ్మడం వల్ల గతేడాది ఎన్డీఎమ్సీ దాదాపు రూ. 150 కోట్లు నష్టపోయింది. అంతేకాక వినియోగదారులకు సక్రమంగా విద్యుత్‌ను అందించడం, వీధి దీపాల పర్యవేక్షణలో విఫలమయ్యారనే కారణాలతో కేంద్రహోం మంత్రిత్వ శాఖ...ఎన్డీఎమ్సీని తన చేతుల్లోకి తీసుకుంది. ‘ ఈ విషయాలపై మంత్రిత్వశాఖతో ఏప్రిల్‌లో మాట్లాడాలని నిర్ణయించుకున్నాం. కొనుగోలు, అమ్మకం విధానాల్లో స్థిరత్వం లేకపోవడంతో నష్టాలు వస్తున్నాయి. అందువల్ల ప్రస్తుత ఒప్పందాన్ని మార్చాల్సిన అవసరముంది’ అని శ్రీవాత్సవ వివరించారు. 150 మెగావాట్లు మాత్రమే వినియోగం: ప్రస్తుత ఒప్పంద వివరాలను ఎన్డీఎమ్సీ ఆర్థిక సలహాదారు కుమార్ హృషికేష్ విలేకరులకు వెల్లడించారు. ‘ప్రస్తుతం ఎన్డీఎమ్సీ ప్రతిరోజూ దాదాపు 380 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేస్తోంది. అయితే శీతాకాలంలో ప్రతిరోజూ కేవలం 150 మెగావాట్ల విద్యుత్ వినియోగం మాత్రమే ఉంటోంది. దీంతో 30 మెగావాట్ల మిగులు విద్యుత్‌ను వీవీఐపీ ప్రాంతాల్లో నిరంతరాయంగా కరెంటు ఉండటానికి వినియోగిస్తోంది. ఈ మొత్తం విద్యుత్ కూడా పూర్తిగా వినియోగించుకోవడం లేదు’ అని ఆయన చెప్పారు. ఢిల్లీలో కాకుండా ఎన్డీఎమ్సీలోని మిగిలిన ప్రాంతాల్లో విద్యుత్ చార్జీలు తక్కువగా ఉంటున్నాయి. నివాసప్రాంతాల్లో 200 యూనిట్లలోపు వినియోగదారులకు రూ. 3.25 ఉంటోంది. ఢిల్లీలో మాత్రం ఈ ధర రూ. 4గా ఉంది. ‘ ఇలాంటి పరిస్థితిల్లో ఇంకా తక్కువ ధరకు విద్యుత్‌ను డిస్కంలకు అమ్మడం వల్ల తీవ్ర ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తోంది. దీనిపై మేం పంపిన ప్రతిపాదన ఆమోదం పొందాల్సిన అవసరముంది. నష్టాలతో విద్యుత్‌ను అమ్మడం కుదరదు’ అని హృతికేష్ చెప్పారు. శుక్రవారం నుంచి 400 యూనిట్లలోపు విద్యుత్ వినియోగదారులకు 50 శాతం విద్యుత్ ధరను మినహాయింపు, ప్రతి ఇంటికి 20 లీటర్ల ఉచిత నీరును ఎన్డీఎమ్సీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
ఢిల్లీలో పెరిగిన విద్యుత్ చార్జీలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విద్యుత్ చార్జీలు 7 శాతం వరకు పెంచారు. పెంచిన చార్జీలు శనివారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఢిల్లీ విద్యుత్ నియంత్రణ మండలి (డీఈఆర్సీ) ఈమేరకు గురువారం నిర్ణయం తీసుకుంది. మూడు ప్రైవేటు విద్యుత్ పంపిణీ సంస్థల విజ్ఞప్తి మేరకు చార్జీలు పెంచినట్టు డీఈఆర్సీ తెలిపింది. బీఎస్ఈఎస్ యమునా పవర్ లిమిటెడ్ (బీవైపీల్) నుంచి విద్యుత్ వాడుకునే వారిపై 7 శాతం, బీఎస్ఈఎస్ రాజధాని పవర్ లిమిటెడ్ (బీఆర్‌పీఎల్) వినియోగదారులపై 4.5 శాతం, టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ (టీపీడీడీఎల్) వినియోగదారులపై 2.5 శాతం వడ్డించారు. -
స్వాధీనమయ్యేదెన్నడో?
