ఆకస్మిక తనిఖీలతో అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడం సాధ్యం కాదని నగరంలోని మూడు కార్పొరేషన్లు హైకోర్టుకు తెలియజేశాయి. వాటి స్థానంలో ఆర్థిక ప్రతిబంధాలను విధిస్తే
న్యూఢిల్లీ: ఆకస్మిక తనిఖీలతో అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడం సాధ్యం కాదని నగరంలోని మూడు కార్పొరేషన్లు హైకోర్టుకు తెలియజేశాయి. వాటి స్థానంలో ఆర్థిక ప్రతిబంధాలను విధిస్తే బాగుంటుందని సూచించాయి. జస్టిస్ బదర్ దురేజ్ అహ్మద్, జస్టిస్ సిద్ధార్ధ్ మృదుల్ నేతృత్వంలోని ధర్మాసనానికి బుధవారం సమగ్ర వివరాలతో కూడిన ఓ నివేదికను అందజేశాయి. నగరంలో ప్రస్తుతం 1.52 లక్షల అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు అందులో పేర్కొన్నాయి. వీటి తొలగింపు విషయంలో తాము ఏమాత్రం సందేహించబోమని తెలిపాయి. ఇందుకు స్పందించిన ధర్మాసనం ఈ కేసు తదుపరి విచారణనాటికి అక్రమ నిర్మాణాల కూల్చివేతకు సంబంధించి ఓ కార్యాచరణ ప్రణాళికను తమకు అందజేయాలని సూచించింది.
పట్టణ అభివృద్ధి విభాగం, ఢిల్లీ ప్రభుత్వ సలహాలు, సూచనలను జత చేయాలని పేర్కొంది. ఈ సమస్య పరిష్కారం విషయంలో ఈ మూడు కార్పొరేషన్లకు సహకరించాలంటూ ఢిల్లీ జల్‌బోర్డు (డీజేబీ), ఢిల్లీ విద్యుత్ నియంత్రణ సంస్థ (డీఈఆర్‌సీ)లను ఆదేశించింది. అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో ఏ విభాగమూ బాధ్యతలనుంచి తప్పుకునేందుకు యత్నించవద్దని హితవు పలికింది. తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఈడీఎంసీ) కమిషనర్ తన వాదనను కోర్టుకు వినిపిస్తూ తమ పరిధిలో కూడా అక్రమ నిర్మాణాలు ఉన్నాయన్నారు. వాటి యజమానులు క్రమబద్ధీకరణ కోసం ఎదురుచూస్తున్నారన్నారు.
అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు తాము ఎంతగానో యత్నించామని, అయినప్పటికీ పూర్తిస్థాయిలో సఫలం కాలేకపోయామన్నారు. ఇటువంటి నిర్మాణాలకు నీటి సరఫరాను నిలిపివేస్తే మున్ముందు ఈ సమస్య తీవ్రత తగ్గుతుందన్నారు. దీంతోపాటు పోలీసు నిఘా కూడా అవసరమన్నారు. నీరు, విద్యుత్ సరఫరాలను నిలిపివేయాల్సిందిగా ఢిల్లీ జల్ బోర్డుతోపాటు పంపిణీ సంస్థలకు తాము లేఖలు రాస్తున్నప్పటికీ ప్రయోజనం లేకపోతోందన్నారు. ఈ సంస్థలు అక్రమ నిర్మాణదారుల విషయంలో ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదన్నారు.