న్యూఢిల్లీ: విద్యుత్ తక్కువ వినియోగం ఉండే శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని...కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖతో విద్యుత్ ఆదా ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్(ఎన్డీఎమ్‌సీ) ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ప్రస్తుత అగ్రిమెంట్ వల్ల ఢిల్లీ ట్రాన్స్‌కో లిమిటెడ్(డీటీఎల్),ఎన్డీమ్‌సీ సంవత్సరమంతా ఒకే పరిమాణంలో విద్యుత్‌ను కొనుగోలు చేసేవి. ‘వేసవి, శీతాకాలంలో విద్యుత్ వినియోగంలో చాలా తేడా ఉంటోంది. కాబట్టి ప్రస్తుత ఒప్పందాన్ని పునర్ పరిశీలించాలని మేం కేంద్ర మంత్రిత్వశాఖను కోరాం. ప్రధానంగా అక్టోబర్- ఏప్రిల్, మార్చి- సెప్టెంబర్‌లో ఉండే విద్యుత్ వినియోగ తేడాలను సరిచేయాలనుకుంటున్నాం’ అని ఎన్డీఎమ్‌సీ చైర్మన్ జలజ్ శ్రీవాత్సవ చెప్పారు. 2005 వరకు ఎన్డీమ్‌సీ తన పరిధిలోని అన్ని ప్రాంతాలకు మిగులు విద్యుత్‌ను మంచి ధరకు అమ్ముకునేందుకు ప్రభుత్వం అనుమతించేది.
అయితే ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(డీఈఆర్‌సీ) ఈ విధానాన్ని పక్కన పెట్టింది. మిగులు విద్యుత్‌ను చాలా తక్కువ ధరకు డిస్కమ్‌లకు అమ్మాలనే నిబంధనను పెట్టింది. ఎక్కువ ధరకు విద్యుత్‌ను కొని, తక్కువ ధరకు అమ్మడం వల్ల గతేడాది ఎన్డీఎమ్‌సీ దాదాపు రూ. 150 కోట్లు నష్టపోయింది. అంతేకాక వినియోగదారులకు సక్రమంగా విద్యుత్‌ను అందించడం, వీధి దీపాల పర్యవేక్షణలో విఫలమయ్యారనే కారణాలతో కేంద్రహోం మంత్రిత్వ శాఖ...ఎన్డీఎమ్‌సీని తన చేతుల్లోకి తీసుకుంది. ‘ ఈ విషయాలపై మంత్రిత్వశాఖతో ఏప్రిల్‌లో మాట్లాడాలని నిర్ణయించుకున్నాం. కొనుగోలు, అమ్మకం విధానాల్లో స్థిరత్వం లేకపోవడంతో నష్టాలు వస్తున్నాయి. అందువల్ల ప్రస్తుత ఒప్పందాన్ని మార్చాల్సిన అవసరముంది’ అని శ్రీవాత్సవ వివరించారు.
150 మెగావాట్లు మాత్రమే వినియోగం:
ప్రస్తుత ఒప్పంద వివరాలను ఎన్డీఎమ్‌సీ ఆర్థిక సలహాదారు కుమార్ హృషికేష్ విలేకరులకు వెల్లడించారు. ‘ప్రస్తుతం ఎన్డీఎమ్‌సీ ప్రతిరోజూ దాదాపు 380 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేస్తోంది. అయితే శీతాకాలంలో ప్రతిరోజూ కేవలం 150 మెగావాట్ల విద్యుత్ వినియోగం మాత్రమే ఉంటోంది. దీంతో 30 మెగావాట్ల మిగులు విద్యుత్‌ను వీవీఐపీ ప్రాంతాల్లో నిరంతరాయంగా కరెంటు ఉండటానికి వినియోగిస్తోంది. ఈ మొత్తం విద్యుత్ కూడా పూర్తిగా వినియోగించుకోవడం లేదు’ అని ఆయన చెప్పారు. ఢిల్లీలో కాకుండా ఎన్డీఎమ్‌సీలోని మిగిలిన ప్రాంతాల్లో విద్యుత్ చార్జీలు తక్కువగా ఉంటున్నాయి.
నివాసప్రాంతాల్లో 200 యూనిట్లలోపు వినియోగదారులకు రూ. 3.25 ఉంటోంది. ఢిల్లీలో మాత్రం ఈ ధర రూ. 4గా ఉంది. ‘ ఇలాంటి పరిస్థితిల్లో ఇంకా తక్కువ ధరకు విద్యుత్‌ను డిస్కంలకు అమ్మడం వల్ల తీవ్ర ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తోంది. దీనిపై మేం పంపిన ప్రతిపాదన ఆమోదం పొందాల్సిన అవసరముంది. నష్టాలతో విద్యుత్‌ను అమ్మడం కుదరదు’ అని హృతికేష్ చెప్పారు. శుక్రవారం నుంచి 400 యూనిట్లలోపు విద్యుత్ వినియోగదారులకు 50 శాతం విద్యుత్ ధరను మినహాయింపు, ప్రతి ఇంటికి 20 లీటర్ల ఉచిత నీరును ఎన్డీఎమ్‌సీ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
విద్యుత్ ఆదా ఒప్పందానికి ఎన్డీఎమ్‌సీ యత్నాలు
Published Sun, Mar 22 2015 10:51 PM | Last Updated on Wed, Oct 17 2018 3:46 PM
Advertisement
Advertisement