తనకూ ఓ ఇల్లు కానీ, కనీసం స్థలంకానీ ఉండాలని సామాన్యులు ఆశిస్తారు. తక్కువ ధరలో కొనగలిగితే బాగుంటుందని భావిస్తారు. ప్రైవేటు బిల్డర్లు నిర్మించే ఫ్లాట్ల ధరలు అందుబాటులో ఉండవు కనుక ప్రభుత్వ ప్రాజెక్టులకు దరఖాస్తు చేసుకుంటారు. అందులో కొంతమందికే ఫ్లాట్లు దక్కుతాయి. మిగిలినవారికి మిగిలేది నిరాశే. అయితే అసలు కేటాయింపే జరగక పోతే ఇక వారు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలి. రోహిణీ ప్రాంతంలో 32 ఏళ్ల క్రితం డీడీఏ ప్లాట్లు దక్కినా అవి ఇప్పటికీ అందుబాటులోకి రాకపోవడంతో బాధితులకు ఎదురుచూపులే మిగిలాయి. న్యూఢిల్లీ: ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) ఇటీవల ప్రకటించిన నూతన గృహనిర్మాణ ప్రాజెక్టుకు రిజిస్ట్రేషన్లు జోరుగా జరుగుతున్నాయి. అనేకమంది నగరవాసులతోపాటు ఇతర ప్రాంతాలవారు వీటికోసం పెద్దసంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇదిలాఉంచితే 1982లో నగరంలోని రోహిణీ ప్రాంతంలో డీడీఏ నిర్మించిన స్థలాల కేటాయింపు ప్రక్రియ ఏనాడో పూర్తయినప్పటికీ వాటి దరఖాస్తుదారులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అక్కడ విద్యుత్, రహదారులు, మురుగుకాల్వలు వంటి మౌలిక వసతులను డీడీఏ ఇప్పటిదాకా కల్పించలేదు. దీంతో అనేకమంది బాధితులు ఈ ఏడాది జూన్‌లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం నాలుగు నెలల్లోగా దరఖాస్తుదారులకు అందజేయాలంటూ ఆదేశించింది. ఈ నేపథ్యంలో స్పందించిన డీడీఏ అధికారులు విద్యుత్ సరఫరా నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా ఢిల్లీ విద్యుత్ నియంత్రణ సంస్థ (డీఈఆర్సీ)ని ఆదేశించారు. ఈ మేరకు ఇటీవల ఓ లేఖ రాశారు. పనులను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని కోరారు. అంతేకాకుండా విద్యుత్ నెట్‌వర్క్‌కు సంబంధించి కనీస మౌలిక వసతులను కల్పించాల్సిందిగా టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ (టీపీడీడీఎల్)ను కూడా ఆదేశించారు. విద్యుత్‌కు సంబంధించిన పనులు పూర్తయితే తమ బడ్జెట్‌కు లోబడి గృహాలను నిర్మించుకునేందుకు లబ్ధిదారులు సిద్ధంగా ఉన్నారని సదరు లేఖలో అధికారులు పేర్కొన్నారు. ఈ విషయమై సంబంధిత అధికారి ఒక రు మీడియాతో మాట్లాడుతూ 1982లో దరఖాస్తు చేసినవారిలో కొంతమంది ఏడు సంవత్సరాల క్రితం స్థలాలు ఇచ్చామని అంగీకరించారు. త్వరలో రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తాం వివిధ కారణాలవల్ల 1982 నాటి పథకం కోసం దరఖాస్తు చేసుకున్నవారికి నిర్దిష్ట కాలవ్యవధిలోగా ప్లాట్లను కేటాయించడం సాధ్యం కాకపోవచ్చని తెలియజేస్తూ త్వరలో అత్యున్నత న్యాయస్థానంలో ఓ రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసేయోచనలో ఉన్నట్టు డీడీఏ అధికారి ఒకరు తెలియజేశారు. మాట నిలబెట్టుకోలేకపోయింది డీడీఏ తమకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయిందని 1982లో ప్లాట్‌కోసం దరఖాస్తు చేసుకున్న రాహుల్ గుప్తా అనే నగరవాసి వాపోయాడు. అప్పట్లో దరఖాస్తు చేసుకున్న వారిలో అనేకమందికి ప్లాట్లు ఇవ్వలేకపోయిన ఈ సంస్థ మళ్లీ తాజాగా గృహ పథకాన్ని ఎలా ప్రారంభిస్తుందని ఆయన ప్రశ్నించారు. 2003-07 మధ్యకాలంలో కేటాయింపులు జరిపిన ప్లాట్లకు సంబంధించి అంతర్గత మురుగుకాల్వల నిర్మాణం కోసం డీడీఏ అధికారులు ఇటీవల టెండర్లను ఆహ్వానించారు. -
జరిమానాలతోనే అంతా దారిలోకి..
