తనకూ ఓ ఇల్లు కానీ, కనీసం స్థలంకానీ ఉండాలని సామాన్యులు ఆశిస్తారు. తక్కువ ధరలో కొనగలిగితే బాగుంటుందని భావిస్తారు. ప్రైవేటు బిల్డర్లు నిర్మించే ఫ్లాట్ల ధరలు అందుబాటులో ఉండవు కనుక ప్రభుత్వ ప్రాజెక్టులకు దరఖాస్తు చేసుకుంటారు. అందులో కొంతమందికే ఫ్లాట్లు దక్కుతాయి. మిగిలినవారికి మిగిలేది నిరాశే. అయితే అసలు కేటాయింపే జరగక పోతే ఇక వారు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలి. రోహిణీ ప్రాంతంలో 32 ఏళ్ల క్రితం డీడీఏ ప్లాట్లు దక్కినా అవి ఇప్పటికీ అందుబాటులోకి రాకపోవడంతో బాధితులకు ఎదురుచూపులే మిగిలాయి.
న్యూఢిల్లీ: ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) ఇటీవల ప్రకటించిన నూతన గృహనిర్మాణ ప్రాజెక్టుకు రిజిస్ట్రేషన్లు జోరుగా జరుగుతున్నాయి. అనేకమంది నగరవాసులతోపాటు ఇతర ప్రాంతాలవారు వీటికోసం పెద్దసంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇదిలాఉంచితే 1982లో నగరంలోని రోహిణీ ప్రాంతంలో డీడీఏ నిర్మించిన స్థలాల కేటాయింపు ప్రక్రియ ఏనాడో పూర్తయినప్పటికీ వాటి దరఖాస్తుదారులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అక్కడ విద్యుత్, రహదారులు, మురుగుకాల్వలు వంటి మౌలిక వసతులను డీడీఏ ఇప్పటిదాకా కల్పించలేదు. దీంతో అనేకమంది బాధితులు ఈ ఏడాది జూన్‌లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం నాలుగు నెలల్లోగా దరఖాస్తుదారులకు అందజేయాలంటూ ఆదేశించింది. ఈ నేపథ్యంలో స్పందించిన డీడీఏ అధికారులు విద్యుత్ సరఫరా నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా ఢిల్లీ విద్యుత్ నియంత్రణ సంస్థ (డీఈఆర్‌సీ)ని ఆదేశించారు. ఈ మేరకు ఇటీవల ఓ లేఖ రాశారు. పనులను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని కోరారు. అంతేకాకుండా విద్యుత్ నెట్‌వర్క్‌కు సంబంధించి కనీస మౌలిక వసతులను కల్పించాల్సిందిగా టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ (టీపీడీడీఎల్)ను కూడా ఆదేశించారు. విద్యుత్‌కు సంబంధించిన పనులు పూర్తయితే తమ బడ్జెట్‌కు లోబడి గృహాలను నిర్మించుకునేందుకు లబ్ధిదారులు సిద్ధంగా ఉన్నారని సదరు లేఖలో అధికారులు పేర్కొన్నారు. ఈ విషయమై సంబంధిత అధికారి ఒక రు మీడియాతో మాట్లాడుతూ 1982లో దరఖాస్తు చేసినవారిలో కొంతమంది ఏడు సంవత్సరాల క్రితం స్థలాలు ఇచ్చామని అంగీకరించారు.
త్వరలో రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తాం
వివిధ కారణాలవల్ల 1982 నాటి పథకం కోసం దరఖాస్తు చేసుకున్నవారికి నిర్దిష్ట కాలవ్యవధిలోగా ప్లాట్లను కేటాయించడం సాధ్యం కాకపోవచ్చని తెలియజేస్తూ త్వరలో అత్యున్నత న్యాయస్థానంలో ఓ రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసేయోచనలో ఉన్నట్టు డీడీఏ అధికారి ఒకరు తెలియజేశారు.
మాట నిలబెట్టుకోలేకపోయింది
డీడీఏ తమకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయిందని 1982లో ప్లాట్‌కోసం దరఖాస్తు చేసుకున్న రాహుల్ గుప్తా అనే నగరవాసి వాపోయాడు. అప్పట్లో దరఖాస్తు చేసుకున్న వారిలో అనేకమందికి ప్లాట్లు ఇవ్వలేకపోయిన ఈ సంస్థ మళ్లీ తాజాగా గృహ పథకాన్ని ఎలా ప్రారంభిస్తుందని ఆయన ప్రశ్నించారు. 2003-07 మధ్యకాలంలో కేటాయింపులు జరిపిన ప్లాట్లకు సంబంధించి అంతర్గత మురుగుకాల్వల నిర్మాణం కోసం డీడీఏ అధికారులు ఇటీవల టెండర్లను ఆహ్వానించారు.
స్వాధీనమయ్యేదెన్నడో?
Published Sun, Oct 5 2014 10:21 PM | Last Updated on Sat, Sep 2 2017 2:23 PM
Advertisement
Advertisement