న్యూఢిల్లీ: ఆకస్మిక తనిఖీలతో అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడం సాధ్యం కాదని నగరంలోని మూడు కార్పొరేషన్లు హైకోర్టుకు తెలియజేశాయి. వాటి స్థానంలో ఆర్థిక ప్రతిబంధాలను విధిస్తే బాగుంటుందని సూచించాయి. జస్టిస్ బదర్ దురేజ్ అహ్మద్, జస్టిస్ సిద్ధార్ధ్ మృదుల్ నేతృత్వంలోని ధర్మాసనానికి బుధవారం సమగ్ర వివరాలతో కూడిన ఓ నివేదికను అందజేశాయి. నగరంలో ప్రస్తుతం 1.52 లక్షల అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు అందులో పేర్కొన్నాయి. వీటి తొలగింపు విషయంలో తాము ఏమాత్రం సందేహించబోమని తెలిపాయి. ఇందుకు స్పందించిన ధర్మాసనం ఈ కేసు తదుపరి విచారణనాటికి అక్రమ నిర్మాణాల కూల్చివేతకు సంబంధించి ఓ కార్యాచరణ ప్రణాళికను తమకు అందజేయాలని సూచించింది. పట్టణ అభివృద్ధి విభాగం, ఢిల్లీ ప్రభుత్వ సలహాలు, సూచనలను జత చేయాలని పేర్కొంది. ఈ సమస్య పరిష్కారం విషయంలో ఈ మూడు కార్పొరేషన్లకు సహకరించాలంటూ ఢిల్లీ జల్‌బోర్డు (డీజేబీ), ఢిల్లీ విద్యుత్ నియంత్రణ సంస్థ (డీఈఆర్సీ)లను ఆదేశించింది. అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో ఏ విభాగమూ బాధ్యతలనుంచి తప్పుకునేందుకు యత్నించవద్దని హితవు పలికింది. తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఈడీఎంసీ) కమిషనర్ తన వాదనను కోర్టుకు వినిపిస్తూ తమ పరిధిలో కూడా అక్రమ నిర్మాణాలు ఉన్నాయన్నారు. వాటి యజమానులు క్రమబద్ధీకరణ కోసం ఎదురుచూస్తున్నారన్నారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు తాము ఎంతగానో యత్నించామని, అయినప్పటికీ పూర్తిస్థాయిలో సఫలం కాలేకపోయామన్నారు. ఇటువంటి నిర్మాణాలకు నీటి సరఫరాను నిలిపివేస్తే మున్ముందు ఈ సమస్య తీవ్రత తగ్గుతుందన్నారు. దీంతోపాటు పోలీసు నిఘా కూడా అవసరమన్నారు. నీరు, విద్యుత్ సరఫరాలను నిలిపివేయాల్సిందిగా ఢిల్లీ జల్ బోర్డుతోపాటు పంపిణీ సంస్థలకు తాము లేఖలు రాస్తున్నప్పటికీ ప్రయోజనం లేకపోతోందన్నారు. ఈ సంస్థలు అక్రమ నిర్మాణదారుల విషయంలో ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదన్నారు. -
విద్యుత్ చార్జీల మోత
సాక్షి, న్యూఢిల్లీ: విద్యుత్ కోతలతో సతమతమవుతోన్న ఢిల్లీవాసులపై మరోసారి విద్యుత్తు చార్జీల భారం పడింది. విద్యుత్ చార్జీలను 8.32 శాతం పెంచుతున్నట్లు ఢిల్లీ విద్యుత్ నియంత్రణ కమిషన్(డీఈఆర్సీ) ప్రకటించింది. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ పరిధిలోని ప్రాంతాల్లోని వినియోగదారులు మరింత ఎక్కువ పెంపు భారాన్ని మోయాల్సి ఉంటుంది. ఇక్కడ విద్యుత్తు చార్జీలను 9.52 శాతం పెంచారు. డీఈఆర్సీ చైర్మన్ పి.డి. సుధాకరం గురువారం ఈ విషయాన్ని ప్రకటించారు. విద్యుత్తు చార్జీలను స్వల్పంగా పెంచుతున్నామని, పవర్ పర్చేజ్ అగ్రీమెంట్ చార్జీలను(పీపీఏసీ) తొలగిస్తున్నందువల్ల విద్యుత్తు చార్జీల పెంపు భారం వినియోగదారులపై అంతగా ఉండదని ఆయన చెప్పారు. విద్యుత్తును తక్కువ ఖరీదుకు కొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు. గృహవినియోగదారులతోపాటు వ్యాపార, వాణిజ్య కార్యాకలాపాలకు వినియోగించే విద్యుత్ చార్జీలను కూడా పెంచారు. ఢిల్లీ మెట్రో విద్యుత్తు చార్జీలు 11 శాతం పెరిగాయి. ఢిల్లీకి సరఫరా అయ్యే విద్యుత్ ఎక్కువగా థర్మల్ ఆధారిత విద్యుత్తు కావడంతో బొగ్గు ధరలు పెరిగినందువల్ల విద్యుత్తు చార్జీలను పెంచాలని మూడు డిస్కంలు - బీఎస్ఈఎస్ రాజధాని పవర్ లిమిటెడ్, యమునా పవర్ లిమిటెడ్, టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ కంపెనీలు చేసిన డిమాండ్ మేరకు విద్యుత్తు చార్జీలను పెంచినట్లు సుధాకర్ చెప్పారు. 800 పై యూనిట్ల వారికే భారం.. విద్యుత్తు చార్జీల పెంపు భారం 800 యూనిట్లకు పైగా విద్యుత్ వాడే వినియోగదారులపై పడింది. 0- 200 యూనిట్ల స్లాబ్‌కు విద్యుత్తు చార్జీలను యూనిట్‌కు 10 పైసల చొప్పున, 201-400 యూనిట్ల స్లాబ్ కు చార్జీలను యూనిట్‌కు 15 పైసల చొప్పున, 401-800 యూనిట్ల వరకున్న స్లాబ్‌కు యూనిట్‌కు 50 పైసల చొప్పున, 801- 1,200 యూనిట్ల వరకున్న స్లాబ్‌కు యూనిట్‌కు రూ.1.10 చొప్పున చార్జీలను పెంచినట్లు సుధాకర్ ప్రకటించారు. 1,200 పైగా యూనిట్ల స్లాబ్‌కు కొత్తగా ప్రవేశపెట్టారు.1,200 పైనున్న విద్యుత్తు స్లాబ్‌కు యూనిట్‌కు రూ.1.75 చొప్పున చార్జీల పెంపు వర్తిస్తుంది. ఎన్డీఎమ్సీ ప్రాంతాలలో 200 -400 యూనిట్లకు యూనిట్‌కు 25 పైసల చొప్పున చార్జీలు పెరిగాయి. పీపీఏసీల తొలగింపుతో తగ్గిన భారం.. విద్యుత్తు చార్జీలను పెంచినప్పటికీ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ చార్జీలను(పీపీఏసీ) తొలగించారు. దీంతో నెలవారీ బిల్లులో సర్‌చార్జీల మోత ఉండదు. ప్రస్తుతం సర్‌చార్జీ పేరుతో ఆరు నుంచి ఎనమిది శాతం వసూలు చేస్తున్నారు. పీపీఏసీ తొలగించడం వల్ల 400 యూనిట్ల లోపు విద్యుత్తు వాడేవారికి నెలసరి బిల్లు మరింత తగ్గుతుందని సుధాకర్ చెప్పారు. గతంలో 70 శాతం వినియోగదారులు 400 యూనిట్ల వరకు ఉపయోగించేవారని ఆయన చెప్పారు. 800 యూనిట్ల కన్నాఎక్కువగా విద్యుత్తు వాడేవారికి నెలవారీ బిల్లు మాత్రం పెరగనుందన్నారు. పవర్ పర్చేజ్ కాస్ట్ అగ్రీమెంట్ చార్జీలను తొలగించడం వల్ల పెంచిన విద్యుత్తు చార్జీల పెంపుప్రభావం పెద్దగా ఉండదని, పీపీఏసీని మూడు నెలల వరకు తొలగిస్తున్నామని, దానిని అమలుచేయాలా వద్దా అనేదానిపై అక్టోబర్‌లో సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని సుధాకర్ తెలిపారు. పీపీఏసీ అవసరమని డీఈఆర్సీ అభిప్రాయపడితే మూడు నెలల తరువాత దానిని అమలుచేస్తామని, అలా జరిగినట్లయితే విద్యుత్తు చార్జీల పెంపు ప్రభావం నవంబర్‌లో కనిస్తుందని డీఈఆర్సీ అధికారులు తెలిపారు. విద్యుత్తు చార్జీల పెంపు వల్ల రూ.1,245 కోట్ల ఆదాయం లభిస్తుందని డీఈఆర్సీ అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని ససాన్‌లో అల్ట్రామెగాపవర్ ప్రాజెక్టు నుంచి విద్యుత్తును చౌకగా కొనే ప్రయత్నం చేస్తున్నట్లు డీఈఆర్సీ చైర్మన్ సుధాకర్ తెలిపారు. ప్రజల డిమాండ్ మేరకు సీజీహెచ్ఎస్, డీడీఏ కాలనీలలో పార్కింగ్ వంటి కామన్ ఏరియాలలో సాధారణ డొమెస్టిక్ స్లాబ్‌ల ప్రకారం విద్యుత్తు చార్జీలు వసూలు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటి వరకు ఈ కామన్ ఏరియాలకు అత్యధిక డొమెస్టిక్ స్లాబ్‌ను వర్తింపచేస్తున్నారని చెప్పారు. అలాగే పార్కులలో గృహేతర స్లాబ్‌ల ప్రకారం కాకుండా డొమెస్టిక్ స్లాబ్ ప్రకారం విద్యుత్తు చార్జీలను వసూలుచేస్తారు. తీవ్రంగా వ్యతిరేకించిన ఆప్, కాంగ్రెస్ విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయాన్ని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. తమ ప్రభుత్వం ఇచ్చిన సబ్సీడీని ఎత్తివేశారని, 50 శాతం సబ్సీడీ ఇస్తామన్న ఆమ్ ఆద్మీ పార్టీ నెలరోజులకే సబ్సీడీ ఇచ్చి పారిపోయిందని కాంగ్రెస్ అధ్యక్షుడు అర్వీందర్ సింగ్ లవ్లీ విమర్శించారు. ఎన్నికల సమయంలో 30 శాతం విద్యుత్తు సబ్సీడీ ఇస్తామని ప్రకటించిన బీజేపీ తన హామీని మరిచిపోయిందని ఆయన ఆరోపించారు. కేంద్రం వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకొని చార్జీలను త గ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యుత్తు చార్జీలను సగానికి తగ్గించవచ్చని, అయినా చార్జీలను పెంచుతున్నారని ఆప్ ఆరోపించింది. విద్యుత్తు చార్జీలను పెంచడం ప్రజలపై అదనపు భారం మోపడమేనని బీజేపీ నేత జగ్దీశ్ ముఖీ పేర్కొన్నారు. -
త్వరలో నిర్ణయం తీసుకుంటాం
న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలా లేకపోతే తాజాగా ప్రజల తీర్పు కోరాలా అనే విషయమై త్వరలో ఓ నిర్ణయానికొస్తామని బీజేపీ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ పేర్కొన్నారు. ఇందుకోసం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు సీనియర్లతో సమావేశమై వారి సలహాలు, సూచనలను స్వీకరిస్తామన్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షుడిగా శనివారం ప్రమాణ స్వీకారం చేసిన సతీష్ ఆదివారం మీడియాతో తన మనోభావాలను పంచుకున్నారు. ఒకవేళ తాజాగా ఎన్నికలు జరిగితే తమకు అత్యధిక స్థానాలు వస్తాయని ఆర్ఎస్ఎస్ నేతలతో సత్సంబంధాలు కలిగిన 52 ఏళ్ల సతీష్ చెప్పారు. కాగా తాజా ఎన్నికలకు కొంతమంది ఎమ్మెల్యేలు సుముఖంగా ఉండగా, మరికొందరు అయిష్టంగా ఉన్నారు. తాజా రాజకీయ స్థితిగతులను మరికొంతమంది ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అయితే అధిష్టానం ఇంకా ఎటువంటి నిర్ణయానికి రాలేదు. ఆ ఆరోపణలు సరికాదు తమ పార్టీ ఎమ్మెల్యేలను వారివైపు తిప్పుకునేందుకు బీజేపీ నాయకులు యత్నిస్తున్నారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చేసిన ఆరోపణలను సతీష్ ఖండించారు. ఆప్ లేదా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో తాను సంప్రదింపులు జరపలేదన్నారు. ఢిల్లీలో తాము కనుక అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలను 30 శాతం మేర తగ్గిస్తామన్నారు. గత ఎన్నికల సమయంలో తమ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో కూడా ఇదే ఉందన్నారు. మేనిఫెస్టో తమకు బైబిల్‌తో సమానమన్నారు. అందులో తాము ఏదిచెబితే అది చేయాల్సిందేనన్నారు. కాగా 2014-15కు సంబంధించి చార్జీల వివరాలను ప్రకటించేందుకు ఢిల్లీ విద్యుత్ నియంత్రణ సంస్థ (డీఈఆర్సీ) అన్నివిధాలుగా సన్నద్ధమైంది. పెరిగే అవకాశాలున్నాయంటూ సంబంధిత అధికారులు ఇప్పటికే సూచనప్రాయంగా వెల్లడించారు. ఈ విషయమై మీడియా సతీష్‌ను ప్రశ్నించగా పైవిధంగా స్పందించారు. ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వం లేనికారణంగా స్థానికులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. అందువల్ల ఎన్నికలు జరిగితేనే బాగుంటుందన్నారు. ఢిల్లీకి స్వతంత్ర రాష్ట్ర ప్రతిపత్తి కోసం కృషి చేస్తానన్నారు. ఈ దిశగానే ముందుకు సాగుతున్నా మన్నారు. ఇదిలాఉంచితే కొద్దినెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీకి స్వయంప్రతిపత్తి కల్పిస్తామంటూ బీజేపీ నాయకులు హామీ ఇచ్చిన సంగతి విదితమే. మరోవైపు రాష్ర్టంలో తాజా రాజకీయ స్థితిగతులపై లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ త్వరలో కేంద్ర ప్రభుత్వానికి ఓ నివేదిక పంపించే అవకాశముంది. దీని ఆధారంగా చేసుకుని రాష్ర్టపతి పాలనను కొనసాగించాలా లేక ఎన్నికలు నిర్వహించాలా అనే విషయమై కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. -
విద్యుత్ వినియోగదారులకు ఊరట
న్యూఢిల్లీ: సర్దుబాటు చార్జీల పేరుతో నగరవాసులపై భారం మోపేందుకు ప్రయత్నించిన డిస్కంలకు చుక్కెదురైంది. మరో రెండు నెలలపాటు ప్రస్తుతం కొనసాగిస్తున్న విధంగానే చార్జీలు వసూలు చేయాలని ఢిల్లీ విద్యుత్ నియంత్రణ మండలి(డీఈఆర్సీ)ఆదేశించింది. జూలైలో వార్షిక టారిఫ్ విధానాన్ని మరోసారి సమీక్షిస్తామని చెప్పింది. ప్రస్తుతం సర్దుబాటు చార్జీల పేరుతో బీఎస్ఈఎస్ రాజధాని పవర్ లిమిటెడ్ 6 శాతం, టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ 7 శాతం, బీఎస్ఈఎస్ యమున పవర్ లిమిటెడ్ 8 శాతం వసూలు చేస్తున్నాయి. మరో రెండు నెలలపాటు కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలని డిస్కంలను డీఈఆర్సీ ఆదేశించింది. గత మూడు నెలలుగా ఇవే చార్జీలను వసూలు చేస్తున్నామని, టారిఫ్‌ను 14 నుంచి 15 శాతం పెంచాలని డిస్కంలు డీఈఆర్సీని కోరడంతో అందుకు తిరస్కరిస్తూ మరో రెండు నెలల తర్వాత వార్షిక టారిఫ్ విధానాన్ని సమీక్షిస్తామని తెలిపింది. రూ. 2.95 పెరిగిన సీఎన్జీ నగరంలో సీఎన్జీ ధర రూ. 2.95 పెరిగింది. ప్రస్తుతం కిలో సీఎన్జీ ధర రూ.35.20 ఉండగా నేటి నుంచి రూ. 38.15 వెచ్చించి కొనాల్సి ఉంటుంది. పీఎన్జీ ధర కూడా యూనిట్‌కు రూపాయి చొప్పన పెరిగింది. ఉత్తరప్రదేశ్‌లో పన్నుల విధానమే వీటి ధర పెరగడానికి కారణమని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. విద్యుత్ బిల్లులు పెరగవంటూ డీఈఆర్సీ ప్రకటించిన విషయంపై సంతోష పడేలోపే ఇలా సీఎన్జీ, పీఎన్జీ భారం పడడంపై నగరవాసుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. సీఎన్జీ ధరలను తగ్గించాలని పలు ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
కరెంటు మంటలు
సాక్షి, న్యూఢిల్లీ: విద్యుత్ చార్జీలను తగ్గిస్తామని ప్రజలకు వాగ్దానం చేసిన ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వానికి.. చార్జీలను ఎనిమిది శాతం పెంచుతున్నట్టు ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (డీఈఆర్సీ) చేసిన ప్రకటన తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఇంధన వ్యయాల సర్దుబాటు చార్జీల పెంపునకు అనుగుణంగా విద్యుత్ సర్చార్జ్లను 6-8 శాతం పెంచవలసి వచ్చిందని డీఈఆర్సీ పేర్కొంది. చార్జీల పెంపును అరవింద్ కేజ్రీవాల్ సర్కారు ఖండించింది. ఓ పక్క విద్యుత్ కంపెనీల ఖాతాలను సీఏజీ (కాగ్) ఆడిట్ చేస్తుండగా మరోపక్క విద్యుత్ సర్‌చార్జీలను పెంచడం అనవసర చర్య అని ఢిల్లీ ప్రభుత్వ ప్రతినిధి పేర్కొన్నారు. నగరంలో విద్యుత్ చార్జీలను తగ్గిస్తామని ఆప్ ఎన్నికలకు ముందు ప్రజలకు వాగ్దానం చేసింది. అధికారంలోకి వచ్చిన తరువాత కొన్ని స్లాబ్‌లపై విద్యుత్ చార్జీలను 50 శాతం తగ్గించింది. ఇంధన వ్యయ సర్దుబాటు చార్జీలు పెరగడం వల్లే టారిఫ్‌ను పెంచాల్సి వచ్చిందని డీఈఆర్సీ చైర్మన్ పీడీ సుధాకర్ పేర్కొన్నారు.యమునాపవర్కు ఎనిమిది శాతం చొప్పున, రాజధాని పవర్‌కు ఆరుశాతం చొప్పున, టాటాపవర్‌కు ఏడుశాతం చొప్పున సర్దుబాటు చార్జీలు పెంచారు. డిస్కమ్‌లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని సుధాకర్ అన్నారు. డిస్కమ్‌ల విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని సర్దుబాటు చేయడం కోసం డీఈఆర్సీ 2012లో విద్యుత్ సర్చార్జిని ప్రవేశపెట్టింది. కాగ్ ఆడిట్ నివేదిక వచ్చేంతవరకు డీఈఆర్సీ వేచి ఉండాల్సిందని ఢిల్లీ ప్రభుత్వం అంటోంది. డిస్కమ్‌ల పనితీరుపై అనేక అనుమానాలు తలెత్తిన సమయంలో సర్‌చార్జీని పెంచి ప్రజలపై అదనపు భారం వేయడం సరైన చర్య కాదని ప్రభుత్వం పేర్కొంది. నిధుల లేమే కారణమంటున్న డిస్కమ్‌లు విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు బకాయిలు చెల్లించడానికి తన దగ్గర నిధులు లేవని బీఎస్ఈఎస్ ఢిల్లీ విద్యుత్‌శాఖ కార్యదర్శి పునీత్ గోయల్‌కు లేఖ రాసింది. బకాయిలు చెల్లించకపోవడంతో బ్యాంకులు కూడా రుణాలను ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయని వివరణ ఇచ్చింది. ఈ క్లిష్టపరిస్థితి నుంచి గట్టెక్కడానికి తక్షణం ఆర్థిక సహాయాన్ని అందించాలని ప్రభుత్వాన్ని కోరింది. అందుకే కోతలు విధిస్తున్నట్టు వివరణ ఇచ్చింది. కరెంటు ఉత్పత్తి కంపెనీలు ఎన్టీపీసీ, ఎన్‌హెచ్‌పీసీ, విద్యుత్ మంత్రిత్వశాఖ, ఆర్థిక మంత్రిత్వశాఖతో ఈ సమస్యపై చర్చలు జరపాలని కోరింది. డిస్కమ్‌లతో కేజ్రీవాల్ కుమ్మక్కు: కాంగ్రెస్ న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విద్యుత్ పంపిణీ కంపెనీల (డిస్కమ్‌లు)తో కుమ్మక్కై చార్జీలను పెంచారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ పరిణామానికి ముఖ్యమంత్రే పూర్తి బాధ్యుడని, ప్రజలను ఆయన వంచించారని కాంగ్రెస్ నాయకుడు హరూన్ యూసుఫ్ శనివారం ఆరోపించారు. టారిఫ్ పెంపు గురించి డీఈఆర్సీ ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ముందస్తుగానే సమాచారం ఇస్తుందని, పెంపు గురించి తనకు తెలియదన్న కేజ్రీవాల్ ప్రకటన అసత్యమని స్పష్టం చేశారు. కోతలు 11వ తేదీకి వాయిదా బకాయిలు చెల్లింపునకు పది రోజుల గడువు సాక్షి, న్యూఢిల్లీ: పదిగంటల విద్యుత్ కోతల నుంచి ఢిల్లీవాసులకు తాత్కాలికంగా ఊరట లభించింది. బకాయిలు చెల్లించడానికి విద్యుత్ ఉత్పాదన కంపెనీ ఎన్టీపీసీ డిస్కమ్‌లకు ఈనెల 11 వరకు గడువిచ్చింది. ఆలోపు బకాయిలు చెల్లించాలని బీఎస్ఈఎస్ రాజ ధాని, బీఎస్ఈఎస్ యమునా పవర్ లిమిటెడ్‌కు నోటీసులు జారీ చేసింది. బకాయిలు చెల్లించకుంటే విద్యుత్ సరఫరా నిలిపివే స్తామని హెచ్చరించింది. బీఆర్‌పీఎల్ రాజధాని పవర్ లిమిటెడ్ 271 కోట్ల రూపాయలు, బీఎస్ఈఎస్ యమునా పవర్ లిమిటెడ్ 204 కోట్ల రూపాయలు ఎన్టీపీసీకి బకాయిపడ్డాయి. బీఎస్ఈఎస్ రాజధాని సంస్థ విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఎన్టీపీసీ పేర్కొంది. దక్షిణ, పశ్చిమ ఢిల్లీలోని 18.5 లక్షల కుటుంబాలకు బీఎస్ఈఎస్ విద్యుత్ సరఫరా చేస్తోంది. -
మూడు నెలలు కావాలి
న్యూఢిల్లీ: విద్యుత్ చార్జీల తగ్గింపుపై ఢిల్లీ ప్రభుత్వం నుంచి తమకు ఇంతవరకు ఎటువంటి విజ్ఞప్తి రాలేదని ఢిల్లీ విద్యుత్ నియంత్రణ కమిషన్ (డీఈఆర్సీ) సోమవారం స్పష్టం చేసింది. ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వచ్చినా, ప్రస్తుతమున్న చార్జీలను సమీక్షించేందుకు కనీసం మూడు నెలలు పడుతుందని తెలిపింది. విద్యుత్ టారిఫ్‌ను 50 శాతం తగ్గిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసిన సంగతి తెల్సిందే. దీనిపై నాలుగైదు రోజుల్లో ఒక నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ శనివారం ప్రకటించారు. అయితే విద్యుత్ టారిఫ్ అంశంపై ప్రభుత్వం తమను ఇంతవరకు సంప్రదించలేదని డీఈఆర్సీ చైర్మన్ పీడీ సుధాకర్ చెప్పారు. పస్తుతం అమలవుతున్న విద్యుత్ టారిఫ్ విధానాన్ని తాము సమీక్షించడం లేదని ఆయన స్పష్టం చేశారు. చార్జీలను సమీక్షించేందుకు కనీసం మూడు నెలలు అవసరమని ఆయన పేర్కొన్నారు. రేట్లను ఖరారు చేసేముందు సంబంధిత అన్ని వర్గాల వారితో బహిరంగ విచారణ జరపాల్సి ఉంటుందని తెలిపారు. ఇదిలా ఉండగా, టారిఫ్‌ను తగ్గించాలంటే ప్రభుత్వం సబ్సిడీ మార్గాన్ని ఎంచుకోవాల్సి ఉంటుందని, అందుకు పాలనాపరమైన నిర్ణయం అవసరమని విద్యుత్ నిపుణులు అభిప్రాయపడ్డారు. నగరంలో సుమారు 40 లక్షల మంది విద్యుత్ గృహ వినియోగదారులుండగా, వీరికి ప్రస్తుతమున్న రేట్లలో సగం ధరకే విద్యుత్‌ను అందచేస్తే ప్రభుత్వంపై కనీసం ఐదువేల కోట్ల రూపాయల భారం పడుతుందని వారు అంచనా వేశారు. డీఈఆర్సీ వద్ద ఉన్న వివరాల ప్రకారం, నగరంలో విద్యుత్ సరఫరా చేస్తున్న మూడు ప్రైవేటు డిస్కాంలు ప్రస్తుతం రూ.19,500 కోట్ల రెవెన్యూ లోటును ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతమున్న టారిఫ్‌ను తగ్గిస్తే డిస్కామ్‌ల నిర్వహణ సామర్థ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని విద్యుత్ నిపుణులు పేర్కొంటున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం డిస్కాంల ఆదాయంలో 80 నుంచి 90 శాతం సొమ్ము విద్యుత్ కొనుగోలుకే పోతోంది. కేంద్ర, రాష్ట్ర రెగ్యులేటర్లు నిర్ణయించిన రేట్లకు డిస్కాంలు దీర్ఘకాలిక ఒప్పందాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలోని సంస్థల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నాయి. గత రెండేళ్ల కాలంలో విద్యుత్ కొనుగోలు ధర 300 శాతం పెరిగిందని, అదే కాలంలో టారిఫ్ మాత్రం 70 శాతం మాత్రమే పెరిగిందని నిపుణులు పేర్కొన్నారు. ఫలితంగా డిస్కాంలు రూ.19,500 కోట్ల లోటును ఎదుర్కొంటున్నాయని వివరించారు. గత ఆగస్టు నెలలో గృహ వినియోగదారులకు టారిఫ్‌ను ఐదు శాతం పెంచారు. ఆ వెంటనే అప్పటి ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ 400 యూనిట్లకన్నా తక్కువగా వినియోగించే వారికి సబ్సిడీని ప్రకటించారు. 2011లో టారిఫ్‌ను 22 శాతం, తిరిగి గత ఏడాది ఫిబ్రవరిలో మరో ఐదు శాతం పెంచారు. తిరిగి గత ఏడాది మే నెలలో రెండు శాతం, జూలైలో 26 శాతం మేరకు టారిఫ్‌ను పెంచారు.